ఏడడుగుల మొసలి దాడి.. ఇలా బతికి బట్టకట్టాడు!

ABN , First Publish Date - 2021-10-01T00:59:05+05:30 IST

మొసలి నీటిలో ఉన్నా, బయట ఉన్నా దాంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న అది విరుచుకుపడడం ఖాయం.

ఏడడుగుల మొసలి దాడి.. ఇలా బతికి బట్టకట్టాడు!

అడిలైడ్: మొసలి నీటిలో ఉన్నా, బయట ఉన్నా దాంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న అది విరుచుకుపడడం ఖాయం. కనుక సాధ్యమైనంత వరకు దానికి దూరంగా ఉండడం మంచిది. దీనికి చక్కటి ఉదాహరణ ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ఓ సంఘటన. ఓ ఆస్ట్రేలియన్ వైల్డ్‌లైఫ్ టూర్ ఆపరేటర్‌కు ఈ ఊహించని సంఘటన ఎదురైంది. భూమిపై ఇంకా నూకలు ఉండడంతో ఏడడుగుల మొసలి దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడాయన. అసలేం జరిగిందంటే.. అడిలైడ్ నదిలో బోటులపై సీన్ డియర్లీ(60) అనే పెద్దాయన టూర్ ఆపరేటర్‌‌గా పనిచేస్తుంటాడు. అంటే ఆ బోటు ఎక్కిన టూరిస్టులకు గైడ్‌గా ఉండడం. ఇక అడిలైడ్ నది మొసళ్లకు చాలా ఫేమస్. దాంతో టూరిస్టులు వాటిని చూడటానికి భారీ సంఖ్యలో వస్తుంటారు. దాంతో టూర్ బోటులకు నిర్వాహకులు ఇరువైపు ఇనుప చువ్వలతో ప్రత్యేక నిర్మాణాలు ఏర్పాటు చేస్తారు. బోటులో ఉన్న సందర్శకులపై మొసళ్లు దాడి చేయకుండా ఇవి అడ్డుగా ఉంటాయి.


ఇక సోమవారం(సెప్టెంబర్ 27న) ప్రతి రోజులాగే తన బోటుపై 18 మంది టూరిస్టులను ఎక్కించుకుని నది సందర్శనకు బయల్దేరాడు డియర్లీ. కొంతదూరం వెళ్లిన తర్వాత నదిలోని మొసళ్లకు ఓ పొడవైన కర్ర సాయంతో మాంసం ముక్కలు వేయడం ప్రారంభించాడు. అవి పైకి ఎగురుతుంటే వాటిని చూపి బోటులో ఉన్న టూరిస్టులు కేరింతలు కొడుతున్నారు. ఈ క్రమంలో డియర్లీ చేతిలో ఉన్న కర్ర నదిలో పడిపోయింది. దాంతో దాన్ని తీసేందుకు ప్రయత్నించాడు. అంతే.. ఓ మొసలి అతని చేతిని కరిచి పట్టేసింది. వెంటనే చేతిని పైకి తీశాడు డియర్లీ. ఇంకేముంది చేతితో పాటు ఏడడుగుల మొసలి అలాగే పైకి వచ్చేసింది. దాని నుంచి వీడిపించుకునేందుకు ఆయన బాగానే ప్రయత్నించాడు. కానీ, అది వదిలిపెట్టలేదు. ఆ దృశ్యం చూసిన బోటులోని టూరిస్టులు భయంతో అరుస్తున్నారు. ఈ క్రమంలో మొసలి కొంచెం తన పట్టును కోల్పోయినట్లు అనిపించడంతో డియర్లీ వెంటనే తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. దాంతో అది పట్టుకోల్పోయి నీటిలో పడిపోయింది. డియర్లీ చేయి మాత్రం రక్తసిక్తమైంది. వెంటనే ఆయనను పామర్‌స్టన్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇలా ఏడడుగుల మొసలి దాడి నుంచి సీన్ డియర్లీ తృటిలో తప్పించుకుని బతికి బట్టకట్టాడు.          

Updated Date - 2021-10-01T00:59:05+05:30 IST