మద్దతే ముఖ్యం!

ABN , First Publish Date - 2020-12-01T09:15:24+05:30 IST

విపత్తుల వల్ల దెబ్బతిన్న పంటలకు.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 33% కంటే ఎక్కువ నష్టం ఉంటేనే పరిహారం అందిస్తారు.

మద్దతే ముఖ్యం!

తడిసి, రంగు మారిన పంట ఉత్పత్తులకు ఎమ్మెస్పీ దక్కేనా?

నాణ్యత ప్రామాణికమైతే గిట్టుబాటు ధర కష్టమే!


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

విపత్తుల వల్ల దెబ్బతిన్న పంటలకు.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 33% కంటే ఎక్కువ నష్టం ఉంటేనే పరిహారం అందిస్తారు. అంత కంటే తక్కువ నష్టానికి పరిహారం ఇవ్వడం లేదు. పంట నష్ట పరిహారం చెల్లింపుల విషయంలో కేంద్రమార్గదర్శకాలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది. దీనివల్ల నష్టం అంచనాల్లోకి రాకపోతే, పరిహారం ఊసెత్తడం లేదు. పైగా కనీసం తడిసిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు దక్కని పరిస్థితి. ఈ విషయంలో సగటు నాణ్యత నిబంధన అడ్డంకిగా మారింది. దీంతో తడిసిన ఉత్పత్తులకు నాణ్యతను బట్టి ధర చెల్లిస్తున్నారు.  రాష్ట్రం కోరినా కేంద్రం నిబంధనలు సడలించలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంటకు మాత్రమే ఈ నిబంధన సడలించి కొనుగోలు చేయాలని నిర్ణయించి జీవో కూడా ఇచ్చింది. ప్రస్తుతం వేరుశనగ పంట వర్షాలకు దెబ్బతింది. ధాన్యానికి ఈ నిబంధనల సడలింపు లభించలేదు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం, మంత్రి ప్రకటించారు. కానీ, నాణ్యత ఆధారిత నిబంధనలతో  మద్దతు ధరకు కొనుగోలు చేసే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ముఖ్యంగా పత్తి కొనుగోలు విషయంలో తేమ శాతాన్ని బట్టి సీసీఐ ధర నిర్ణయిస్తోంది. ఇప్పుడు తడిసిన పత్తిని సీసీఐ సేకరించడం సందేహాస్పదమే.


మినుములు, పెసర విషయంలోనూ తడిసిన ఉత్పత్తిని మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేయడం లేదు. నివర్‌ తుఫాన్‌ కారణంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో పంటలు పూర్తిగా దెబ్బతినగా, మిగిలిన జిల్లాల్లో ధాన్యం, పత్తి, వేరుశనగ, అపరాల ఉత్పత్తులు తడిసిపోయాయి. సాధారణంగా వర్షానికి తడిస్తే.. రంగు మారడం, గింజ పగిలి(విరిగి)పోవడం, ముక్కిపోవడం జరుగుతుంది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో ప్రస్తుతం వరి కోత దశలోనూ, కోసి ఓదెలపైనా, కుప్పల్లోనూ ఉంది. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పత్తి కూడా తీయాల్సిన తరుణంలో వర్షాలు పడ్డాయి. దీంతో ఆ ఉత్పత్తి కూడా పాడైపోయింది. 33%లోపు పంట నష్ట పరిహారం అందకపోగా, నాణ్యత ఆధారంగా కొనుగోలు చేసినా, మద్దతు ధర దక్కుతుందనే గ్యారెంటీ ప్రభుత్వం నుంచి లేదని రైతుప్రతినిధులు పేర్కొంటున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు, వట్టిచెరుకూరు మండలాల్లో తడిసిన వరి కంకులను, పంటలను సోమవారం పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎండీ సూర్యకుమారి పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రైతుల నుంచి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు.


ఇంకా నీటిలోనే పనలు..

కృష్ణాజిల్లాలోని తిప్పనగుంట, ఆరుగొలను, అప్పారావుపేట ప్రాంతాల్లో ఏలూరు కాలువ కింద పొలాల్లో వరి పనలు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. కుప్పవేసిన పొలాల్లో నీరు చేరడంతో పంట కాటాలు పెట్టేదాకా దిగుబడి లెక్కించలేమని రైతులు వాపోతున్నారు. రంగన్నగూడెం, సింగన్నగూడెం, రేమల్లెల్లో పట్టాలు కప్పి ఉంచిన ధాన్యం అడుగున చెమ్మజేరి మొలకలు వచ్చాయి. ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని నాయకులు, రైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-12-01T09:15:24+05:30 IST