కరోనాతో చేతివృత్తులు కుదేలు

ABN , First Publish Date - 2020-08-13T10:20:18+05:30 IST

కరోనా మహమ్మారి చేతివృత్తులపై ఆధారపడి జీవించే బడుగుజీవులను కోలుకోలేని దెబ్బతీసింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఎంతో మంది

కరోనాతో చేతివృత్తులు కుదేలు

చేసేందుకు పనిలేదు...తినేందుకు తిండిలేదు

బతుకుబండి సాగేదెలా...

బావురుమంటున్న బడుగుజీవులు 

ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి 


కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 12: కరోనా మహమ్మారి చేతివృత్తులపై ఆధారపడి జీవించే బడుగుజీవులను కోలుకోలేని దెబ్బతీసింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఎంతో మంది బడుగుజీవులు చేసేందుకు పనిలేక...కూర్చుండి తినే స్థోమత లేక  విలవిలలాడుతున్నారు. మార్చి 22న జనతా కర్ఫ్యూతో ప్రారంభమైన కష్టాలు నాలుగు నెలలుగా పట్టిపీడిస్తూనే ఉన్నాయి. ఏదైనా పనిచేసి కుటుంబాన్ని పోషింకుందామనుకుంటే రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందేమోనన్న భయం వెంటాడుతోంది. నాయీబ్రాహ్మణులు, రజకులు, విశ్వబ్రాహ్మణులు, దర్జీలు, ఇళ్లలో పనిచేసేవారు, వంట మనుషులు, క్యాటరర్స్‌ ఇలా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. 


భయంభయంగా జీవితం

పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. దినసరి కూలీల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. తప్పని పరిస్థితుల్లో మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుకొని పనులకు వెళ్తున్నామని చెబుతున్నారు. కరోనా మహమ్మారి ఇప్పటికే చాలా మందికి సోకిందని, పొట్ట గడిచేందుకు పనికి వెళ్లక తప్పడం లేదన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ సరుకులతోపాటు ఆర్థిక సహాయాన్ని అందించాయని, జూన్‌ 1నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన తర్వాత వాటిని బంద్‌ చేసి రూపాయికి కిలో బియ్యం ఇస్తోందని, డబ్బులు ఇవ్వడం మానేసిందని అంటున్నారు. దీంతో కుటుంబపోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం మరింత పకడ్బందీ చర్యలు చేపట్టాలని, అప్పటి వరకు చేతివృత్తులపై ఆధారపడి జీవించే తమ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. కొవిడ్‌ బారిన పడిన పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స అందించాలని కోరుతున్నారు.  


నెలకు 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలి: పూసాల సంపత్‌కుమార్‌, తెలంగాణ రజక సంఘం వ్యస్థాపక అధ్యక్షుడు

కరోనాతో రజక వృత్తిపై జీవిస్తున్న అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రజలు బట్టలు ఉతికేందుకు, ఇతర పనులు చేసేందుకు ఇళ్లలోకి రానివ్వడం లేదు. దీంతో వారికి పూటగడవడం కష్టంగా మారింది. లాక్‌డౌన్‌ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని అందించాయి. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు వాటిని నిలిపివేసి 10 కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నాయి. కుల వృత్తి చేసుకుంటూ జీవిస్తున్న రజకులకు నెలకు 10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలి. 


కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బతీసింది.. ప్రభుత్వం ఆదుకోవాలి- కరోనా బాధితుడు,  సెలూన్‌ యజమాని,  కరీంనగర్‌

కరోనా భయంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దుకాణాన్ని నడిపేవాడిని. నాతోపాటు మరోముగ్గురు నలుగురికి ఉపాధి  కల్పించేవాడిని. లాక్‌డౌన్‌ నుంచి ప్రజలు కటింగ్‌, సేవింగ్‌ చేసుకునేందుకు రావడం లేదు.  గత నెల 23న నాకు, నా భార్య, ఇద్దరు కుమారులు, కోడలు, మనుమడు మొత్తం ఆరుగురికి కరోనా సోకింది. హైదరాబాద్‌ యశోదా ఆస్పత్రి డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్నాము. ఇప్పటి వరకు మూడున్నర లక్షల రూపాయల వరకు ఖర్చుపెట్టాం. ఇటీవలనే మేమంతా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. నాకు కరోనా వచ్చినప్పటి నుంచి దుకాణంబంద్‌ చేశా. ఒక్క రూపాయి కూడా సంపాదన లేదు. చికిత్స కోసం మూడు లక్షల వరకు అప్పుచేశా. దుకాణం కిరాయి ఏడు వేలు, కరెంటు బిల్లు 500 మీదపడ్డాయి. నాలాగే ఎంతో మంది తమ వృత్తిపై ఆధారపడి జీవించే వారు గిరాకీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. సెలూన్లపై ఆధారపడి జీవించే వారికి నెలకు 10 వేల చొప్పన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి. 

Updated Date - 2020-08-13T10:20:18+05:30 IST