క్రెడిట్‌ కార్డులతో కొనుగోళ్ల హవా

ABN , First Publish Date - 2021-12-04T06:08:40+05:30 IST

అప్పు చేసి పప్పు కూడు తినొద్దనేది పెద్దల మాట. ఈ తరం ఆ మాటను పక్కన పెట్టేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా......

క్రెడిట్‌ కార్డులతో కొనుగోళ్ల హవా

 అక్టోబరులో రూ.లక్ష కోట్లపైనే

న్యూఢిల్లీ: అప్పు చేసి పప్పు కూడు తినొద్దనేది పెద్దల మాట. ఈ తరం ఆ మాటను పక్కన పెట్టేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. క్రెడిట్‌ కార్డు ఉంటే చాలు. వందలు వేలు పెట్టి ఏదో ఒకటి కొనేస్తోంది. ఈ ఏడాది అక్టోబరులో ఇలా క్రెడిట్‌ కార్డులతో భారతీయుల చేసిన ఖర్చులు రూ.1,01,229 కోట్లకు చేరటమే ఇందుకు నిదర్శనం. సెప్టెంబరుతో పోలిస్తే ఇది 25ు ఎక్కువ. ఒక నెల క్రెడిట్‌ కార్డుల ఖర్చులు గతంలో ఎన్నడూ ఇలా రూ.లక్ష కోట్లు దాటలేదు. 


కలిసొచ్చిన పండగల సీజన్‌: ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌ కష్టాల నుంచి బయట పడడంతో పాటు దసరా, దీపావళి కూడా ఇందుకు కలిసొచ్చాయి. ఈ క్రెడిట్‌ కార్డుపై కొంటే ఇంత, ఆ క్రెడిట్‌ కార్డుపై కొంటే ఇంత డిస్కౌంట్‌ లేదా మనీ బ్యాక్‌ అంటూ కంపెనీలు, బ్యాంకులు చేసిన ప్రచారమూ ఇందుకు కలిసొచ్చింది. దీంతో గత ఏడాది అక్టోబరులో నమోదైన రూ.64,891 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో క్రెడిట్‌ కార్డులపై కొనుగోళ్లు ఏకంగా 56 శాతం పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతోందనేందుకూ ఇదో ప్రధాన సూచన అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 


ఢోకా ఉండక పోవచ్చు: క్రెడిట్‌ కార్డులతో చేసిన ఖర్చులకు మున్ముందు కూడా ఎలాంటి ఢోకా ఉండక పోవచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా. జాబ్‌ మార్కెట్‌ పుంజుకోవడం, ఐటీ ఉద్యోగుల జీతాల పెరుగుదల ఇందుకు ప్రధానంగా దోహదం చేయనున్నాయి. ఆర్‌బీఐ ఆంక్షలతో దాదాపు ఎనిమిది నెలలు మార్కెట్‌కు దూరంగా ఉన్న హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ ఇప్పుడు మరింత దూకుడుగా క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ కూడా ఇదే దూకుడుతో కొత్త కార్డులు జారీ చేస్తున్నాయి. ఇవన్నీ క్రెడిట్‌ కార్డులపై చేసే ఖర్చుల్ని మరింత పెంచనున్నాయి. 

Updated Date - 2021-12-04T06:08:40+05:30 IST