రోడ్లపైకి ఎవరూ రావద్దు

ABN , First Publish Date - 2020-04-09T10:58:42+05:30 IST

రెడ్‌జోన్‌ ప్రాంతాలలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు

రోడ్లపైకి ఎవరూ రావద్దు

ఆంక్షలు మరింత కఠినం

నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు

కంట్రోల్‌ రూం నెంబరు 08518-277305కు ఫోన్‌ చేస్తే నిత్యావసరాలు డోర్‌ డెలివరీ

ఎస్పీ ఫక్కీరప్ప


కర్నూలు, ఏప్రిల్‌ 8: రెడ్‌జోన్‌ ప్రాంతాలలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలనీ ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయం వ్యాస్‌ ఆడిటోరియంలో కోవిడ్‌ ఇన్‌చార్జి ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌, డీఎస్పీలు, సీఐలతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్‌కు తెలియజేస్తామన్నారు.


కొత్తపేట, రోజావీధి, ప్రకాష్‌నగర్‌, బుధవారపేట, రెవెన్యూ కాలనీ, గణేష్‌నగర్‌ తదితర రెడ్‌జోన్‌ ప్రాంతాలలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదన్నారు. అత్యవసరమైతే వైద్య సదుపాయాల కోసం అంబులెన్సులను సిద్ధంగా ఉంచుతామన్నారు. రెడ్‌జోన్‌ ప్రాంతాలలో అన్ని షాపులు బంద్‌ ఉంటాయన్నారు. మందుల కోసం 1077కు కాల్‌ చేయాలన్నారు. నిత్యావసర సరుకుల కోసం కలెక్టరేట్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూం 08518-277305కు ఫోన్‌ చేస్తే డోర్‌ డెలివరీ చేసేలా చర్యలు తీసుకుంటారన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే కర్నూలు కమాండ్‌ కంట్రోల్‌ నెంబర్‌ 9121101207కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలన్నారు. కర్నూలు నగరంలో రౌండ్‌ ది క్లాక్‌ ఆరుగురు సీఐలు పర్యవేక్షణలో ఉంటారన్నారు. రెడ్‌జోన్‌ ప్రాంతాలలో బ్యాంకులు మూయించాలన్నారు.


వంద శాతం లాక్‌డౌన్‌ అమలు చేయాలని ఆదేశించారు. సమీక్షలో డీఎస్పీలు బాబా ఫకృద్దీన్‌, వినోద్‌కుమార్‌, యుగంధర్‌బాబు, సీఐలు దస్తగిరిబాబు, మహేశ్వరరెడ్డి, తబ్రేజ్‌, శ్రీనివాసరెడ్డి, ఓబులేసు, ఆర్‌ఐలు రంగముని, శివారెడ్డి ఉన్నారు.

Updated Date - 2020-04-09T10:58:42+05:30 IST