Abn logo
Jul 24 2021 @ 01:11AM

నకిలీ వైబ్‌సైట్లతో దోపిడీ

నిందితుడు రిషబ్‌ ఉపాధ్యాయ

లక్షలు కాజేసిన సైబర్‌ కేటుగాడు

గ్రాసరీస్‌, ఫర్నిచర్‌ సేల్స్‌ పేరుతో మోసం

 నిందితుడి అరెస్టు 

రూ. 40 లక్షలు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ వెబ్‌సైట్లలో చిన్న మార్పులు చేసి నకిలీ వైబ్‌సైట్‌ సృష్టించి, గ్రాసరీస్‌, ఫర్నిచర్‌ అమ్మకాల పేరుతో వందలాది మందిని బురిడీ కొట్టించి, రూ. లక్షలు దోచుకుంటున్న కేటుగాడి ఆట కట్టించారు సైబరాబాద్‌ పోలీసులు. నిందితుడి నుంచి రెండు ల్యాప్‌టా్‌పలు, మూడు సెల్‌ఫోన్లు, 20 డెబిట్‌ కార్డులు, ఆరు బ్యాంక్‌ పాస్‌బుక్‌లు, రూ. 40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సీపీ సజ్జనార్‌ శుక్రవారం వివరాలు వెల్లడించారు.

రాయదుర్గానికి చెందిన సాఫ్ట్‌వేర్‌  ఇంజనీర్‌ ఏప్రిల్‌లో ఆన్‌లైన్‌లో నిత్యావసరాలు ఆర్డర్‌ చేశాడు. ముందే డబ్బులు చెల్లించాలని నిబంధన ఉండటంతో రూ. 1,544 చెల్లించాడు. తర్వాత మెసేజ్‌, సరుకులు రాలేదు. మెయిల్‌ పెట్టినా, కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసినా నో రెస్పాన్స్‌. దీంతో రాయదుర్గం సైబర్‌ సెల్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో మాదాపూర్‌, చందానగర్‌, దుండిగల్‌లో ఇలా 9 పోలీ్‌సస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. సీపీ సజ్జనార్‌ కేసును సైబర్‌ క్రైమ్‌ విభాగంలోని ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివా్‌సకు అప్పగించారు. డీసీపీ విజయ్‌కుమార్‌, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ బాలకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలు సేకరించి, బెంగళూర్‌ కేంద్రంగా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న రిషబ్‌ ఉపాధ్యాయను అరెస్టు చేశారు.  

వెబ్‌డెవలపర్‌గా..

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రిషబ్‌ ఉపాధ్యాయ అలియాస్‌ చందన్‌ బీఎస్సీ చదివాడు. బెంగళూరులో ఉంటూ ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌లో ఎంబీఏ చేశాడు. ఓ కాల్‌ సెంటర్‌లో పనిచేస్తూ వెబ్‌ డెవల్‌పమెంట్‌ కోర్సు చేశాడు. ఫ్రీలాన్సింగ్‌ వెబ్‌సైట్స్‌లో పేరు రిజిస్టర్‌ చేయించుకున్నాడు. దీంతో అమెరికాకు చెందిన ప్రిన్స్‌.. చందన్‌తో ఓ వెబ్‌సైట్‌ తయారు చేయించుకున్నాడు. నిరుద్యోగులు ఒక డాలర్‌ చెల్లించి, రిజిస్టర్‌ చేసుకుంటే వారికి ఉద్యోగాలు వెతికిపెట్టే బాధ్యత మాదే అనేది ఆ వెబ్‌సైట్‌ నినాదం. వెబ్‌సైట్‌ తయారు చేసిన 45 రోజుల తర్వాత అది ఎలా పని చేస్తోందో చూద్దామని చందన్‌ దాన్ని ఓపెన్‌ చేశాడు. అప్పటికే అది క్లోజ్‌ అయిందని,  తనతో వెబ్‌సైట్‌ డిజైన్‌ చేయించుకున్న వ్యక్తి లక్షల్లో కొల్లగొట్టాడని తెలిసింది. దీంతో చందన్‌కూ అలాంటి ఆలోచనే వచ్చింది. దీంతో  నకిలీ స్కైప్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేశాడు. నిపుణుల పేర్లు అందులో పొందుపరిచి, విదేశాల ఉద్యోగాల కోసం యువత కాంటాక్టు చేయాలని కోరాడు. పంజాబ్‌కు చెందిన స్నేహితుడు రాహుల్‌తో డిజిటల్‌ మార్కెటింగ్‌ ద్వారా ప్రచారం చేసుకున్నాడు. నిరుద్యోగులు చందన్‌ను సంప్రదించగా.. వారందరికీ అమెరికాలో త్వరలోనే ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లు నమ్మించాడు. వీసా ప్రాసెసింగ్‌, ఇతర అవసరాలకు కొత్త బ్యాంకు ఖాతాలు తీయించాడు. ఆ ఖాతాలకు సంబంధించిన పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు, సిమ్‌కార్డులు, పాన్‌కార్డులు, ఇలా అన్నింటిని కొరియర్‌ ద్వారా తెప్పించుకున్నాడు.

