నేర సమాచారం

ABN , First Publish Date - 2020-11-30T06:01:56+05:30 IST

తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డులో ఆదివారం లారీ ఢీకొన్న సంఘటనలో షేక్‌ హాజి (32) మృతి చెందాడని సీఐ తేజమూర్తి తెలిపారు.

నేర సమాచారం

లారీ ఢీకొనిఒకరి మృతి

తాడిపత్రి టౌన్‌, నవంబరు 29: పట్టణంలోని నంద్యాల రోడ్డులో ఆదివారం లారీ ఢీకొన్న సంఘటనలో షేక్‌ హాజి (32) మృతి చెందాడని సీఐ తేజమూర్తి తెలిపారు.  రమే్‌షరెడ్డికాలనీకి చెందిన షేక్‌ హాజి వెల్డర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడన్నారు. పని నిమిత్తం ద్విచక్రవాహనంలో వెళుతుండగా నంద్యాలరోడ్డులో లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత మృతి 

గుమ్మఘట్ట, నవంబరు 29: మండలంలోని గోనబావి గ్రామానికి చెందిన బాలింత విజయలక్ష్మి (25) ఆదివారం వైద్యుల నిర్లక్ష్యానికి బలైంది. బాధితులు తెలిపిన వివరాలివి. విజయలక్ష్మిని ప్రసవం కోసం గుమ్మఘట్ట ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు రమేష్‌, వైద్య సిబ్బంది గర్భిణికి ప్రసవం చేశారు. రక్తస్రావం కలగడంతో ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. బాధిత కుటుంబసభ్యులు గుమ్మఘట్ట వైద్యాధికారి నిర్లక్ష్యంతోనే మృతి చెందిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైద్యాధికారి రమే్‌షను వివరణ కోరగా, విజయలక్ష్మి ప్రసవం కోసం ఆస్పత్రికి రాగా ఆమెకు అప్పటికే కామెర్ల వ్యాధితో పాటు రక్తహీనత ఉన్నట్లు గుర్తించామన్నారు. చివరి క్షణంలో ఆస్పత్రిలోనే ప్రసవం చేసి, మెరుగైన చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి రెఫర్‌ చేశామన్నారు. 


===========================================================


బైక్‌ బోల్తా పడి యువకుడి మృతి 

సోమందేపల్లి(పెనుకొండ), నవంబరు 29 : సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద బైక్‌ బోల్తాపడి ఒరిస్సాకు చెందిన పురుషోత్తం(30) మృతిచెందాడు. ఇతను పాపిరెడ్డిపల్లి వద్ద కియ అనుబంధ సంస్థ నోవా పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఆదివా రం సోమందేపల్లికి వెళ్లి తిరిగి పరిశ్రమకు వస్తుండగా బైక్‌ డివైడర్‌ను ఢీకొని కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటరాముడు తెలిపారు.


=====================================================


వరకట్న వేధింపులకు మహిళ బలి

కూడేరు, నవంబరు 29: వరకట్న వేధింపులు భరించలేక కూడేరుకు చెందిన సుజాతబాయి(28) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలివి. కూడేరుకు చెందిన సుజాత బాయికి రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామానికి చెందిన పృథ్వీనాయక్‌తో వివాహమైంది. కొద్దిరోజులకే భర్త, అత్త, మామ, ఆడబిడ్డ, మరిది కలిసి సుజాతబాయిని అదనపు కట్నం తీసుకురావాలని వేధించారు. దీంతో మనస్తాపం చెందిన సుజాతబాయి కూడేరుకు వచ్చి శనివారం రాత్రి ఇంట్లో విషద్రావకాన్ని తాగింది. అపస్మారక స్థితిలో పడిఉన్న బాధితురాలిని కుటుంబసభ్యులు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్తతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ దస్తగిరి తెలిపారు.


Updated Date - 2020-11-30T06:01:56+05:30 IST