అకాల వర్షం

ABN , First Publish Date - 2020-04-08T10:51:08+05:30 IST

జిల్లాలో అకాలంగా వానలు కురిశాయి. మంగళవారం సాయంకాలం చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. అసలే కరోనా వల్ల

అకాల వర్షం

రైతులకు పంట నష్టం 

కూలిపోయిన అరటి తోటలు

తడిసిపోయిన పంట దిగుబడులు

ఒరిగిపోయిన విద్యుత్‌ స్తంభాలు


జిల్లాలో అకాలంగా వానలు కురిశాయి. మంగళవారం సాయంకాలం చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. అసలే కరోనా వల్ల వ్యవసాయరంగం కుదేలైంది. పంట దిగుబడులు అమ్ముకోడానికి వీల్లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పొలాల్లో, కల్లాల్లో ఉన్న పంట తడిసిపోయింది. వైరస్‌కు వర్షాలు తోడై నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పది రోజుల క్రితం రుద్రవరం, సిరివెళ్ల తదితర మండలాల్లో 1252 హెక్టార్లలో మొక్కజొన్న, వరి, మినుము పంటలు వర్షాలకు దెబ్బతినడంతో రూ.1.60 కోట్ల నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ జేడీ విల్సన్‌ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. సోమవారం కూడా అక్కడక్కడా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. 


చెట్ణేహల్లిలో పిడుగుపాటు..ఒకరు మృతి, నలుగురికి గాయాలు

మంత్రాలయం మండలం చెట్నేహల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షంలో పిడుగు పడింది. చెందిన రామాంజనేయులు (28) అనే యువకుడు మృతి చెందాడు. మరో నలుగురు కూలీలు గాయపడ్డారు. గ్రామానికి చెందిన రామాంనేయులు, అళ్లింగప్ప, లింగమయ్య, భీమయ్య, రమేష్‌లతో పాటు మరికొంత మంది తుంగభద్ర నది ఒడ్డున ఉన్న గ్రామంలోని ఓ రైతు పొలంలో కోతకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. కూలీలు పని చేసేచోట పిడుగు పడింది. దీంతో అక్కడ ఉన్న రామాంజనేయులు, అళ్లింగప్పలకు తీవ్రగాయాలయ్యాయి.


లింగమయ్య, భీమయ్య, రమేష్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామ సరిహద్దులో పెద్ద శబ్దం రావడంతో గ్రామస్థులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులు 108కు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో తీవ్రంగా గాయపడిన రామాంజనేయులు, అళ్లింగప్పలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామాంజనేయులు మార్గమధ్యంలో మృతి చెందాడు. అళ్లింగప్పకు వైద్యం అందించగా కోలుకుంటున్నట్లు తెలిపారు. మృతుడు రామాంజనేయులకు భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. 


Updated Date - 2020-04-08T10:51:08+05:30 IST