Abn logo
Feb 24 2021 @ 11:58AM

స్టీల్ ప్లాంట్‌ విషయంలో కేబినెట్ నిర్ణయంపై అనుమానాలు: బీవీ రాఘవులు

విజయవాడ: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వద్దు ప్రత్యామ్నాయాలు చూడాలని కాబినెట్ నిర్ణయంపై అనుమానాలున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు  బీవీ రాఘవులు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రైవటీకరణకు ప్రత్యామ్నాయం అంటే ఏమిటి?... భూములు అమ్ముతారా?... జాయింట్ వెంచర్ లా చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయనికి అర్ధం చెప్పాలని డిమాండ్ చేశారు. భూములు అమ్మాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. భూములు అమ్మకుండా వాటి విలువ ఆధారంగా నిధులు తెచ్చుకోవచ్చని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి ఉపసంహరణ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రత్యామ్నాయం పేరుతో దొడ్డిదారిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమానికి మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.


నగర పాలక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయని..నగర పాలక సంస్థల్లో ప్రమాదకర సంస్కరణలు రాబోతున్నాయని తెలిపారు. నీటి మీటర్లు, ఆస్తి విలువ ఆధారిత పన్ను విధింపు, డ్రైనేజ్ పన్ను అమలు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు ఈ సంస్కరణలను వ్యతిరేకిస్తే, వైసీపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో అమలు చేయాలని చూస్తుందని బీవీ రాఘవులు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఈ సంస్కరణలను వ్యతిరేకించాలని..దీని వలన నగర ప్రజలపై పన్నుల రూపంలో పెను భారాలు పడతాయని అన్నారు. విద్యుత్ సవరణ 2020 చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం ఇక్కడ అమలు చేయాలని చూస్తుందని ఆగ్రహించారు. కేంద్రమే వెనక్కి తగ్గితే రాష్ట్రంలో మాత్రం ఆ చట్టాన్ని అమలు చేయాలని చూస్తున్నారన్నారు. ఇంటింటికి రేషన్ అనేది భారతంలో పద్మవ్యూహం లాంటిదన్నారు. ప్రజలు పద్మవ్యూహంలోకి వెళ్లి రాలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. రేషన్‌కు వాలంటీర్, డిప, డోర్ డెలివరీ అంటూ  మూడు కౌంటర్లు ఉన్నాయని... ప్రజలకు ఎటు వెళ్ళాలో అర్ధం కావడం లేదని అన్నారు. దీని వలన ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలని బీవీ రాఘవులు హితవుపలికారు. 

Advertisement
Advertisement
Advertisement