Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్‌యూలో ఆకలి కేకలు

  1. పురుగుల అన్నం, నీళ్ల చారు 
  2. పరిపాలన భవనం ఎదుట నిరసన 
  3. పది రోజుల గడువు కోరిన రిజిస్ట్రార్‌, రెక్టార్‌


కర్నూలు(అర్బన్‌), డిసెంబరు 3: రాయలసీమ యూనివర్సిటీలో పురుగుల అన్నం, నీళ్ల చారు పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా పస్తులుంటున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం హాస్టల్‌ భవనం నుంచి కుళ్లిన కూరగాయలతో ర్యాలీగా పరిపాలన భవనం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. విద్యార్థులు నాగార్జున, మనోహర్‌తోపాటు సుమారు వంద మంది.. ఉపకులపతి, వార్డెన్ల తీరును నిరసించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ నెల కిత్రం ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోగా పురుగుల అన్నం, కుళ్లిన కూరగాయలతో వంట చేసి పెడుతున్నారని వాపోయారు. రెండు రోజులుగా వసతి గృహం వద్ద నిరసన తెలుపుతున్నా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. ఇంజనీరింగ్‌, పీజీ విద్యార్థులు దాదాపు 300 మంది ఉండగా.. భోజన వసతి కల్పించలేకపోతున్నారని విమర్శించారు. ఉపకులపతి ఎ.ఆనందరావు బయటకు వచ్చి వార్డెన్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓ కమిటీ వేసి వసతి గృహంలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యను పరిష్కరించేందుకు పది రోజుల సమయం ఇవ్వాలని రిజిస్ట్రార్‌ మధుసూదనవర్మ, రెక్టార్‌ సంజీవరావు కోరారు. 

Advertisement
Advertisement