ఫాతిమా హత్య కేసులో ఐదుగురికి రిమాండ్‌

ABN , First Publish Date - 2021-08-02T06:43:00+05:30 IST

ఆస్తి తగాదాల్లో చెల్లిని హత్యచేసిన ఘటనలో గోల్కొండ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.

ఫాతిమా హత్య కేసులో ఐదుగురికి రిమాండ్‌

లంగర్‌హౌస్‌, ఆగస్ట్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఆస్తి తగాదాల్లో చెల్లిని హత్యచేసిన ఘటనలో గోల్కొండ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఫాతిమా(42) భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి టోలీచౌకి గెలాక్సీ ఆడమ్స్‌ కాలనీలో తల్లి వద్ద ఉంటోంది. ఆమె తల్లిదండ్రుల ఆస్తి దాదాపు రూ. 50 కోట్లపైనే ఉంది. ఆస్తిలో తనకూ వాటా కావాలని ఫాతిమా అడిగింది. రెండు నెలల క్రితం తండ్రి ఫకీరయ్య మృతి చెందాడు. దీంతో కుటుంబంలో ఆస్తిగొడవలు మొదలయ్యాయి. ఆస్తి పంపకంలో ఫాతిమా అడ్డొస్తుందని ఐదుగురు అన్నదమ్ములు, వదిన కలిసి ఆమె హత్యకు పథకం వేశారు. గతనెల 29న వారు కాలనీకి వెళ్లి తండ్రి సంపాదించిన ఇంట్లో ఉండొద్దని, వెళ్లిపోవాలని ఫాతిమాతో గొడవపడ్డారు. ఫాతిమా అన్న మహ్మద్‌ ఆరిఫ్‌ అలీ కత్తితో ఆమె మెడకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మహ్మద్‌ ఆరిఫ్‌ అలీ(38), మహ్మద్‌ రవూఫ్‌(40), హసన్‌ అలీ అలియాస్‌ ముజాహిద్‌ అలీ(36), మహ్మద్‌ ఆసిఫ్‌ అలీ(37), ఆరిఫ్‌ భార్య సమీరా బేగం(37)ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి కత్తి, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2021-08-02T06:43:00+05:30 IST