నమ్మించి 1.73లక్షలు కొట్టేసిన కిలాడీ లేడి..

ABN , First Publish Date - 2021-05-16T15:24:07+05:30 IST

ఆమె మీ ఖాతాలో మరుసటి రోజు ఆ డబ్బులు

నమ్మించి 1.73లక్షలు కొట్టేసిన కిలాడీ లేడి..

హైదరాబాద్/రాజేంద్రనగర్‌ : బ్యాంకు అధికారులమని చెప్పి ఓ వ్యక్తి క్రెడిట్‌కార్డు నుంచి రూ. 1.73 లక్షలను కాజేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కిస్మత్‌పూర్‌కు చెందిన నాగేశ్వర్‌రావు అనే వ్యక్తికి బ్యాంకులో ఖాతా ఉంది. ఆయనకు క్రెడిట్‌ కార్డు కూడా ఉంది. ఈ నెల 12వ తేదీన ఆయన సెల్‌కు బ్యాంకు అధికారిని అని చెబుతూ ఓ మహిళ ఫోన్‌ చేసింది. మీ క్రెడిట్‌ కార్డుపై ఇన్సూరెన్స్‌ ఉందని చెప్పింది. అంతేకాకుండా ఆయన క్రెడిట్‌ కార్డుకు చెందిన ఎనిమిది నెంబర్‌లను చెప్పింది. అయితే నాగేశ్వర్‌రావు తనకు ఇన్సూరెన్స్‌ వద్దని ఆమెతో చెప్పాడు. దానికి ఆమె మీరు ఇన్సూరెన్స్‌ తీసుకోకపోయిన మీ ఖాతా నుంచి రూ.49వేలు కట్‌ అవుతాయని చెప్పింది. అయితే ఆ డబ్బులు కట్‌ కాకుండా ఉండాలంటే మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నెంబర్‌ చెప్పాలని అతన్ని నమ్మబలికింది.


నిజమని నమ్మిన నాగేశ్వర్‌రావు తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నెంబర్‌ను చెప్పాడు. దీంతో అవతలి మహిళ ఆయన ఖాతా నుంచి రూ. 99వేలు  డ్రా చేసింది. మళ్లీ నాగేశ్వర్‌రావును మాటల్లో పెట్టి మరో రెండుసార్లు ఓటీపీ నెంబర్‌లను అడిగిన ఆ మహిళ అతని ఖాతా నుంచి మొత్తం రూ. 1.73లక్షలను కాజేసింది. ఫోన్‌ పెట్టేసిన తర్వాత తన ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ల ప్రకారం తన ఖాతా నుంచి రూ. 1.73లక్షలు డ్రా అయ్యాయని తెలుసుకున్నాడు. వెంటనే తనకు ఫోన్‌ చేసిన మహిళకు తిరిగి ఫోన్‌ చేసి తన ఖాతా నుంచి రూ.1.73 లక్షలు కట్‌ అయ్యాయని చెప్పాడు. దానికి ఆమె మీ ఖాతాలో మరుసటి రోజు ఆ డబ్బులు జమ అవుతాయని చెప్పింది. 13వ తేదీ వరకు కూడా బ్యాంకులో డబ్బులు జమ కాకపోవడంతో నాగేశ్వర్‌రావు శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ కె.కనకయ్య దర్యాప్తు చేస్తున్నారు.   

Updated Date - 2021-05-16T15:24:07+05:30 IST