బెట్టు మీద బెట్టు!

ABN , First Publish Date - 2021-10-13T05:46:20+05:30 IST

-ఇలా ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లు యువత భవిష్యత్‌ను పాడుచేస్తున్నాయి. ప్రస్తుతం అంతటా ఐపీఎల్‌ ఫీవర్‌ నడుస్తోంది. ప్రధాన జట్ల మధ్య మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి.

బెట్టు మీద బెట్టు!




పలాస-కాశీబుగ్గలో జోరుగా క్రికెట్‌ బెట్టింగ్‌ 

బాధితులుగా మిగులుతున్న విద్యార్థులు, యువత

డబ్బులు పోగొట్టుకొని బలవన్మరణాలు 

మనస్తాపంతో కుటుంబాలను వదలి పరారీ

పోలీసుల నిఘా కరువు

(పలాస)

- రెండు రోజుల కిందట పలాస-కాశీబుగ్గకు చెందిన ఓ యువకుడు రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో పెద్దఎత్తున నగదు పోగొట్టుకోవడమే కారణమని తెలుస్తోంది. మనస్తాపంతో అఘాయిత్యానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.

- ఓ యువకుడు పెద్ద మొత్తంలో క్రికెట్‌ బెట్టింగ్‌ కట్టాడు. నగదు కట్టకపోవడంతో ఒత్తిడి పెరిగింది. దీంతో ఆ యువకుడు సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయాడు. ఆయన ఆచూకీ లేక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

 -ఇలా ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లు యువత భవిష్యత్‌ను పాడుచేస్తున్నాయి. ప్రస్తుతం అంతటా ఐపీఎల్‌ ఫీవర్‌ నడుస్తోంది. ప్రధాన జట్ల మధ్య మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఏ ఇద్దరు కలిసినా క్రికెట్‌ మ్యాచ్‌ విషయాలే చర్చకు వస్తున్నాయి. విద్యార్థులు, యువత టీవీలు, సెల్‌ఫోన్లకు అతుక్కుపోతున్నారు. యువత ఆసక్తిని ఆసరాగా చేసుకొని కొందరు బెట్టింగ్‌ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు, నిఘా ఎక్కువ కావడంతో పందెంరాయుళ్లు క్రికెట్‌ బెట్టింగ్‌పై పడ్డారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు కేవలం 20 ఓవర్లతో పూర్తవుతుండడంతో బెట్టింగులు చేయడానికి సులువుగా మారింది. కేవలం రెండుమూడు గంటల పాటు టీవీ, సెల్‌ పట్టుకొని కూర్చుంటే చాలు రూ.లక్షల ఆదాయం చేతికి రావడమో, పోవడమో జరిగిపోతుంది. దీనిపై అంత నిఘా, అనుమానాలు లేకపోవడంతో బెట్టింగ్‌రాయుుళ్లకు పని సులభతరమైంది.

 మాఫియాలా..

బంతి బంతికి, పరుగుకు, బౌండరీకి, సిక్సర్‌కు, వికెట్‌కి..ఇలా అన్నింటికీ బెట్టింగ్‌ సాగుతోంది. ఇదో పెద్ద మాఫియాలా విస్తరిస్తోంది. బెట్టింగ్‌ రాయుళ్లు, నమ్మకస్తులు వాట్సాప్‌ గ్రూపుగా ఏర్పడుతున్నారు. పందాలు కాస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు, యువతను ఇందులో భాగస్థులను చేస్తున్నారు. టాస్‌ వేసిన నాటి నుంచి మ్యాచ్‌ ముగిసే వరకూ ప్రతి నిమిషం ఈ ప్రక్రియ సాగుతోంది.  తోపుడు బళ్ల వ్యాపారుల నుంచి హోటల్‌ వ్యాపారుల వరకూ ఈ బెట్టింగులకు పాల్పడుతున్నారు. గెలుపొందితే రాత్రికి రాత్రే లక్షాధికారులవుతున్నారు. ఓడిపోతే మాత్రం నిండా మునిగిపోతున్నారు. అప్పులపాలై మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొందరు ముఖం చూపించలేక కుటుంబాలను వదలి పరారవుతున్నారు. రెండు రోజుల కిందట ఆత్మహత్య చేసుక్ను ఓ యువకుడు ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఏకంగా రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడు. వాటిని ఏ విధంగా చెల్లించాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగే సమయంలో  జంట పట్టణాలో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ బెట్టింగ్‌ సాగుతున్నట్టు తెలుస్తోంది. గెలిస్తే రెట్టింపు నగదు అని ప్రకటిస్తుండడంతో యువత బెట్టింగ్‌పై మొగ్గు చూపుతున్నారు. పోలీసులు నిఘా పెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


 


Updated Date - 2021-10-13T05:46:20+05:30 IST