ధోనీ రిటైర్..మెల్ బోర్న్ వండర్!

ABN , First Publish Date - 2020-12-31T10:09:22+05:30 IST

ధోనీ రిటైర్..మెల్ బోర్న్ వండర్!

ధోనీ రిటైర్..మెల్ బోర్న్ వండర్!

మహీ అనూహ్య వీడ్కోలు..

2020 ఒలింపిక్‌ ఏడాది కావడంతో క్రీడారంగంలో ఎక్కడలేని జోష్‌ నెలకొంది. కొత్త సంవత్సర ఆరంభంలో అంతా సవ్యంగానే ఉన్నా.. కరోనా మహమ్మారి విజృంభణతో అంతా తారుమారైంది. ఎన్నో ఈవెంట్లు, సిరీ్‌సలు రద్దయ్యాయి. ఎన్నడూ లేని విధంగా టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్‌.. వైరస్‌ దెబ్బకు 2021కు రీషెడ్యూల్‌ అయింది. కొన్ని నెలల లాక్‌డౌన్‌ తర్వాత ఒక్కొక్కటిగా ఈవెంట్లు మళ్లీ ఆరంభమయ్యాయి. కొవిడ్‌ ప్రొటోకాల్‌ పాటిస్తూ.. సరికొత్తగా బయో బబుల్‌లో టోర్నీలను నిర్వహిస్తున్నారు. ఫ్యాన్స్‌ను స్టేడియాలకు అనుమతించక పోవడంతో.. టీవీ రేటింగ్స్‌ సరికొత్త రికార్డులను సృష్టించాయి. మొత్తంగా 2020 చేదు జ్ఞాపకాలను మిగిల్చినా.. ఈ ఏడాది క్రీడారంగంలో ప్రముఖంగా చోటు చేసుకొన్న కొన్ని విశేషాలు..


వరల్డ్‌కప్‌ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ రిటైర్మెంట్‌పై బలంగా ఊహాగానాలు వచ్చినా.. అతడు పెద్దగా స్పందించలేదు. దీంతో మహీ అప్పుడే కెరీర్‌ వీడడని అంతా భావించారు. కానీ, ఆగస్టు 15న క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి మహీ అందరికీ షాకిచ్చాడు. ఎలాంటి ఆర్భాటం లేకుండా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వీడ్కోలు పలికాడు. మహీ రిటైర్మెంట్‌ ప్రకటించిన కొద్దిసేపటికే.. తాను కూడా కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు సురేష్‌ రైనా తెలిపాడు. అయితే, ఐపీఎల్‌లో చెన్నై తరఫున ధోనీ బరిలోకి దిగాడు. 


ఫెడరర్‌ సరసన నడాల్‌

కరోనా ఏడాది క్రీడాలోకాన్ని వణికించినా.. అదేస్థాయిలో రికార్డులు కూడా బద్దలయ్యాయి. టెన్నిస్‌లో మట్టికోర్టు మహరాజు స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ రికార్డు స్థాయిలో 13వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్‌ విజయాలు సాధించిన ఫెడరర్‌ రికార్డును కూడా సమం చేశాడు.  


ఐపీఎల్‌ గ్రాండ్‌ సక్సెస్‌..

కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వచ్చిన ఐపీఎల్‌.. ఎట్టకేలకు దిగ్విజయంగా ముగిసింది. యూఏఈ వేదికగా ప్రేక్షకులను అనుమతించకుండా లీగ్‌ను నిర్వహించినా.. టీవీ రేటింగ్‌ పరంగా సరికొత్త రికార్డులను సృష్టించింది. విపత్కర పరిస్థితుల్లోనూ బోర్డుకు కాసుల వర్షం కురిపించింది. 13వ ఐపీఎల్‌ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన డిఫెండింగ్‌ చాంప్‌ ముంబై ఇండియన్స్‌ ఐదోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. 


హారర్‌ టు థండర్‌

ఆస్ట్రేలియాతో 4 టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా.. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో చారిత్రక విజయంతో శభాష్‌ అనిపించుకొంది. అడిలైడ్‌ టెస్ట్‌లో 36 పరుగులకే కుప్పకూలిన భారత్‌.. టెస్ట్‌ల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఇక టీమిండియాకు వైట్‌వాషే అని మాజీలు పెదవి విరిచారు. కానీ, బాక్సింగ్‌ డే టెస్ట్‌లో అనూహ్యంగా పుంజుకొని ఆసీస్‌ను ఓడించి భారత్‌ ఔరా అనిపించింది. కోహ్లీ, రోహిత్‌, షమి లాంటి ప్రముఖ ఆటగాళ్లు లేకపోయినా.. రహానె సేన.. మెల్‌బోర్న్‌లో వండర్‌ చేసింది. కొత్త ఏడాదిలోకి గ్రాండ్‌గా అడుగుపెట్టనుంది. 


షుమాకర్‌తో సమంగా హామిల్టన్‌

ఫార్ములావన్‌లో బ్రిటిష్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ కొత్త చరిత్ర లిఖించాడు. దిగ్గజం మైకేల్‌ షుమాకర్‌ నెగ్గిన ఏడు వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్స రికార్డును మెర్సిడెస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ సమం చేశాడు. ఈ ఏడాది జరిగిన 17 రేసుల్లో హామిల్టన్‌ 11 విజయాలు సాధించాడు. కెరీర్‌లో 95 విజయాలు సాధించిన హామిల్టన్‌.. అత్యధికంగా 91 గ్రాండ్‌ ప్రీలు నెగ్గిన షుమా కర్‌ రికార్డును కూడా తనపేరిట రాసుకొన్నాడు. 


‘మాస్క్‌’ మాట్లాడింది

జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమంలో నేటి తరం అథ్లెట్లు కూడా గొంతెత్తింది 2020లోనే! అమెరికాలో ఓ పోలీసు అధికారి అమానవీయ చర్య కారణంగా జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడు మృతి చెందడంతో ప్రపంచమంతా.. ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమం ఊపందుకొంది. జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌ నవోమీ ఒసాకా కూడా.. నల్లజాతీయులపై జరుగుతున్న దాడులను బహిరంగంగానే ఖండించింది. పోలీసుల దాడిలో మరణించిన వారిని స్మరించేలా యూఎస్‌ ఓపెన్‌లో ఒక్కో అమరుడి పేరున్న మాస్క్‌ధరించి తన సంఘీభావాన్ని సరికొత్తగా చాటింది. ఈ టోర్నీలో ఒసాకా విజేతగా నిలిచింది. 


Updated Date - 2020-12-31T10:09:22+05:30 IST