‘బబుల్‌’ దాటారని..

ABN , First Publish Date - 2021-01-03T09:07:22+05:30 IST

మరో నాలుగు రోజుల్లో మూడో టెస్టుకు సిద్ధం కావాల్సిన వేళ.. భారత క్రికెట్‌ జట్టుకు నిజంగా ఇది ఊహించని పరిణామమే. బయో సెక్యూర్‌ బబుల్‌ను అతిక్రమించారనే కారణంతో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ...

‘బబుల్‌’ దాటారని..

  • ఐసోలేషన్‌లో రోహిత్‌, పంత్‌, గిల్‌, పృథ్వీ, సైనీ
  • విచారణకు ఆదేశించిన సీఏ, బీసీసీఐ


మెల్‌బోర్న్‌: మరో నాలుగు రోజుల్లో మూడో టెస్టుకు సిద్ధం కావాల్సిన వేళ.. భారత క్రికెట్‌ జట్టుకు నిజంగా ఇది ఊహించని పరిణామమే. బయో సెక్యూర్‌ బబుల్‌ను అతిక్రమించారనే కారణంతో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, యువ క్రికెటర్లు శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌, నవ్‌దీప్‌ సైనీ, పృథ్వీ షాలను క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఐసోలేషన్‌లో ఉంచింది. నూతన సంవత్సరం తొలి రోజున వీరంతా కలిసి స్థానిక రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేసిన వీడియోను ఓ అభిమాని ట్విటర్‌లో పోస్ట్‌ చేయడమే దీనికి కారణం. పైగా వీరి బిల్లును తానే కట్టడంతో పాటు పంత్‌ను కౌగిలించుకున్నట్టు సదరు అభిమాని ట్వీట్‌ చేశాడు. దీంతో బయటి వ్యక్తులను కలుసుకున్నారంటూ ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్‌లో ఉంచాలని సీఏ ఆదేశించింది. ‘సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియోపై మాతో పాటు బీసీసీఐ కూడా విచారణకు ఆదేశించింది. అయితే నిజంగానే క్రికెటర్లు నిబంధనలు అతిక్రమించారా? లేదా? తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. బీసీసీఐ, సీఏ మెడికల్‌ టీమ్‌ సూచనల ప్రకారం ముందు జాగ్రత్తగా వీరిని ఐసోలేషన్‌లో ఉంచాం. కఠిన ప్రొటోకాల్‌ మధ్య ఈ ఐదుగురి ప్రాక్టీస్‌ కొనసాగుతుంది. సిడ్నీకి కూడా వీరంతా విడిగా ప్రయాణిస్తారు’ అని సీఏ ప్రకటించింది. ఈ ఐసోలేషన్‌ ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది? విచారణ ఎప్పటిలోగా ముగుస్తుందనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు.


ఈనెల 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆడేందుకు రోహిత్‌, గిల్‌, పంత్‌లను అనుమతిస్తారా? అనే ప్రశ్నకు కూడా సీఏ నేరుగా సమాధానమివ్వలేదు. కరోనా ఉధృతి నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీ్‌సను బయో సెక్యూర్‌ నిబంధనల ప్రకారం సీఏ జరుపుతున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా ఆటగాళ్లు రెస్టారెంట్లకు వెళ్లినా అవుట్‌డోర్‌లో కూర్చుని తినాలి. కానీ రోహిత్‌ బృందం అందరితో పాటే లోపల భోజనం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ఈ విషయమై సీఏ, బీసీసీఐ విచారణకు ఆదేశించాయి. రోహిత్‌ 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకుని బుధవారమే జట్టుతో కలిశాడు.


మా వారికి నిబంధనలు తెలుసు: బీసీసీఐ

భారత క్రికెటర్లు బయో బబుల్‌ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా అతిక్రమించలేదని బీసీసీఐ భావిస్తోంది. ఈ విషయంలో తమ ఆటగాళ్లకు మద్దతిచ్చింది. మంకీ గేట్‌ వివాదంలో క్రికెటర్లంతా కలిసికట్టుగా ఉన్న మాదిరే ఈసారి కూడా అలా గే ఉండాలనే ఆలోచనలో బోర్డు ఉంది. రెస్టారెంట్‌ ఉదంతం తొలిసారి మీడియాలో రాగానే బీసీసీఐ ఖండించింది. తమ క్రికెటర్లు నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. ‘ఇదంతా ఆసీస్‌ మీడియా ద్వేషపూరిత కథనాల్లో భాగం. భారత ఆటగాళ్లకు కొవిడ్‌-19 ప్రొటోకాల్‌పై అవగాహన ఉంది. నిజానికి ఆటగాళ్లు రెస్టారెంట్‌ బయటే వేచి ఉన్నారు. చిన్నగా వర్షం కురవడంతో లోనికి వెళ్లారు. అయినా అన్ని నిబంధనలు పాటించే లోనికి వెళ్లారు. ఇదంతా మూడో టెస్టుకు ముందు జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే కుట్ర’ అంటూ బీసీసీఐ ఉన్నతాధికారి ఆరోపించారు. 


అసలేం జరిగిందంటే..?

విక్టోరియాలోని సీక్రెట్‌ కిచెన్‌ రెస్టారెంట్‌లో భోంచేయడానికి ఐదుగురు క్రికెటర్లు వెళ్లారు. నిబంధనల ప్రకారం బయట కూర్చోకుండా లోపలే అందరితోపాటు కలిసి తిన్నారు. వీరి వెనకాల కూర్చున్న నవల్దీప్‌ సింగ్‌ అనే అభిమాని ఇదంతా వీడియో తీశాడు. అలాగే క్రికెటర్లపై అభిమానంతో వారి బిల్లును తెప్పించుకుని 118.69 ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ.6,700) కూడా కట్టేశాడు. ఈ విషయం తెలిసిన రోహిత్‌ అతడి దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వబోయాడు. అయితే మనీ వద్దని చెబుతూ ఫొటో దిగాలని కోరాడు. అయితే డబ్బులు తీసుకుంటేనే ఫొటో దిగుతామని పంత్‌ సరదాగా చెబుతూ.. హగ్‌ ఇచ్చి వెళ్లాడని నవల్దీప్‌ ట్వీట్‌ చేశాడు. అయితే ఇదంతా వివాదాస్పదం కావడంతో పంత్‌ తనకు హగ్‌ ఇవ్వలేదని, తామంతా భౌతిక దూరం పాటించామని చెప్పుకొచ్చాడు.


Updated Date - 2021-01-03T09:07:22+05:30 IST