Abn logo
Oct 21 2020 @ 20:41PM

తెలంగాణలో సంచలనంగా మారిన కిడ్నాప్‌లు, హత్యలు

తెలంగాణలో కొద్దిరోజులుగా కిడ్నాప్‌లు, హత్యలు సంచలనంగా మారాయి. లాక్‌డౌన్‌లో అసలు ఎఫ్‌ఐఆర్‌లు భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. కానీ, అన్‌లాక్ మొదలైన తరువాత క్రైమ్‌రేట్ విపరీతంగా పెరిగింది. రెండు నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో కిడ్నాప్‌లు, హత్యల కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. ప్రేమ వ్యవహారాలు, డబ్బులే ప్రధాన అంశాలుగా తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాప్‌ల పర్వం భయం గొలుపుతోంది. సినీ ఫక్కీలో చోటు చేసుకుంటున్న సంఘటనలు కొన్ని సుఖాంతమవుతుంటే, మరికొన్ని దురదృష్టవశాత్తూ  విషాదాలుగానూ మారిపోతున్నాయి. వీటిలో కొన్ని కుట్రలు, కుతంత్రాలతో జరుగుతుంటే, మరికొన్ని ఈజీ మనీ కోసం జరుగుతున్నాయి. 

కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఓ తండ్రి అల్లుడిని కిడ్నాప్‌ చేసి హత్య చేయించాడు. మరో చోట మతాంతర వివాహం చేసుకుందని తల్లిదండ్రులు కూతురిని ఇంటికి తీసుకు రావడంతో, కట్టుకున్న భర్తే భార్యను కిడ్నాప్‌ చేశాడు. అయితే, దంపతులిద్దరూ కలిసే ఈ డ్రామా ఆడినట్లు పోలీసులు తేల్చారు. ఇంకొన్ని చోట్ల డబ్బులకోసం పిల్లలను కిడ్నాప్‌ చేస్తున్నారు. లక్షల రూపాయలు డిమాండ్‌ చేస్తున్నారు. తల్లిదండ్రులను గుండెకోతకు గురిచేస్తున్నారు.


మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో బాలుడి కిడ్నాప్ తల్లిదండ్రులకు తిండి, నిద్ర కరువయ్యేలా చేస్తోంది. ఆదివారం సాయంత్రం బైక్‌పై వచ్చిన ఓ దుండగుడు ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని  ఎత్తుకెళ్లిపోయాడు. కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న రంజిత్ అనే వ్యక్తి ఓ ప్రముఖ టీవీ చానల్‌లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. రంజిత్, వసంతల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి వయసు తొమ్మిదేళ్లు.  బైక్‌పై బాలుడిని తీసుకెళ్లాక.. పొద్దుపోయినా బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయితే దీక్షిత్ జాడ కనిపించలేదు. ఎవరో బైక్‌పై వచ్చి దీక్షిత్‌ను తీసుకెళ్లినట్లు తోటి పిల్లలు చెప్పారు. 

ఓవైపు దీక్షిత్‌కోసం గాలిస్తున్న క్రమంలోనే రాత్రి 10 గంటల సమయంలో కిడ్నాపర్లు బాలుడి తల్లికి ఫోన్‌ చేసి 45 లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇస్తేనే బాలుడిని వదిలిపెడతామన్నారు. అంతేకాదు.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. ఇంటి చుట్టుపక్కల తమ వ్యక్తులు ఉన్నారని.. మీరు ఏం చేసినా తమకు తెలుస్తుందని బాలుడి తల్లిని బెదిరించారు. ముఖ్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని హెచ్చరించారు. బాలుడికి జ్వరంగా ఉందని.. ట్యాబ్లెట్స్ వేసి పడుకోబెట్టామని చెప్పి ఫోన్ పెట్టేశారు. అయితే, బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి కిడ్నాప్‌ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. కిడ్నాప్ అయిన బాలుడి ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. బాలుడి తల్లిదండ్రులను సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాపర్ల ఆచూకీ తెలుసుకునేందకు ముమ్మరంగా గాలిస్తున్నారు. కిడ్నాప్ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అలాగే పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేసేందుకు పలుసార్లు ఫోన్ చేశారు. అయితే వారు ఇంటర్‌నెట్ ఫోన్‌తో కాల్ చేస్తుండంతో కిడ్నాపర్ల ఆచూకీ కనుగొనడం పోలీసులకు కష్టంగా మరింది.


విషయం పోలీసుల దాకా వెళ్లిందని, తీవ్రంగా గాలింపు కొనసాగుతుందని తెలిసిన తర్వాత కిడ్నాపర్లు మిన్నకుండిపోతారని అంతా అనుకున్నారు. భయంతో బాలుడిని వదిలేస్తారని అంచనా వేశారు. కానీ, కిడ్నాపర్లు తల్లిదండ్రులతో టచ్‌లోనే ఉన్నారు. తమకు డబ్బులు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెగేసి చెబుతున్నారు. డబ్బులు సిద్ధం చేస్తామని, తమ కుమారుడిని ఏమీ చేయొద్దని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.


- సప్తగిరి గోపగాని, చీఫ్‌ సబ్‌ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Advertisement
Advertisement
Advertisement