నెహ్రూపై విమర్శలు

ABN , First Publish Date - 2020-02-14T11:02:43+05:30 IST

‘ఓడు, ఓడంటే కంచమంతా ఓడు’ అన్నట్టుగా ప్రస్తుతం కాంగ్రెస్ సంస్థపై విమర్శలు వస్తున్నాయి. అది చచ్చిందని, కుళ్ళిందని, కంపుకొడుతున్నదని- ఒక్కటేమిటి? చాలా చాలా మాటలు వినవస్తున్నాయి...

నెహ్రూపై విమర్శలు

నెహ్రూ తనకు శత్రువనే వ్యక్తి భారత ప్రజా సామాన్యానికి శత్రువు; యుగ ధర్మానికి శత్రువు; సమతా సౌభ్రాత్రాలు ప్రాతిపదికలుగా గల నవ సమాజ నిర్మాణ లక్ష్యానికి శత్రువు; ప్రగతికి శత్రువు; భవిష్యత్తుకే శత్రువు.


‘ఓడు, ఓడంటే కంచమంతా ఓడు’ అన్నట్టుగా ప్రస్తుతం కాంగ్రెస్ సంస్థపై విమర్శలు వస్తున్నాయి. అది చచ్చిందని, కుళ్ళిందని, కంపుకొడుతున్నదని- ఒక్కటేమిటి? చాలా చాలా మాటలు వినవస్తున్నాయి. 

కాంగ్రెసు ఈనాటిది కాదు, భారత జాతీయోద్యమంతో అది పుట్టింది, దానితో పెరిగింది. దాని దీర్ఘచరిత్రలో నిమ్నోన్నతాలు ఎన్నో వున్నాయి. అధఃపతనం చెందినట్టు కనపడినా, తిరిగి అది మిన్నంటిన ఘట్టాలనేకం. ఇప్పుడది మరొకసారి దుర్భరస్థితిలో పడిపోతే, దానిలో దుర్లక్షణాలు కానవస్తే, అంతమాత్రం చేతనే దాన్ని త్రోసిపుచ్చవలెననడం తగదు. వజ్రాయుధానికైనా కొన్ని కొన్ని సందర్భాలలో తుప్పుపట్టవచ్చు. అంతమాత్రం చేత దాన్ని పారవేయవచ్చునా? తిరిగి దానికి పదును పెట్టాలి, తళ తళ మెరిసేట్టు చేయాలి, తిరుగులేని ఆయుధంగా మరల మరల వినియోగించుకోవాలి. కాంగ్రెస్ విషయంలో కూడా ప్రస్తుతం జరగవలసిందింతే‌!

జాతీయోద్యమంలో పుట్టి, జాతీయోద్యమంతో పెరిగి, జాతీయ స్వాతంత్ర్యాన్ని 

సాధించిన కాంగ్రెసు ఆ జాతీయ స్వాతంత్ర్యాన్ని అన్న వస్త్రాల రూపంలో, విద్యా విజ్ఞానాల రూపంలో, శాంతి సౌఖ్యాల రూపంలో సామాన్య ప్రజాయత్తం చేయడంలో ఈనాడు కూడా నిర్వహించవలసిన -నిర్వహించగల-ప్రధానపాత్ర కలదని మన ప్రధాని నెహ్రూ పరమ విశ్వాసం. ఆయన కాంగ్రెసులో విశ్వాసాన్ని కోల్పోనంతవరకు ఆయననే తమ సారథిగా, తమ సచివునిగా, తమ ఆప్తునిగా, తమ మిత్రునిగా ఎన్నుకొన్న భారత ప్రజానీకం కూడా దానిపట్ల తన విశ్వాసాన్ని కోల్పోదు, ఇది ముమ్మాటికీ నిజం! 

ఈ రహస్యం తెలిసినందునే కాంగ్రెసును వ్యతిరేకిస్తున్న కొందరు ప్రముఖులు కాంగ్రెస్‌పై కంటే నెహ్రూపైనే ఎక్కువగా కారాలు, మిరియాలు నూరుతున్నారు. నెహ్రూను తమ శత్రువుగా పేర్కొంటున్నారు. నెహ్రూ తనకు శత్రువనే వ్యక్తి భారత ప్రజా సామాన్యానికి శత్రువు; యుగధర్మానికి శత్రువు; సమతా సౌభ్రాత్రాలు ప్రాతిపదికలుగా గల నవ సమాజ నిర్మాణ లక్ష్యానికి శత్రువు; ప్రగతికి శత్రువు; భవిష్యత్తుకే శత్రువు. 

(1962, సెప్టెంబర్ 8 ఆంధ్రజ్యోతి సంపాదకీయం ‘కాంగ్రెస్ సంస్థ’ నుంచి)

Updated Date - 2020-02-14T11:02:43+05:30 IST