Abn logo
Oct 23 2021 @ 00:13AM

కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపద తాకట్టు

సభలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు వి.కృష్ణయ్య

సీపీఎం జిల్లా మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

 తెనాలిటౌన్‌, అక్టోబరు22: దేశంలోని ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రధాని నరేంద్రమోదీ  కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.కృష్ణయ్య ఆరోపించారు. శుక్రవారం తెనాలి ఎన్జీవో కల్యాణ మండపంలో సీపీఎం తూర్పు జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. కృష్ణయ్య మాట్లాడుతూ సంస్కరణల పేరుతో కేంద్రం ప్రవేశ పెట్టిన విద్యుత్‌ మీటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గిందన్నారు. కేంద్రం  ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలతో దేశంలో కంపెనీ తరహా వ్యవసాయం వస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కేఎస్‌. లక్ష్మణరావు పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. సభకు శ్రీనివాసకుమార్‌, భవన్నారాయణ, ఈమని అప్పారావు, సీహెచ్‌ మణిలాల్‌ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ బాబూరావు, డి.రమాదేవి మాట్లాడారు. సీనియర్‌ నాయకులు వై.ఎల్‌.నారాయణ పార్టీ పతాకాన్ని ఎగురవేయగా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాశం రామారావు నివేదిక ప్రవేశ పెట్టారు  ప్రజా నాట్యమండలి కళాకారులు అభ్యుదయ గీతాలు ఆలపించారు. ములకా శివసాంబిరెడ్డి, షేక్‌ హుస్సేన్‌ వలి తదితరులు పర్యవేక్షించారు.