బీహార్‌లో నేరాల తగ్గుదలకు కారణం చెప్పిన నితీశ్ కుమార్

ABN , First Publish Date - 2021-11-16T00:14:02+05:30 IST

గతంతో పోలిస్తే బీహార్‌లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్

బీహార్‌లో నేరాల తగ్గుదలకు కారణం చెప్పిన నితీశ్ కుమార్

పాట్నా: గతంతో పోలిస్తే బీహార్‌లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో నేరాల తగ్గుదలకు మద్య నిషేధమే కారణమన్నారు. రాజధాని పాట్నాలో  నేడు విలేకరులతో మాట్లాడిన నితీశ్.. మద్య నిషేధం విధించినందుకు కొందరు తనకు వ్యతిరేకంగా ఉన్నారని, అయినప్పటికీ తాను ఈ విషయంలో గట్టిగా ఉన్నానని చెప్పారు.


మద్య నిషేధాన్ని వ్యతిరేకించేవారు దీనిని చాలా తప్పుగా భావించారని అన్నారు. అయితే, అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అన్నారు. తాము మాత్రం ప్రజల పక్షాన నిలిచామని, తాను మద్యానికి వ్యతిరేకమని పేర్కొన్నారు.


రాష్ట్రంలో నేరాల రేటు పెరగలేదని, ఏదైనా నేరం జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నామని నితీశ్ అన్నారు. నేరం జరిగిన వెంటనే అధికారులు, పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని వేరే ఘటనలు జరుగుతున్నాయని, ఓ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం ఉందని దీనిపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.


అది వేరే విషయమని, అయితే, సాధారణ నేరాల రేటు మాత్రం గణనీయంగా తగ్గిందన్నారు. మద్యంపై నిషేధం విధించిన తర్వాత రాష్ట్రంలో నేరాలు తగ్గాయని మాత్రం చెప్పగలనని సీఎం స్పష్టం చేశారు. కాగా, ఈ నెల మొదట్లో ముజఫర్‌పూర్‌లో కల్తీ మద్యం తాగి 32 మంది మరణించారు.  


Updated Date - 2021-11-16T00:14:02+05:30 IST