ఆన్‌లైన్‌లో పంట నమోదు తప్పనిసరి: జేడీఏ

ABN , First Publish Date - 2020-07-14T10:59:29+05:30 IST

రైతులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో పంటను నమోదు చేయించుకోవాలని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు.

ఆన్‌లైన్‌లో పంట నమోదు తప్పనిసరి: జేడీఏ

జూపాడుబంగ్లా, జూలై 13: రైతులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో పంటను నమోదు చేయించుకోవాలని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ఈ- బుకింగ్‌ ప్రారంభోత్సవంలో భాగంగా తంగడంచ పొలిమేరలో సోమవారం జేడీఏ పాల్గొని ప్రారంభించారు. ఆమె రైతులతో మాట్లాడుతూ పంటను నమోదు చేసుకుంటేనే ప్రభుత్వం పంట కొనుగోలు చేస్తుందని, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు బీమా వర్తిస్తుందని తెలిపారు. ఏడీఏ వీరారెడ్డి, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.


కొత్తపల్లి: మండల రైతాంగానికి ఆన్‌లైన్‌లో పంట నమోదుపై అవగాహన కల్పించాలని తహసీల్దార్‌ శ్రీనివాసులు, వ్యవసాయాధికారి వెంకటేశ్వరరెడ్డి సూచించారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో పంట నమోదుపై ఆయా గ్రామాల వ్యవసాయ, రెవెన్యూ సిబ్బందికి గ్రామ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చారు. ఏవో మాట్లాడుతూ పంట నమోదు చేయించుకోవడానికి వచ్చే రైతుల వేలిముద్రలు వేయించుకుని పంట నిర్ధారణ చేయాలన్నారు. ఒకసారి పంట నిర్ధారించిన తర్వాత పంట మార్పుకు అవకాశం ఉండకూడదని సిబ్బందికి సూచించారు. 


వెల్దుర్తి: మండలంలోని రైతులందరూ ఈ క్రాప్‌ బుకింగ్‌ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయశాఖ అధికారి రవిప్రకాష్‌ అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రెవిన్యూశాఖ, వ్యవసాయశాఖ సంయుక్తంగా పంట నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దార్‌, వ్యవసాయశాఖ అధికారితో పాటు గ్రామస్థాయిలో వీఆర్వో, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు పంటను నమోదు చేస్తారన్నారు. 


కోవెలకుంట్ల: రైతులు ఆన్‌లైన్‌లో పంటను నమోదు చేయించుకోవాలని తహసీల్దార్‌ జనార్దన్‌శెట్టి సూచించారు. సోమవారం పట్టణంలోని వీఆర్వో, వీఏఏలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి నిరంజన్‌, డిప్యూటీ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. 


ఆలూరు రూరల్‌: ఖరీప్‌, రబీలో వేసిన పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తహసీల్దార్‌ హుసేన్‌సాబ్‌, ఏవో బాలవర్ధిరాజు అన్నారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో వీఆర్వో, ఎంపీఈవోలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో రైతులు పండించిన పంటలను బట్టి ఇన్సురెన్స్‌, పంట నష్టపరిహారం తదితర స్కీమ్‌లు వర్తించాలంటే తప్పనిసరిగా పంట నమోదు చేయాలని తెలిపారు.

Updated Date - 2020-07-14T10:59:29+05:30 IST