క్రిప్టోకరెన్సీ దొరలు దోచలేరు.. దొంగలెత్తుకుపోరు!

ABN , First Publish Date - 2021-11-24T08:36:24+05:30 IST

క్రిప్టోకరెన్సీ..!పునిచ్చి.. నియంత్రణను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని నేతృత్వంలో దీనిపై సమావేశం జరిగి.. ...

క్రిప్టోకరెన్సీ దొరలు దోచలేరు.. దొంగలెత్తుకుపోరు!

అయితే మైనింగ్‌.. లేదంటే కొనడమే!!

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌

ఆ మేరకు తారాస్థాయికి క్రిప్టోకరెన్సీ విలువ

ఒక్క బిట్‌కాయిన్‌ విలువ 60 వేల డాలర్లు

క్రిప్టో కరెన్సీ.. దొరలు దోచలేరు.. 

క్రిప్టోకరెన్సీ వైపు భారత్‌ అడుగులు

సొంతంగా క్రిప్టోకరెన్సీ మైనింగ్‌కు చాన్స్‌!

దేశంలో ఇప్పటికే 75వేల కోట్ల పెట్టుబడులు


క్రిప్టోకరెన్సీ..!పునిచ్చి.. నియంత్రణను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని నేతృత్వంలో దీనిపై సమావేశం జరిగి.. పార్లమెంటరీ స్థాయీ సంఘం నియామకం జరిగింది. రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రభుత్వం ‘క్రిప్టోకరెన్సీ బిల్లు’కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో.. అసలు క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటి? ఎలా కొనుగోలు చేయాలి? ఎలా వినియోగించాలి? ఇత్యాది అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..


భారత కరెన్సీ రూపాయి. అమెరికాలో అది డాలర్‌. రష్యాలో రూబుల్‌. బ్రిటన్‌లో పౌండ్‌. పేరేదైనా.. ఆయా కరెన్సీలను నియంత్రించే కేంద్ర వ్యవస్థలు ఉంటాయి. మనదేశంలో రిజర్వ్‌ బ్యాంకు(ఆర్బీఐ) మాదిరిగా అన్నమాట. ఎన్ని నియంత్రణలున్నా.. ఆన్‌లైన్‌లో ఉన్న మన డబ్బు (లిక్విడ్‌క్యా్‌ష)ను ఎవరో ఒకరు కాజేసే ప్రమాదం లేకపోలేదు. లావాదేవీల్లోనూ మోసాలు జరిగే అవకాశాలున్నాయి. అలాంటివేమీ లేకుండా, అసలు ఏ సంస్థ/మూడోవ్యక్తి అజమాయిషీ/నియంత్రణ లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య(పీర్‌-టు-పీర్‌) ఆన్‌లైన్‌లో లావాదేవీ జరిగితే? అదే క్రిప్టోకరెన్సీ అనే భావనకు మూలం. 1980ల నుంచి దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి.