తెలివిగా సైబర్‌ నేరాలు 

బ్యాంకు ఖాతాలు తెప్పించుకున్న తర్వాత డెక్‌ అప్‌ డాట్‌ కామ్‌ పేరుతో నకిలీ ఫర్నిచర్‌ వెబ్‌సైట్‌ను క్రియేట్‌ చేశాడు. సివేంద్రసింగ్‌ రాణా అనే వ్యక్తి బ్యాంకు ఖాతాకు రేజర్‌పే వ్యాల్లెట్‌కు యాడ్‌  చేశాడు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఫర్నిచర్‌ అమ్మకం పేరుతో వందలాది మందిని ఆకర్షించాడు. ఆర్డర్‌ చేసిన వారు డబ్బులను రేజర్‌పే పేమెంట్‌ గేట్‌వే ద్వారా చెల్లించాలని కోరాడు. దాంతో వందలమంది ఫర్నిచర్‌ ఆర్డర్‌ చేసి, డబ్బులు చెల్లించారు. చందన్‌ కేవలం రూ. 28,000 మాత్రమే డ్రా చేసుకున్నాడు. అందులో ఇంకా రూ. 20 లక్షలు ఉన్నాయి. ఫర్నిచర్‌ ఆర్డర్‌ చేసిన వారు వస్తువులు రాకపోవడం, ఎలాంటి రెస్పాన్స్‌ లేకపోవడంతో మోసపోయామని గుర్తించి రేజర్‌పేకు ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు సంస్థ తమ వద్ద నిల్వ ఉన్న రూ. 20 లక్షలు ఫ్రీజ్‌ చేసింది. వాటికోసం సంప్రదిస్తే దొరికిపోతానని భావించిన చందన్‌ ఆ రూ. 20 లక్షలు వదులుకున్నాడు. 

డాట్‌ ఇన్‌గా మార్చి.. 

ఈసారి ఎలాగైనా డబ్బు సంపాదించాలని బెంగళూరులో ఆన్‌లైన్‌ గ్రాసరీ సరఫరాలో మంచి పేరున్న ఓ డాట్‌ కామ్‌లో డాట్‌ ఇన్‌గా మార్చాడు. ఆన్‌లైన్‌ ఫర్నిచర్‌ డిస్ట్రిబ్యూషన్‌లో కెనడాలో మంచి పేరున్న వెబ్‌సైట్‌లో చిన్న మార్పు చేశాడు. ఇలా రెండు ప్రముఖ పేర్లున్న వైబ్‌సైట్లకు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించాడు. ఇలా జనాన్ని ఏమార్చిన చందన్‌ ఈసారి ఏ రోజు డబ్బులు ఆ రోజే డ్రా చేసుకున్నాడు. ఇలా మొత్తం 40లక్షలు డ్రా చేశాడు. చివరికి సైబరాబాద్‌ పోలీసులకు చిక్కాడు.