Abn logo
Oct 27 2021 @ 03:15AM

పంట రుణాలు మరింత సులభతరం

దీపావళికి ముందే రైతు కళ్లల్లో ఆనందం  

మూడు పథకాలకు నగదు చెల్లింపులు

మీట నొక్కి జమ చేసిన సీఎం జగన్‌

అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘రైతును చేయిపట్టుకుని నడిపించే గొప్ప వ్యవస్థను ఆర్బీకే రూపంలో తెచ్చాం. రైతులకు మరింత సులభంగా పంట రుణాలందించేందుకు 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేశాం. 9,160చోట్ల బ్యాకింగ్‌ కరస్పాండెంట్లను కూర్చోబెట్టాం. మిగిలిన చోట్లా కూడా అతి త్వరలో వారిని నియమించేందుకు బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయి. కౌలురైతులతో సహా రైతులందరికీ బ్యాంకు లావాదేవీలు జరుపుకునేందుకు, పంట రుణాలు సకాలంలో అందుకునేందుకు, ఆర్బీకేల్లో బ్యాకింగ్‌ కరస్పాండెంట్ల సేవలు ఎంతో ఉపయోగపడతాయి’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి  చెప్పారు. వైఎస్సాఆర్‌ రైతుభరోసా, సున్నావడ్డీ పంట రుణాలు, వైఎస్సాఆర్‌ యంత్రసేవా పథకం కింద లబ్ధిదారులకు నగదు చెల్లింపులకు మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ ఆఫీ్‌సలో ముఖ్యమంత్రి కంప్యూటర్‌ మీట నొక్కారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయానికి దన్నుగా, రైతు పక్షపాత ప్రభుత్వంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తూ వస్తున్నాం. రైతుల కళ్లల్లో వారం ముందే దీపావళి కాంతులను చూడాలన్న ఉద్దేశంతో.. రైతుభరోసా, సున్నావడ్డీ, యంత్రసేవా పథకానికి సంబంధించి రూ.2,190కోట్ల లబ్ధిని విడుదల చేస్తున్నాం. రైతు భరోసా కింద ఆగస్టులో విడుదల చేసిన రూ.972కోట్లతో కలుపుకుని, ఇప్పుడు రూ.2,052 కోట్లు ఇస్తున్నాం. ఈ-క్రాప్‌ డేటా ఆధారంగా వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద 6.67లక్షల మంది రైతులఖాతాల్లో రూ.112.7కోట్లు వడ్డీ రాయితీని జమ చేస్తున్నాం. వైఎస్సార్‌ యంత్రసేవా పథకం కింద 1,720 రైతు గ్రూపులకు రూ.25.55కోట్ల సబ్సిడీని జమ చేస్తున్నాం. రాష్ట్రంలో రూ.2,134కోట్లతో ఆర్బీకేలకు అనుసంధానంగా 10,750సీహెచ్‌సీలు ఏర్పాటవుతున్నాయి. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో మండలానికి అదనంగా 5 సీహెచ్‌సీలు అందుబాటులోకి తెస్తున్నాం. ఇవన్నీ ఈ 29నెలల పాలనలో దేవుని దయతో జరిగాయి’ అని జగన్‌ పేర్కొన్నారు. పంట ఉత్పత్తుల ధరలు తగ్గితే ఆర్బీకే స్థాయిలో సీఎం యాప్‌ ద్వారా తెలుసుకుని, వెంటనే ధరల స్థిరీకరణ నిధితో రైతును ఆదుకునే చర్యలు చేపడతామన్నారు. సహకార వ్యవస్థలో పీఏసీఎస్‌ నుంచి ఆప్కాబ్‌ వరకు పూర్తిగా అధునినీరించి, అన్నీ కంప్యూటరీకరణ చేయనున్నట్లు సీఎం జగన్‌ చెప్పారు.  నాడు-నేడు పథకాన్ని మార్కెట్‌ యార్డుల్లోనూ అమలు చేసి, ఏఎంసీలను ఆధునీకరించే దిశగా అడుగులేస్తున్నామని అన్నారు.