2008లో సతోషినకమోటో అనే వ్యక్తి/సంస్థ ఈ క్రిప్టోకరెన్సీ భావనకు ఒక పటిష్ఠమైన రూపాన్నివ్వడంతో చలామణిలోకి రావడం ప్రారంభమైంది. క్రిప్టో కరెన్సీ ‘బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ’ ఆధారంగా పనిచేస్తుంది. వేలాది, లక్షలాది కంప్యూటర్లలో విస్తరించి ఉండే వికేంద్రీకరణ సాంకేతికత ఇది. దీన్ని సులభంగా.. అర్థమయ్యేలా.. చెప్పుకోవాలనుకుంటే.. ఒక తరగతి గదిలో 10 మంది పిల్లలు ఉన్నారనుకుంటే..  రాము అనే పిల్లాడు సోము అనే బాలుడికి మూడు పెన్సిళ్లు ఇవ్వాలనుకున్నాడు. ఆ స్కూల్‌ నిబంధన ప్రకారం రాము ఈ విషయాన్ని క్లాస్‌ లీడర్‌కు చెప్తే.. రాము సోముకు మూడు పెన్సిళ్లు ఇచ్చిన విషయాన్ని క్లాస్‌ లీడర్‌ రికార్డుల్లో నమోదు చేస్తాడు. ఇలాంటి చాలా లావాదేవీలను నమోదు చేయాల్సి రావడం వల్లనో, పక్షపాతం వల్లనో కాలక్రమంలో క్లాస్‌లీడర్‌ నమోదు చేస్తున్న రికార్డుల్లో తప్పులుండడాన్ని పిల్లలు గ్రహించారు. దీన్ని మనం ప్రస్తుతం వాడే నగదు లావాదేవీలకు అన్వయిస్తే.. రాము సోము దగ్గర ఇల్లు కొని, డబ్బు చెల్లిస్తున్నాడనుకోండి. ఎంత చెల్లిస్తున్నదీ రిజిస్ట్రార్‌ దగ్గర నమోదు చేయాలి. కానీ, అలా జరిగే క్రమంలో అవకతవకలకు వీలుంది. ఇక్కడే.. ఎలాంటి అవకతవకలకూ వీలు ఉండని క్రిప్టోకరెన్సీ రంగంలోకి వస్తుంది. మళ్లీ పై ఉదాహరణే తీసుకుందాం. తరగతి గదిలో పది మంది పిల్లలున్నారు. ప్రతి విద్యార్థి వద్దా ఒక ఖాతా పుస్తకం ఉంది. రాము సోముకు ఇచ్చిన మూడు పెన్సిళ్ల గురించి అందరూ తమ ఖాతాలో రాసుకుంటారు. ఇలా రాయడం వల్ల రాము తనకు పెన్సిళ్లు ఇవ్వలేదని సోము ఆరోపించడానికి అవకాశం ఉండదు. తాను నాలుగు పెన్సిళ్లు ఇచ్చినట్టు చెప్పడానికి రాముకు అవకాశం ఉండదు. ఎందుకంటే.. వారిద్దరితోపాటు మిగతా ఎనిమిది మంది ఖాతా పుస్తకాల్లో(బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ-వికేంద్రీకరణ) ఆ లావాదేవీ రికార్డయింది.


రాము దగ్గర ఎన్ని పెన్సిళ్లు  ఉండేవి? వాటిలో ఎన్నింటిని అతడు సోముకు ఇచ్చాడు? సోము దగ్గర ఎన్ని ఉన్నాయి? రాము ఇచ్చినవాటితో కలిపి ఎన్ని పెన్సిళ్లయ్యాయి? తదితర వివరాలన్నీ ఆ రికార్డులో ఉంటాయి. ఆ తర్వాత సోము తన దగ్గరున్న మూడు పెన్సిళ్లలో రెండింటిని భీముకు ఇచ్చాడనుకోండి. ఆ లావాదేవీ కూడా మిగతా అందరి పుస్తకాల్లో రికార్డయింది. భీము దగ్గర అప్పటికే నాలుగు పెన్సిళ్లున్నాయి. సోము ఇచ్చినవాటితో కలిపితే ఆరు పెన్సిళ్లయ్యాయి. అతడు కృష్ణ అనే మరో విద్యార్థికి ఏడు పెన్సిళ్లు ఇస్తానంటే..  ‘అలా ఎలా ఇస్తావు? నీ దగ్గర ఉన్నవి ఆరు పెన్సిల్స్‌ మాత్రమే?’ కదా అని మిగతావారు నిలదీస్తారు. అంటే.. తప్పు జరగడానికి ఆస్కారం ఉండని పద్ధతి ఇది. ఇదే పని భౌతికంగా కాకుండా ఆన్‌లైన్‌లో జరిగితే అదే క్రిప్టోకరెన్సీ. ఇందులో జరిగే ప్రతి లావాదేవీ తాలూకూ వివరాలన్నింటినీ కలిపి ఒక బ్లాక్‌(తునక/ముక్క అనొచ్చేమో?)గా వ్యవహరిస్తారు. ప్రతి బ్లాకూ(లావాదేవీ) దానికి ముందున్న బ్లాక్‌తో అనుసంధానమవుతుంది. అంటే ఒక చెయిన్‌లాగా ఏర్పడుతుంది.


