మృతుడి పేరిట ఆధార్‌ సృష్టించి ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌

ABN , First Publish Date - 2022-01-29T05:17:32+05:30 IST

మృతి చెందిన వ్యక్తి పేరిట నకిలీ ఆధార్‌ను సృష్టించిన మరో వ్యక్తి ప్లాటును రిజిస్ర్టేషన్‌ చేసుకున్న ఉదంతం పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది.

మృతుడి పేరిట ఆధార్‌ సృష్టించి ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌
నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

భార్య ఫిర్యాదుతో వెలుగులోకి

పోలీసుల అదుపులో నిందితులు

రూ. 4.70 లక్షల సొమ్ము రికవరీ

పటాన్‌చెరు, జనవరి 28: మృతి చెందిన వ్యక్తి పేరిట నకిలీ ఆధార్‌ను సృష్టించిన మరో వ్యక్తి ప్లాటును రిజిస్ర్టేషన్‌ చేసుకున్న ఉదంతం పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ బండ్లగూడ జాగీర్‌, సాయిరాంనగర్‌ కాలనీకి చెందిన దాసరి వర్జీనియా(80) అనే వృద్ధురాలి భర్త రాజారత్నం గతంలోనే మృతి చెందాడు. అయితే అతడి పేరు మీద పటాన్‌చెరు మండలం ఇంద్రేశం సర్వేనెంబర్‌ 113, 108లోని వికాస్‌ సొసైటీ కాలనీలో 689ప్లాటు నెంబర్‌లో 500గజాల స్థలం ఉంది. ఇటీవల వృద్ధురాలి కుటుంబ సభ్యులు ఆన్‌లైన్‌లో సదరు ప్లాట్‌కు సంబంధించిన ఈసీ పరిశీలించగా ఆ స్థలాన్ని ఇతరులకు విక్రయించినట్లు తెలిసింది. దీంతో బాధితురాలు  ఈ నెల 25న పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సబ్‌రిజిస్ట్రార్‌, రెవెన్యూ అధికారులు సీరియ్‌సగా దర్యాప్తు చేయడంతో అసలు బాగోతం వెలుగు చూసింది. దీంతో నిందితుల నుంచి రూ.4,70,000లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో  సుధీర్‌కుమార్‌, అనిరుద్‌రెడ్డి, బాలక్రిష్ణ, లక్ష్మయ్యలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ప్రధాన నిందితుడు మురళీకృష్ణ పరారీలో ఉన్నాడు. కోర్టు నుంచి మరో మారు నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని మిగతా నగదును రికవరీ చేస్తామని పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.


పక్కా  ప్లాన్‌తో అమ్మేశారు

దర్యాప్తులో వెలుగు చూసిన విషయాలు ఇలా ఉన్నాయి. సుమారు పదేళ్ల క్రితం రాజారత్నం జీవించి ఉన్నప్పుడు బంజారాహిల్స్‌ ఎన్‌బీటీ నగర్‌కు చెందిన సుధీర్‌కుమార్‌(37) కుటుంబం వద్ద సదరు ప్లాటు ఒరిజినల్‌ డాక్యుమెంట్లను కుదువ పెట్టి కొంత అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చకపోవడంతో డాక్యుమెంట్‌ సుధీర్‌కుమార్‌ వద్దే ఉండిపోయింది. సదరు డాక్యుమెంట్‌ ఆధారంగా ప్లాటును విక్రయించి సొమ్ము చేసుకోవాలని కుట్ర చేశాడు. అందుకు అమీర్‌పేట్‌ ఎల్లరెడ్డిగూడకు చెందిన కల్లూరు మురళీకృష్ణ(37) అనే వ్యక్తిని ఆశ్రయించారు. మురళీకృష్ణ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ కూకట్‌పల్లికి చెందిన బాలక్రిష్ణ (40)సహకారం తీసుకున్నాడు. చనిపోయిన రాజారత్నం పేరుమీద ఆధార్‌ సృష్టించేందుకు నిందితులు మురళీకృష్ణ తన తండ్రి కల్లూరి లక్ష్మయ్య(72)ఆధార్‌లో తగిన మార్పులు చేర్పులు చేసేందుకు మీసేవలో దరఖాస్తు చేసుకున్నారు. కూకట్‌పల్లి ఆల్విన్‌ కాలనీలోని మీసేవా సెంటర్‌ నడిపే తుమ్మల అనిరుద్‌రెడ్డి(28) సహకారంతో లక్ష్మయ్య అడ్ర్‌సతో పాటు పేరును కూడా మార్చేశాడు. డాక్యుమెంట్‌ మీద ఉన్న రాజారత్నం పేరుతో పాటు అడ్రస్‌ సైతం వచ్చేలా ఆధార్‌ను సృష్టించారు. సృష్టించిన ఆధార్‌తో రాజారత్నం పేరుతో కొత్తగా బ్యాంకు అకౌంట్‌ను సైతం తీయడం గమనార్హం. చనిపోయిన రాజారత్నం పేరుతో ఉన్న 7971/1986 డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో సమర్పించి రూ. 22లక్షలకు ప్లాటును ఇతరులకు విక్రయించారు.  

Updated Date - 2022-01-29T05:17:32+05:30 IST