పొలాలపై ‘డ్రోన్‌’ పక్షి

ABN , First Publish Date - 2020-10-25T21:45:13+05:30 IST

ఏ పంటకైనా పురుగు మందులు పిచికారీ చేయాలంటే పవర్‌స్ర్పేయర్లను వినియోగిస్తారనే విషయం తెలిసిందే. అంటే ఒక వ్యక్తి రసాయనాలున్న డబ్బాను భుజాలకు బ్యాగులాగా తగిలించుకుని, పవర్‌ స్ర్పేయర్‌తో....

పొలాలపై ‘డ్రోన్‌’ పక్షి

ఏ పంటకైనా పురుగు మందులు పిచికారీ చేయాలంటే పవర్‌స్ర్పేయర్లను వినియోగిస్తారనే విషయం తెలిసిందే. అంటే ఒక వ్యక్తి రసాయనాలున్న డబ్బాను భుజాలకు బ్యాగులాగా తగిలించుకుని, పవర్‌ స్ర్పేయర్‌తో పిచికారీ చేస్తాడు. కానీ ఇప్పటికే ఉన్న కూలీల కొరతకు తోడు.. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో పనులకు వచ్చేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు ‘డ్రోన్‌’ వ్యవసాయ క్షేత్రంలోకి దిగింది. ఇది రైతన్నకు సహాయకారిగా మారి, చిటికెలో పనులు చక్కబెడుతోంది.


వ్యవసాయ కూలీలు రోజంతా చేసే పనులను ఆధునిక యంత్రాల ద్వారా నిమిషాల వ్యవధిలో పూర్తి చేస్తున్నారు. గ్రామాల్లో వ్యవసాయ కూలీల సమస్య కూడా రోజురోజుకు ఎక్కువవుతోంది. దాంతో పొలానికి అవసరమైన పురుగుల మందు పిచికారీ చేయడం తలకు మించిన భారంగా మారుతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే పొలంపై ఎగురుతూ ఒక డ్రోన్‌ నిమిషాల వ్యవధిలో పురుగుల మందును చల్లడం చూశాడు మచ్చా వెంకటేశ్వరరావు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని సిరిపురం (కనకగిరి) గ్రామానికి చెందిన ఈ రైతు వెంకటగిరిలో ఉన్న ఒక రైతు డ్రోన్‌తో పురుగుల మందు పిచికారీ చేస్తున్నారని తెలిసి వెళ్లి చూశాడు. పచ్చని పొలాలపై పక్షిలా ఎగురుతున్న డ్రోన్‌ ఆయనకు తెగ నచ్చింది. దాని పనితనం చూసి ముచ్చటపడ్డాడు. 




ఏడు లక్షల రూపాయలతో...

ఇంటికి తిరిగొచ్చిన తర్వాత వెంకటేశ్వరరావు ఆలోచనలన్నీ డ్రోన్‌ చుట్టే తిరిగాయి. ‘డ్రోన్‌తో పురుగుమందు పిచికారీ చేయటం వల్ల ఖర్చు తగ్గుతుంది. కూలీల కొరతను కూడా అధిగమించవచ్చు’ అనుకున్నాడు. దాని గురించి ఆరా తీశాడు. ఏడు లక్షల రూపాయలు వెచ్చించి డ్రోన్‌ కొన్నాడు. ఇందులో డ్రోన్‌కు మూడున్నర లక్షల రూపాయలు... దానిని ఆపరేట్‌ చేయడానికి అవసరమయ్యే ఆరు బ్యాటరీలు, రెండు చార్జర్లకు మరో మూడున్నర లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. ‘‘ప్రస్తుతం నేను వరిపైరుకు డ్రోన్‌ సాయంతో మందులను పిచికారీ చేస్తున్నాను. ఇతర రైతుల పొలాలకు కూడా ఇదే పని చేస్తున్నాను. డ్రోన్‌ వినియోగానికి సంబంధించి పంటల్లో తెగుళ్లకు ఉపయోగించే కెమికల్‌ యూసీపై రైతుల్లో అవగాహన కల్పించాలి. ప్రస్తుతం డ్రోన్‌తో 35 నుంచి 40శాతం కెమికల్‌ ఆదా అవుతోంది’’ అన్నారు వెంకటేశ్వరరావు. 


15 నిమిషాలకో ఎకరం...

ఇప్పడిప్పుడే ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల రైతులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. తల్లాడ, వైరా, చింతకాని తదితర ప్రాంతాల్లో డ్రోన్‌ సాయంతో పురుగుల మందులను పిచికారీ చేస్తున్నారు. డ్రోన్‌తో కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఒక ఎకరం పంటకు పురుగు మందును కొట్టొచ్చు. సాధారణంగా పవర్‌స్ర్పేయర్ల ద్వారా పురుగు మందు పిచికారీ చేస్తే ఖర్చు పెరుగుతుంది. పైగా స్ర్పేయర్ల ద్వారా ఐదెకరాలు పిచికారీ చేసే మందును డ్రోన్‌తో పదెకరాల వరకు పిచికారీ చేసే అవకాశముందని చెబుతున్నారు. ఆ విధంగా రైతులకు సమయంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుంది. డ్రోన్‌ను ఆపరేట్‌ చేసేందుకు ముగ్గురు సిబ్బంది అవసరమవుతారు. ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఒకరు, సహాయకులుగా మరో ఇద్దరు అవసరమవుతారు. ఒక్కో ఎకరానికి ఒక బ్యాటరీ ఛార్జి ఉండాలి. అయితే ఈ సాంకేతిక విధానంపై ఇంకా స్పష్టత రావాల్సింది ఉంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఆ ఫలితాల మాటెలా ఉన్నా ప్రస్తుతం సిరిపురం చుట్టు పక్కల గ్రామాల్లో మాత్రం తమ పొలాల్లో డ్రోన్‌ సాయంతో పిచికారీ చేసేందుకే రైతన్నలు ఆసక్తి చూపుతున్నారు. 


డ్రోన్ల పని విధానంపై ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఫలితాలు వచ్చిన తర్వాత వ్యవసాయంలో ఇలాంటి పద్ధతులను అనుసరించటం ద్వారా ఎంత మేర ఉపయోగం అనేది స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే ప్రభుత్వాలు కూడా నూతన సాంకేతిక విధానాలను ప్రోత్సహించటానికి అవకాశం కలుగుతుంది.  

- డాక్టర్‌ జె.హేమంతకుమార్‌, వైరా కేవీకే  కో ఆర్డినేటర్‌




- మేడా సూర్యప్రసాద్‌, వైరా, ఖమ్మం జిల్లా 



Updated Date - 2020-10-25T21:45:13+05:30 IST