మెకనైజేషన్‌

ABN , First Publish Date - 2021-05-18T06:36:59+05:30 IST

సాంకేతికతను జోడించి సిరులు పండించాలి.. సాగులో ఖర్చులు తగ్గించాలి.. రైతుల ఆదాయం పెంచాలి.. అనే ధ్యేయంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రసాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులను వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టారు.

మెకనైజేషన్‌

వ్యవసాయంలో యాంత్రీకరణ నిల్‌

రైతులకు అందని రూ.4 వేల కోట్ల నిధులు

రెండేళ్ళ నుంచి కనపడని సబ్సిడీ పరికరాలు

కేంద్రం నిధులిస్తోన్నా రాష్ట్రప్రభుత్వం మొండిచెయి

పరికరాల కోసం ఆర్‌బీకేలలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు

 

(ఆంధ్రజ్యోతి - గుంటూరు) 


ఆధునిక వ్యవసాయ పరికరాలు అందించే పథకాలు

ఆర్‌కేవీవై : రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన

ఎస్‌ఎంఎఎం : సబ్‌మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మెకనైజేషన్‌

ఎస్‌డీపీ : స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

పీఎంకేఎస్‌వై : ప్రధానమంత్రి కృషి సంచాయిత్‌ యోజన

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం : నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ మిషన్‌ (జాతీయ ఆహార భద్రతా పథకం)


సాంకేతికతను జోడించి సిరులు పండించాలి.. సాగులో ఖర్చులు తగ్గించాలి.. రైతుల ఆదాయం పెంచాలి.. అనే ధ్యేయంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రసాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులను వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ ఆధునిక వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు మంజూరు చేస్తుంటుంది. అయితే రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంలో మెకనైజేషన్‌ గురించే ఆలోచించడంలేదు. రెండేళ్ళ నుంచి రాష్ట్రంలో రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలు ఇవ్వడం లేదు. దీంతో రెండేళ్ల నుంచి మెకనైజేషన్‌ మరుగున పడింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి ఎక్కడికక్కడ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను(ఆర్‌బీకే) ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో ఆయా గ్రామాల పరిధిలోని రైతులు ఆధునిక వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై ఇప్పించాలని పెద్దసంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. తైవాన్‌ స్ర్పేయర్లు, వరికోత, నాటేయంత్రాలు, భూమిని చదునుచేసే బుల్డోజర్లు,   బిందు, తుంపర సేద్యం పరికరాలు, టార్పాలియన్‌ పట్టలు తదితరాలు కావాలని ఆర్‌బీకేలలో అందజేసిన దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయ, ఉద్యాన శాఖలకు సుమారు రూ.2 వేల కోట్లు మెకనైజేషన్‌ కింద ఆధునిక వ్యవసాయ పరికరాలకు నిధులు వస్తుంటాయి. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతంతో ఆధునిక వ్యవసాయ పరికరాలను రైతులకు అందచేయాలి. రైతులకు 40- 70 శాతం సబ్సిడీపై వారికి అవసరమైన పరికరాలను అందిచేయాలి. రాష్ట్రంలో 2019-20 ఖరీఫ్‌నుంచి ఇప్పటివరకు సుమారు రూ.4 వేల కోట్ల మెకనైజేషన్‌ నిధులు ఇతర కార్యక్రమాలకు తరలించారు. దీంతో ఆధునిక పరికరాల పథకం పడకేసింది. గతంలో రైతులు తైవాన్‌ స్ర్పేయర్‌, వరికోత, నాట్లువేసే యంత్రాలు, మొక్కజొన్న నూర్పిడి యంత్రాలు ఇప్పించాలని ఎమ్మెల్యేల సిఫార్స్‌ లేఖల కోసం క్యూ కట్టేవారు. రెండేళ్ళ నుంచి ఆ ఊసే ప్రస్తుత ప్రభుత్వం ఎత్తడంలేదు. 


పడకేసిన కస్టమ్స్‌ హైరింగ్‌ సెంటర్‌..

రెండేళ్ళ క్రితం ఆర్‌బీకేలకు అనుసంధానంగా ఆధునిక పరికరాల అద్దె కేంద్రాల(కస్టమ్స్‌ హైరింగ్‌ సెంటర్‌)ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.    పీఏసీఎస్‌లో రూ.10 - రూ.12 లక్షలతో వీటిని ఏర్పాటు చేస్తారని వ్యవసాయశాఖ ప్రకటించింది. దీనిలో రూ.5 లక్షలు సబ్సిడీ, రూ.5 లక్షలు పీఏసీఎస్‌ రుణంగా, రూ.2.5 లక్షలు లబ్ధిదారులు భరించే విధంగా ఈ పఽథకాన్ని రూపొందించారు. లబ్ధిదారులను కూడా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఏ కారణం వల్లో ఈ పథకం మరుగున పడింది.  రైతులు అన్ని ఆధునిక పరికరాలను కొనుగోలు చేయలేరని, సంవత్సరం పొడవునా వాటి అవసరం అంతగా ఉండదని.. అదే అవసరమైన వాటిని తక్కువ అద్దెకు ఇస్తే రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం పెద్దఎత్తున ప్రకటనలిచ్చింది.   

 

Updated Date - 2021-05-18T06:36:59+05:30 IST