మనం భూములు కొనేటప్పుడు చూసే లింకు డాక్యుమెంట్లలాగా ఈ చెయిన్‌ అనంతంగా సాగుతుంది. ఉదాహరణకు.. 2008-09లో సతోషి నకమోటో తొలిసారి మైనింగ్‌ చేసిన 50 బిట్‌కాయిన్లు ఆ తర్వాత ఎన్ని చేతులు మారిందీ రికార్డు అయి ఉంటుంది. ఇదే ‘బ్లాక్‌చెయిన్‌’ టెక్నాలజీ. ఈ చెయిన్‌ను మార్చే శక్తి ఏ హ్యాకర్‌కూ ఉండదు. ఈ లావాదేవీలపై ఏ కేంద్ర బ్యాంకు/ప్రభుత్వ జోక్య ం, అజమాయిషీ ఉండవు కాబట్టి నల్ల కుబేరులు డబ్బును క్రిప్టో కరెన్సీల్లోకి మార్చుకుని భారీ లావాదేవీలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఫలితంగా క్రిప్టోకు డిమాండ్‌ బాగా పెరుగుతోంది. దాంతోపాటే విలువ కూడా పెరుగుతూ వస్తోంది.


రారాజు.. బిట్‌కాయిన్‌

క్రిప్టోకరెన్సీ అనే పదం ‘డబ్బు’ అనే పదానికి సమానం. డబ్బులో.. రూపాయలు, డాలర్లు, పౌండ్లు, రూబుళ్లు అనే తేడాలున్నట్టు క్రిప్టోకరెన్సీలో కూడా బిట్‌కాయిన్లు, ఎథేరియం, లైట్‌కాయిన్‌, కార్డానో, టెదర్‌, సోలానా, పోల్కాడాట్‌.. ఇలా రకరకాల కరెన్సీలున్నాయి. మామూలు నగదులో డాలర్లలాగా.. క్రిప్టోకరెన్సీకి ‘బిట్‌కాయిన్‌’ రారాజుగా వెలుగొందుతోంది. నిజానికి డాలర్‌ కన్నా బిట్‌కాయిన్‌ విలువ వేల రెట్లు అధికం. ఒక్క బిట్‌కాయిన్‌ విలువ ప్రస్తుతం 57 వేల డాలర్లకు పైమాటే. మన కరెన్సీలో దాదాపు రూ.42.81 లక్షలు. కానీ, దాంతో బోలెడన్ని రహస్య లావాదేవీలు చేసే వీలుండడమే నల ్లకుబేరులను ఆకర్షిస్తున్న అంశం. 


బిట్‌కాయిన్లను సంపాదించడమెలా?

బిట్‌కాయిన్లను సొంతం చేసుకోవడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి.. కొనుగోలు చేయడం. అంటే పెట్టుబడి విధానం. రెండోది మైనింగ్‌..  కష్టపడి సంపాదించడం. డబ్బుంటే కొనుగోలు సులభం కాబట్టి దాని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మిగిలింది మైనింగ్‌. అంటే ఏంటి? మైనింగ్‌ ఎలా చేస్తారు? అంటే.. పైన మనం చెప్పుకొన్నట్టు ప్రతి బిట్‌కాయిన్‌ లావాదేవీ బ్లాక్‌ రూపంలో ముందున్న బ్లాక్‌కు జోడవ్వాలి. ఇలా జోడించాలంటేఅత్యంత క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. అందుకు అత్యంత శక్తిమంతమైన, ఖరీదైన కంప్యూటర్లు కావాలి. అత్యంత ఖరీదైన ‘అప్లికేషన్‌-స్పెసిఫిక్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్స్‌ (ఏఎ్‌సఐసీ) అనే హార్డ్‌వేర్‌ కావాలి. మైనింగ్‌కు కరెంటు విపరీతంగా ఖర్చవుతుంది. ఎందుకంటే కొత్త లావాదేవీ తాలూకూ బ్లాక్‌ను ముందున్న బ్లాక్‌తో అనుసంధానించడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కృషి చేస్తుంటారు. వారిలో ఎవరు ముందుగా ఆ బ్లాక్‌కు సంబంధించిన గణిత సమస్యను పరిష్కరిస్తారో వారి పేరిట ఆ రికార్డు నమోదవుతుంది.


