నిండా మునిగారు

ABN , First Publish Date - 2020-10-22T09:40:48+05:30 IST

పక్షం రోజుల్లో పంటలన్నీ రైతుల చేతికి వచ్చేవి. కానీ వర్షాల కారణంగా పొలాలు మడుగులుగా మారాయి

నిండా మునిగారు

ఇంత కష్టంలో నిలబెట్టే నాథుడు కరువు

కర్నూలులోనే 2లక్షల హెక్టార్లు వర్షార్పణం

అధిక వర్షాలతో సీమ సేద్యం కుదేలు

చేతికొచ్చే దశలోని పంటలు వరదపాలు

3.5లక్షల హెక్టార్లలో కుళ్లి, పాడైన పంట


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

పక్షం రోజుల్లో పంటలన్నీ రైతుల చేతికి వచ్చేవి. కానీ వర్షాల కారణంగా పొలాలు మడుగులుగా మారాయి. జూన్‌ నుంచి మొదలయ్యే ఖరీఫ్‌ సీజన్‌లో కర్నూలు జిల్లాలో సాధారణంగా 455.1 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. కానీ, రెట్టింపు వర్షం, అంటే దాదాపు 844.5 మిల్లీమీటర్లమేర పడటంతో పంటలన్నీ దాదాపు నీటిలోనే తేలియాడుతున్నాయి. ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 6,22,921 హెక్టార్లు కాగా, అంతకు మించి 6,32,175 హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పత్తి పంట కర్నూలు జిల్లాలో సాగైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్‌లోనే వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు ఆనందించారు. ముందుగానే విత్తనం వేశారు. కానీ జూన్‌ నెల నుంచి ఇప్పటి దాకా వద్దన్నా వానలు కురుస్తూనే ఉన్నాయి. 2,68,535 హెక్టార్లలో వేసిన పత్తి పైరులో రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో మొక్కలు కుళ్లిపోతున్నాయి. ఎకరానికి 12 క్వింటాళ్లకు పైగానే పత్తి దిగుబడి రావాల్సి ఉండగా, 5 క్వింటాళ్లకు మించి ఆశలు పెట్టుకోలేమని రైతులు చెబుతున్నారు. జూన్‌లోనే వర్షాలు మొదలు కావడంతో.. 80,107 హెక్టార్లలో వేసిన వేరుశనగ.. తొందరగా చేతికందుతుందని, ఎకరానికి పది క్వింటాళ్లకు పైగానే దిగుబడి వస్తుందని రైతులు అంచనా వేసుకున్నారు. ఇప్పుడు చూస్తే, 2, 3 క్వింటాళ్లు మాత్రమే చేతికందే పరిస్థితి ఉంది. అంతా సవ్యంగా ఉంటే 15,570 హెక్టార్లలో వేసిన ఉల్లి ఈసారి రైతులకు లక్షల్లో ఆదాయం చేకూర్చేది. 


ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఉల్లి పంట దెబ్బతిన్న దరిమిలా కర్నూలు జిల్లా ఉల్లికి ఈసారి డిమాండ్‌ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఇక్కడ కూడా భారీ వర్షాలు కురవడంతో 70 శాతం పంట నీటిపాలైంది. ఎకరానికి 80 క్వింటాళ్లకు పైగానే దిగుబడి ఆశించగా, అది కేవలం 20 క్వింటాళ్లకు పరిమితమైంది. కర్నూలు జిల్లాలో దాదాపు రెండులక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. రిపోర్టులో మాత్రం కేవలం లక్ష హెక్టార్లలో మాత్రమే పంటలు దెబ్బతిన్నాయని చెప్పడం గమనార్హం. ఇలాగే, మూడు దఫాలుగా జూలై, సెప్టెంబరు, అక్టోబరులో కురిసిన వర్షాలతో పంటలకు కలిగిన నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలను అందజేశారు. కానీ ఇప్పటిదాకా ఒక్క రూపాయి సాయం కూడా అందలేదు. దీంతో ప్రభుత్వం నుంచి అందే నష్టపరిహారంపై రైతులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పంట పొలాల్లోని నీటిని బయటకు తోడేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. 


గుంటూరు జిల్లా

ప్రభావం: 38 లంకలు - మునక: 42 ఎకరాలు

గుంటూరు జిల్లా పరిధిలోని 38 లంక గ్రామాల్లో పసుపు, కంద సాగుకోసం ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.40 లక్షల వరకు ఖర్చుపెట్టారు. కౌలు రైతులు అయితే ఈ ఖర్చు కాకుండా అదనంగా మరో రూ.40-55 వేల వరకు కౌలు కింద చెల్లించారు. మరో నెలలో పంట చేతికి అంది వస్తుందనగా వరద ముంచెత్తింది. దాదాపుగా అంతా ఊడ్చుకుపోయిందని రైతులు వాపోతున్నారు. గత సంవత్సరం వచ్చిన వరదకు దెబ్బతిన్న పసుపు, కంద, అరటి, తమలపాకు తోటలకు ఇంత వరకు పరిహారం అందలేదు. ఇంతలోనే మరోసారి భారీ వరద ప్రవాహాలు లంకలను, రైతులు పెట్టుకొన్న పంటలను ముంచెత్తాయి. మొత్తం మీద 42 వేల ఎకరాలకు పైగా పసుపు, కంద, అరటి, తమలపాకు, కూరగాయ, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నష్టం అంచనాలు వేసి రెండో పంటకు మార్గం చూపాల్సిన అధికారులు వరద ముంచిన తొమ్మిదో రోజు కూడా పొలాల్లో అడుగుపెట్టలేదు. పైగా 10 వేల ఎకరాల్లోనే పంటలు నష్టపోయినట్లు కాకి లెక్కలు వేశారు. ఒక్క గ్రామం కూడా తిరగకుండానే నష్టాన్ని అధికారులు ఎలా లెక్కలు కడతారని లంక గ్రామాల రైతులు ఆగ్రహిస్తున్నారు. ఇది చాలదన్నట్టు, ఈ-క్రాప్‌ కింద పంట నమోదు కాలేదంటూ మరికొందరు బాధిత రైతులను సాయానికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ఇక కృష్ణాజిల్లాలో 32 మండలాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఈ మండలాల పరిధిలో 10,123 మంది  రైతులకు చెందిన 6594.10 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయి. 


