ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ABN , First Publish Date - 2021-01-19T07:18:14+05:30 IST

వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం కారణంగానే ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది.

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో వీడిన మిస్టరీ

పంజాగుట్ట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం కారణంగానే ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. మహిళ, ఆమె ప్రియుడు కటకటాలపాలయ్యరు. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. సోమవారం విలేకరుల సమావేశంలో పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. బిహార్‌కు చెందిన దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి ఖైరతాబాద్‌లో నివసిస్తున్నారు. భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు.  2019 నవంబర్‌లో ఖైరతాబాద్‌లో జ్యూస్‌ బండి పెట్టాడు. బిహార్‌కు చెందిన లాల్‌బాబును పనిలో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సెక్యూరిటీగార్డు భార్యకు, లాల్‌బాబు అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. లాక్‌డౌన్‌ ముందు లాల్‌ బాబు భార్య మృతి చెందడంతో స్వగ్రామానికి వెళ్లాడు. లాక్‌డౌన్‌ తరువాత తిరిగి నగరానికి వచ్చి ఖైరతాబాద్‌లో ఉంటూ వేరేచోట ఓ హోటల్‌లో పనిచేసేవాడు. మహిళ, లాల్‌బాబు కలిసి ఆమె భర్త అడ్డు తొలగించాలనుకున్నారు. ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో తన ఇంటికి రమ్మని లాల్‌బాబుకు ఆమె చెప్పింది. భర్త నిద్రలో ఉండగా ఇద్దరూ కలిసి అతడి చేతులు కట్టేశారు. చున్నీ, టవల్‌తో గొంతు చుట్టూ బిగించారు. అతడు కేకలు వేయకుండా నోరు మూశారు. మరోసారి గట్టిగా ఉరివేసినట్లు లాగారు. దీంతో అతడు చనిపోయాడని భావించారు. కొద్ది సేపటి తరువాత అతడు కదలడంతో ఆమె భర్త ఛాతిపై కూర్చుంది. ఇద్దరూ కలిసి బలంగా గొంతు నొక్కడంతో మృతి చెందాడు. తరువాత లాల్‌ బాబును వెళ్లిపోమ్మని చెప్పింది. అతడు అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత మృతుడి సోదరుడికి కబురు పంపింది. అతడు ఇంటికి రాగా నిద్రలో మృతి చెందాడు అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. మృతుడి మెడపైన గాయాలు ఉండడంతో సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మెడపై గాయాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుండడంతో తామే హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి ఫోన్‌, హత్యకు వాడిని సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-01-19T07:18:14+05:30 IST