దానికి నజరానాగా వారికి కొన్ని బిట్‌ కాయిన్లు వస్తాయి. దీన్నే మైనింగ్‌ అంటారు. ఇక్కడో చిక్కుంది. మైనింగ్‌కు వచ్చే రివార్డు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లేదా ప్రతి 2,10,000 బ్లాకులకు ఒకసారి సగమైపోతుంటుంది.2009లో సతోషి నకమోటో తొలిసారి మైనింగ్‌ చేసినప్పుడు రివార్డు 50 బిట్‌కాయిన్లుండేది. 2012 నవంబరుకు అది 25 బిట్‌కాయిన్లకు, 2016లో 12.5 బిట్‌కాయిన్లకు తగ్గిపోయింది. ఈ ఏడాది 6.25 బిట్‌కాయున్లకు పడిపోయింది. అలాగని అదేమంత ఆషామాషీ మొత్తమేమీ కాదండోయ్‌! మన కరెన్సీలో దాదాపు రూ.2.5 కోట్లకు సమానం. అంటే.. అత్యంత ఖరీదైన కంప్యూటర్లను వాడి, విపరీతంగా కరెంటు ఖర్చు పెట్టి మైనింగ్‌ చేసినా ఒక్కసారి రివార్డు తగిలిందంటే బంపర్‌ డ్రా గెలుపొందినట్టే. రివార్డు కాకుండా ట్రాన్సాక్షన్‌ ఫీ కింద కూడా మైనింగ్‌ చేసేవారికి నామమాత్రంగా కొంత మొత్తం ముడుతుంటుంది. సాధారణంగా బంగారం గనుల్లో తొలినాళ్లలో ఎక్కువ బంగారం లభిస్తూ.. కాలక్రమేణా తగ్గిపోతుంటుంది. బిట్‌కాయిన్ల విషయంలో కూడా అంతే. దాని  ప్రోగ్రామింగ్‌ ప్రకారం 20.99999998 మిలియన్లకు (అంటే 2.1 కోట్లకు) మించి బిట్‌కాయిన్లు ఉత్పత్తి కావు. 2140 నాటికి, అంతకుమందే బిట్‌కాయిన్ల సంఖ్య ఆ పరిమితికి చేరుతుందని అంచనా. ఆ పరిమితికి చేరాక బిట్‌కాయిన్లు ఉత్పత్తి కావు. మైనింగ్‌ నిలిచిపోతుంది.


ఇదీ భారత్‌ పరిస్థితి?

ఫ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల ప్రవాహం భారతదేశంలో అత్యధికంగా ఉంది. ముఖ్యంగా.. స్టాక్‌ మార్కెట్‌ అంటే ఏంటో కూడా తెలియని యువత నేరుగా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడుతున్నారు. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌చేసే ‘కాయిన్‌ స్విచ్‌ కుబేర్‌’ యాప్‌నే తీసుకుంటే.. ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన ఈ యాప్‌ వినియోగదారులు 1.1 కోట్ల మంది సగటు వయసు 25 సంవత్సరాలు! వారిలో 55ు మంది ఢిల్లీ, ముంబై లాంటి మెట్రోపాలిటన్‌ నగరాలవారు. 2018లో బెంగళూరులో క్రిప్టోకరెన్సీని ఎక్స్‌చేంజ్‌ చేసే కియో్‌స్కను ప్రారంభించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న  దశ నుంచి.. దాదాపు రూ.75 వేల కోట్ల పెట్టుబడులు క్రిప్టో కరెన్సీలోకి ప్రవహించే దశకు దేశం చేరుకుంది.


ఫ బ్యాంకులు, ఇతర ఆర్థిక సేవల సంస్థలు క్రిప్టోకరెన్సీ సేవలను అందించకుండా ఆర్బీఐ 2018 ఏప్రిల్‌ 6న విధించిన నిషేధ ఉత్తర్వులను.. గత ఏడాది మార్చి 4న సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత.. కాయిన్‌ స్విచ్‌ కుబేర్‌, జెబ్‌పే వంటి సంస్థల ద్వారా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. క్రిప్టోకరెన్సీతో చాలా సమస్యలు ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దా్‌స పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. అవి ఉగ్రవాదులకు, మనీలాండరింగ్‌కు ఉపయోగపడే ప్రమాదం ఉందని దర్యాప్తు సంస్థలు కూడా హెచ్చరిస్తున్నాయి.


