దారుణ యాప్‌లు

ABN , First Publish Date - 2021-01-09T05:42:39+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గాలిపెల్లి గ్రామానికి చెందిన పవన్‌ కళ్యాణ్‌రెడ్డి (24) ఆన్‌లైన్‌ యాప్‌ రుణం చెల్లించలేక శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

దారుణ యాప్‌లు
పవన్‌ కళ్యాణ్‌రెడ్డి (ఫైల్‌)

 -  గాలిపల్లిలో విద్యార్థి ప్రాణం తీసిన రుణం 

-  పరువు పోతుందని మనస్తాపంతో అఘాయిత్యం

- విద్యార్థులు, నిరుద్యోగులే నిర్వాహకుల లక్ష్యం

- రూ.5 వేల నుంచి  రూ.20 వేల వరకు రుణాలు 

- ఇన్‌స్టాల్‌ మెంట్‌ కట్టకుంటే పరిచయస్తులకు ఫోన్లు 

 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఆర్థికంగా ఉన్న కుటుంబం. ఆ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు, వారిలో ఒకరు మల్లుగారి పవన్‌ కళ్యాణ్‌రెడ్డి (24) హైదరాబాద్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చిన్న చిన్న ఖర్చులకు డబ్బులు అవసరమవడంతో సెల్‌ ఫోన్‌లో ష్యూరిటీ లేకుండా ఇన్‌స్టంట్‌ లోన్‌ ఇస్తామనే యాప్‌ల ప్రకటనలు చూసి ఆసక్తి కనబర్చాడు. తన అవసరానికి ఒక యాప్‌ నుంచి చిన్నపాటి రుణం తీసుకున్నాడు. ఇన్‌స్టాల్‌మెంట్‌ గడువు రావడంతోనే మరో యాప్‌ నుంచి రుణం తీసుకున్నాడు. ఇలా ఒకదాని తర్వాత మరొక యాప్‌ నుంచి రుణాలు పొందాడు.  వాటిని చెల్లించడానికి బంధువుల వద్ద అప్పు చేశాడు. ఇంట్లో చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు. ఓ యాప్‌ సంస్థ ఇన్‌స్టాల్‌మెంట్‌ చెల్లించాలని తన సోదరికి మెస్సేజ్‌ పంపింది.  దీంతో కుటుంబ సభ్యులకు తెలిసి పోతుందని మానసిక ఆవేదనకు గురయ్యాడు. కొవిడ్‌ నేపఽథ్యంలో ఇంటి వద్దనే ఉంటున్న పవన్‌కళ్యాణ్‌రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున ఉరేసుకున్నాడు.  హైదరాబాద్‌ వంటి నగరాల్లో వెలుగు చూస్తున్న ఇలాంటి సంఘటనలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలోనూ చోటు చేసుకోవడం విషాదాన్ని నింపింది. ఆన్‌లైన్‌ లోన్‌ తీసుకొని తల్లిదండ్రులకు చెప్పలేక, డబ్బులు కట్టలేక, ఇంట్లో ఉరేసుకొని చనిపోయినట్లుగా విద్యార్థి తండ్రి మల్లుగారి రాజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు పవన్‌కళ్యాణ్‌రెడ్డి ఆత్మహత్య విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది.


క్రెడిట్‌ యాప్స్‌.. నిరుద్యోగులకు తిప్పలు 

గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఆన్‌లైన్‌ పర్సనల్‌ లోన్‌ యాప్స్‌ కో కోల్లలుగా ఉన్నాయి. క్షణాల్లో రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు రుణాలు ఇస్తామని ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ క్రెడిట్‌ యాప్స్‌ ద్వారా రుణం పొందడానికి ఫొటో, ఆధార్‌కార్డు, సెల్‌ ఫోన్‌ నంబర్లే ష్యూరిటీ. నిరుద్యోగులు, విద్యార్థులు సొంత అవసరాల కోసం, కుటుంబాల కోసం ఇన్‌స్టంట్‌ మనీపై ఆసక్తి కనబరుస్తున్నారు. గడువులోగా తీసుకున్న రుణం తిరిగి చెల్లించకుంటే యాప్‌ల సంస్థల నిర్వాహకులు కుటుంబ సభ్యులకు ఫోన్‌లు చేసి చెప్పడం, పరువు తీసే విధంగా హేళనగా మాట్లాడడం చేస్తుంటారు. దీనిని తట్టుకోలేక విద్యార్థులు, నిరుద్యోగులు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది యాప్‌ల ద్వారా రుణం పొంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. 


 తప్పులు చేయవద్దు.. స్నేహితులకు సూచన

ఇల్లంతకుంట: తొందరపడి తప్పులు చేయవద్దని ఆత్మహత్యకు ముందు  పవన్‌ కళ్యాణ్‌రెడ్డి సోషల్‌ మీడియా ద్వారా తన మిత్రులకు సూచించాడు. ‘కొంతమంది తెలిసి, మరికొంతమంది తెలియక తప్పులు చేస్తుంటారు.. కానీ కొన్ని తప్పులు పెద్ద నష్టాన్ని మిగులుస్తాయి’ అని పేర్కొన్నాడు. 

Updated Date - 2021-01-09T05:42:39+05:30 IST