Abn logo
Sep 24 2021 @ 18:25PM

What A Hero.. ప్రధాని మోదీపై కెవిన్ పీటర్సన్ ప్రశంసల వర్షం

లండన్: భారత ప్రధాని నరేంద్రమోదీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, జంతు పరిరక్షకుడు కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. ఖడ్గమృగాల పరిరక్షణకు మోదీ నడుంబిగించినందుకుగాను మోదీకి కృతజ్ఞతలు తెలిపాడు. మిగతా ప్రపంచ దేశాధి నేతలు కూడా మోదీ బాటలో నడవాలని కోరాడు.


ఖడ్గమృగాలు వేటగాళ్ల బారినపడకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ అసోం ప్రభుత్వాన్ని ఆదేశించారు. ‘‘ఒంటికొమ్ము ఖడ్గమృగం దేశానికి గర్వకారణం. వాటి సంరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటాం’’ అని మోదీ పేర్కొన్నారు.


భారత ప్రధాని ప్రకటనపై స్పందించిన పీటర్సన్.. మోదీని ‘హీరో’గా అభివర్ణించాడు. ‘వాటే హీరో’ అంటూ ట్విట్టర్‌లో మోదీని కొనియాడాడు. భారత్‌లో ఖడ్గమృగాల సంఖ్య క్రమంగా పెరుగుతుండడానికి కారణం ఇదేనని పేర్కొన్నాడు.


ప్రపంచ ఖడ్గమృగం దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న అసోం ప్రభుత్వం ఓ బహిరంగ కార్యక్రమంలో 2,479 అరుగైన ఖడ్గమృగం కొమ్ములను దహనం చేసింది. ఖడ్గమృగాల వేటకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహించింది.


పూజారులు అంతిమ సంస్కారాలు నిర్వహించిన తర్వాత ఆరు చితులపై పేర్చిన కొమ్ములను దహనం చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొమ్ములు సజీవ ఖడ్గమృగాల మీద ఉన్నప్పుడే అసోం ప్రభుత్వం వాటిని విలువైన వాటిగా పరిగణిస్తుందన్న సందేశాన్ని ఈ కార్యక్రమంతో ప్రపంచానికి చాటిచెప్పినట్టు పేర్కొన్నారు.  


ఒంటికొమ్ము ఖడ్గమృగాలు ఒకప్పుడు ఇండియాలోని తూర్పు ప్రాంతంలో విరివిగా కనిపించేవి. అయితే, వేటగాళ్ల కారణంగా అవి ఇప్పుడు అసోంకే పరిమితమయ్యాయి. ప్రపంచంలోనే అత్యధికంగా కజిరంగా నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగాలు ఉన్నాయి.


అయితే, కొమ్ముల కోసం వేటగాళ్లు దాడులు చేస్తుండడంతో వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. చైనా, వియత్నాం తదితర ఆసియా దేశాల్లో వీటి కొమ్ములను ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఫలితంగా వీటి సంతతి క్రమంగా తగ్గిపోతోంది.  


ఇవి కూడా చదవండిImage Caption