ఫ కేంద్రం మాత్రం దీనిపై నిషేధం విధించకుండా నియంత్రించే మార్గాల దిశగా ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రధాని అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. మనీలాండరింగ్‌ మార్గంగా, ఉగ్రవాదులకు ఆర్థిక వనరులుగా మారకుండా నిలువరించే చర్యలపై చర్చించారు. బీజేపీ నేత జయంత్‌సిన్హా అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ స్థాయీ సంఘం(ఫైనాన్స్‌) భేటీలో కూడా.. క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్‌లు, లావాదేవీలపై నియంత్రణ ఉండాలే తప్ప నిషేధించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో క్రిప్టోకరెన్సీ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా పన్ను పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. పార్లమెంట్‌ సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ బిల్లు ప్రవేశపెట్టనుంది.             - సెంట్రల్‌డెస్క్‌


టీన్స్‌లోకి బిట్‌కాయిన్‌

వ్యక్తి  లేదా గ్రూపు కావచ్చు సతోషి నకమోటో బిట్‌కాయిన్‌పై పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది 2008 అక్టోబరు 31న.  ఈ ఏడాది అక్టోబరు 31కి బిట్‌కాయిన్‌కు 13 ఏళ్లు నిండాయి. అయితే.. బిట్‌కాయిన్‌ నెట్‌వర్క్‌ మొదలైంది మాత్రం 2009 జనవరి 3న. ఆరోజు బిట్‌కాయిన్‌ విలువ 0.0008 డాలర్లు. ఇప్పుడు.. ఒక బిట్‌కాయిన్‌ దాదాపు 60 వేల డాలర్ల దాకా ఉంది. అంటే.. 7,749,999,900ు పెరుగుదల.


ఎల్‌ సాల్విడార్‌లో క్రిప్టోకరెన్సీ నగరం

మధ్య అమెరికా దేశమైన ఎల్‌ సాల్విడార్‌ నగరం క్రిప్టోకరెన్సీకి అధికారికంగా గుర్తింపునిస్తున్నట్లు ప్రకటించింది. క్రిప్టోకరెన్సీ మైనింగ్‌కు ప్రత్యేకంగా ఓ నగరాన్ని నిర్మిస్తామని ఆ దేశ అధ్యక్షుడు నయీబ్‌ బుకేలే వెల్లడించారు. తమదేశంలోని అగ్నిపర్వతం అంచున ఈ నగరాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని, అక్కడ క్రిప్టోకరెన్సీ మైనింగ్‌కు శక్తిమంతమైన సర్వర్లను, నిరంతరాయ కరెంటు సరఫరా వంటి సదుపాయాలను కల్పిస్తామన్నారు. 


హెచ్చుతగ్గులెందుకు

మామూలు కరెన్సీలాగానే క్రిప్టోకరెన్సీ విలువ కూడా రకరకాల పరిస్థితులకు ప్రభావితమవుతుంది. వాటిలో మొదటిది.. అందరికీ తెలిసిన అర్థశాస్త్ర సూత్రం ‘డిమాండ్‌-సప్లై’ అంశమే. సరఫరా కన్నా డిమాండ్‌ ఎక్కువగా ఉంటే ధర/విలువ పెరుగుతుంది. అదే క్రిప్టోకు కూడా వర్తిస్తుంది.  బిట్‌కాయిన్‌ క్రమంగా పెరుగుతూ 2.1 కోట్లకు చేరుకున్నాక ఆగిపోతుంది.  బిట్‌కాయిన్‌ కోసం మైనింగ్‌ చేసేవారి సంఖ్య పెరిగినకొద్దీ.. కాయిన్‌ మైనింగ్‌కు  క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించాలి. అందుకు అయ్యే ఖర్చులకు సరిపడా బిట్‌కాయిన్‌ విలువ రాకపోతే మైనింగ్‌ ఆపేస్తారు. ఫలితంగా దాని విలువ తగ్గుతుంది. మూడోది.. పోటీ. మార్కెట్లో  బిట్‌కాయిన్‌ మాత్రమే ఉన్నప్పుడు దానికోసమే ఎగబడేవారు. ఎథీరియం వంటి కరెన్సీలు రాగానే బిట్‌కాయిన్‌ మార్కెట్‌ 80 శాతానికి తగ్గింది. మొ త్తం మార్కెట్‌లో బిట్‌కాయిన్‌ వాటా 50ు  ఉంటుందని అంచనా. ఇక నాలుగో అంశం.. ఈ కరెన్సీకి వ్యతిరేకంగా  ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తే సహజంగానే డిమాండ్‌ తగ్గుతుంది.

Updated Date - 2021-11-24T08:36:24+05:30 IST