అవకతవకలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు

ABN , First Publish Date - 2020-05-22T11:08:43+05:30 IST

ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు.

అవకతవకలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు

అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌


ఆదిలాబాద్‌టౌన్‌, మే 21: ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, క్షేత్ర స్థాయి సిబ్బందితో ఉపాధి పనులు, నర్సరీలు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉపాధి పనులకు సంబంధించిన కూలీల మస్టర్‌ విషయంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని అలాంటి వాటిని ఉపేక్షించ బోమని పేర్కొన్నారు. అధికారులు ఉదయం పని ప్రదేశాలకు వెళ్లి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. కూలీలకు సంబంధించిన మస్టర్‌లను నమోదు చేయాలని, పే ఆర్డర్‌ జనరేట్‌ చేయాలని, ఎఫ్‌పీవోలు అప్‌లోడ్‌ చేయాలన్నారు.


కూలీలు పని చేసిన చోట మిషనరీలతో పనులు చేయించకూడదన్నారు. నర్సరీల నిర్వహణపై ఆయన సమీక్షిస్తూ కొన్ని నర్సరీలలో 20 శాతం మాత్రమే మొక్కలు ఎదుగుతున్నాయని, వంద శాతం మొక్కల ఎదుగుదలతో పాటు రోజు వారి పర్యవేక్షణ జరగాలన్నారు. జూన్‌ 20 నుంచి హరితహారం కార్యక్రమం నిర్వహిం చనున్న దృష్ట్యా మొక్కల ఎదుగుదలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాజేశ్వర్‌ రాథోడ్‌ మాట్లాడుతూ లేబర్‌ రిపోర్ట్‌, పే ఆర్డర్‌ జనరేట్‌ చేయాలని, ఏపీవోలు క్షేత్ర స్థాయిలో పర్యటించి కూలీల హాజరు పనులకు సంబంధించిన వివరాలు పరిశీలించాలని సూచించారు. డీపీవో సాయిబాబా, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-05-22T11:08:43+05:30 IST