కార్డు బకాయి భారమవుతోందా?

ABN , First Publish Date - 2020-06-14T05:56:01+05:30 IST

కరోనాతో జనాలంతా హైరానా! ఆదాయం ఆవిరైపోవడంతో శోకాలు మిన్నంటుతున్నాయి. ఆర్థిక స్తోమత తగ్గడంతో అప్పులు చెల్లించలేని పరిస్థితి. బ్యాంకులు ఆఫర్‌ చేస్తోన్న మారటోరియం తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా...

కార్డు బకాయి భారమవుతోందా?

  • బంధనాల్లోంచి బయటపడొచ్చిలా.. 


కరోనాతో జనాలంతా హైరానా! ఆదాయం ఆవిరైపోవడంతో శోకాలు మిన్నంటుతున్నాయి. ఆర్థిక స్తోమత తగ్గడంతో అప్పులు చెల్లించలేని పరిస్థితి. బ్యాంకులు ఆఫర్‌ చేస్తోన్న మారటోరియం తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా ఆనక వడ్డీ భారంతో నడ్డీ విరగనుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డు రుణగ్రస్తుల ముందున్న పలు ప్రత్యామ్నాయాలు.. 


క్రెడిట్‌ కార్డుంటే అత్యవసరాల్లో ఆర్థిక భరోసా. తెలివిగా ఉపయోగించుకోగలిగితే ప్రయోజనం. దుర్వినియోగపరిస్తే చిక్కులు ఖాయం. కానీ, కరోనా.. ఊహించని పరిణామం. కష్టకాలంలో ఉపయోగపడే క్రెడిట్‌ కార్డు బకాయిప్పుడు పెద్ద కష్టంగా మారింది చాలామందికి. ఆచితూచి కార్డు వినియోగించే వారూ ఈ అసాధారణ పరిస్థితుల్లో రుణ బంధనాల్లో చిక్కుకోవాల్సి వచ్చిం ది. కార్డు బకాయి చెల్లించకపోవడమంటే.. వడ్డీ, చక్రవడ్డీల గుదిబండను మోయడమే. ఇది వారి బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేయడమే కాదు.. బకాయి తీరే వరకు భవిష్యత్‌ ఆదాయాన్నీ మింగేస్తుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకున్న మార్గాలు.. 


బకాయిల బదిలీ: క్రెడిట్‌ కార్డ్‌ బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా చెల్లించాల్సిన బకాయిని తక్కువ వడ్డీతో కూడిన ఈఎంఐ పేమెంట్‌ ఆప్షన్‌కు మారవచ్చు. ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులున్న వారికిది మంచి ప్రత్యామ్నాయం. అన్ని కార్డుల బకాయిలను ఒకే కార్డుపైకి బదిలీ చేసుకోవడం మేలు. తద్వారా అదనపు వడ్డీ భారం లేకుండానే చెల్లింపులకు మరింత సమయం లభిస్తుంది. 


స్నోబాల్‌ మెథడ్‌: పలు బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో చిన్న మొత్తాలతో మొదలు పెట్టి క్రమంగా ఒక్కొక్కటీ తీర్చుకుంటూ వెళ్లడమే స్నోబాల్‌ మెథడ్‌. ఒక్కొక్క కార్డు బ్యాలెన్స్‌ను తీర్చుకుంటూ వెళ్లడం ద్వారా మీ క్రెడిట్‌ రేటింగ్‌ స్కోర్‌తోపాటు మొత్తంగా వినియోగించుకోగలిగే క్రెడిట్‌ లిమిట్‌ కూడా మెరుగుపడుతూ వస్తుంది. 


పెట్టుబడుల ఉపసంహరణ: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తదితర పెట్టుబడులను వెనక్కి తీసుకొని కార్డు బకాయిలు పరిష్కరించుకోవడం మరో ప్రత్యామ్నాయం. తద్వారా అధిక వడ్డీల భారం తప్పుతుంది. అయితే,  అత్యవసర పరిస్థితుల్లో పనికొచ్చే పొదుపు సొమ్మును మరే గత్యంతరం లేకపోతే తప్ప బయటికి తీయవద్దని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.


వ్యక్తిగత రుణం 

వ్యక్తిగత రుణం తీసుకొని కార్డు బకాయిలు చెల్లించడం మరో ప్రత్యామ్నాయం. చెల్లించాల్సిన బకాయి అధిక స్థాయిలో ఉన్న వారికిది మెరుగైన ఆప్షన్‌. ఎందుకంటే, కార్డు బకాయిపై విధించే వార్షిక వడ్డీ 36-40 శాతం స్థాయిలో ఉంటుంది. వ్యక్తిగత రుణమైతే 11-24 శాతం వడ్డీకే లభిస్తుంది. తద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. 


టాప్‌అప్‌ లోన్స్‌ 

ఇప్పటికే తీసుకున్న గృహ రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నవారికీ బ్యాంకులు టాప్‌అప్‌ లోన్స్‌ను ఆఫర్‌ చేస్తుంటాయి. ఈ రుణాలు తీసుకోవడమూ సులువే. టాప్‌అప్‌ లోన్‌ సొమ్ముతో కార్డు బకాయిలను పరిష్కరించుకోగలిగితే వడ్డీ భారం గణనీయంగా తగ్గించుకోవచ్చు. అయితే, హోమ్‌లోన్‌పై తీసుకునే టాప్‌లోన్‌పై వ్యక్తిగత ఆదాయ పన్ను రాయితీ మాత్రం లభించదు. 


Updated Date - 2020-06-14T05:56:01+05:30 IST