కడప జిల్లా

వేసిన పంటలు: 1.02 లక్షల హెక్టార్లు - మునక 26 వేల హెక్టార్లు

దెబ్బ మీద దెబ్బ కడప జిల్లాను కుంగదీసింది. పంట దిగుబడులు వచ్చే కీలక సమయంలో పడుతున్న వరుస భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. సెప్టెంబరు నెలలో భారీ వర్షాలకు కుందూ, పాపాఘ్ని, పెన్నా నదులు ఉప్పొంగాయి. వేల హెక్టార్ల పంటలు ఇంటికి చేరేలోపే ముంచేశాయి. ఆ కష్టం నుంచి తెప్పరిల్లకముందే వారం, పదిరోజులుగా విడవకుండా వానలు పడుతున్నాయి. మిగిలిన పంటలనూ దెబ్బతీస్తున్నాయి. హెక్టారుకు రూ.75 వేలకుపైగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికి 1.02 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయగా, 12,901.53 హెక్టార్లలో వేసిన పత్తి, వరి తదితర పంటలు నీట మునిగాయి. ఈ పంటలకు రూ.17.20 కోట్లు నష్టం జరిగిందని, మరో 2,800 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిని రూ.36 కోట్లకుపైగా రైతులు నష్టపోయారని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.


విశాఖ జిల్లా

ప్రభావం:  31 మండలాలు- మునక : 15,810 ఎకరాలు 

వేల ఎకరాల్లో పంట ఇంకా నీటిలోనే ఉంది. కొన్ని పొలాల్లో నీరు బయటకు వెళ్లినా 40 నుంచి 50 శాతం పంటకు నష్టం వాటిల్లింది. భారీవర్షాలకు విశాఖ జిల్లాలో నిండుకుండల్లా మారిన రిజర్వాయర్ల నుంచి మిగులునీరు విడుదల చేయడంతో శారదా, దాని ఉపనదులు, ఇంకా గెడ్డలు, వాగులు పొంగడంతో 31 మండలాల్లోని 15,810 ఎకరాల్లో పంట నీట మునిగింది. అయితే ఇప్పటివరకూ 12 మండలాల్లో 1500 హెక్టార్ల పంటకు నష్టం వాటిల్లినట్టు అధికారులు తేల్చారు. మిగిలిన మండలాల్లో పంట నష్టం అంచనాను అవకాశం కలగడం లేదంటున్నారు. శారదా నదిలో వరద తగ్గకపోవడంతో పొలంలో నీరు బయటకు వెళ్లడానికి అవకాశం లేకపోయింది. నీరు తగ్గిన ప్రాంతాల్లో పంట కుళ్లిపోయింది. వరి సాగుకు రైతు స్థోమత బట్టి పది వేల నుంచి పాతిక వేల రూపాయల వరకు మదుపు పెట్టారు. పెట్టిన పెట్టుబడి పైసా కూడా వెనక్కి రాదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 


పశ్చిమగోదావరి జిల్లా

ముంచిన 2 వాగులు -  మునక: 80 వేల ఎకరాలు

పశ్చిమ గోదావరి జిల్లాను ఎర్రకాలువ, ఉప్పుటేరు కన్నీరు పెట్టించాయి. జంగారెడ్డిగూడెం సమీపాన ఉండే ఎర్రకాలువ రిజర్వాయర్‌లో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిపడే కొండవాగుల నీటిలో కొంత భాగం కలుస్తుంది. దీనివల్ల భారీ వర్షాలు, వరదలప్పుడు ఈ రిజర్వాయర్‌ పరిధిలోని 16 మండలాలు ముంపునకు గురవుతాయి. అయితే ఈసారి కొండవాగుల ప్రవాహం ప్రమాద స్ధాయిలో ఉండటంతో పలు మండలాలు అతలాకుతలమయ్యాయి. తాడేపల్లిగూడెం రూరల్‌ మండల ప్రాంతాల్లో దాదాపు ఆరు వేల ఎకరాలను నీట ముంచింది. ఇక ఈ జిల్లా అంతా కలిపి దాదాపు 80 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. పోలవరం ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరితో పాటు మిర్చి పంట సర్వనాశనమైంది. కొల్లేరులో ముంపును నేరుగా సముద్రంలోకి చేర్చే ఉప్పుటేరు.. అధిక వర్షాల కారణంగా పోటెత్తింది. గట్లు మీదుగా ప్రవహించి పల్లపు ప్రాంతాలను ముంచెత్తింది. ఉప్పుటేరు పరీవాహక ప్రాంతమంతా చేపలు, రొయ్యల చెరువులతో నిండి ఉంటుంది. ఒక్కసారిగా వరద నీరు ముంచెత్తడంతో ఆకివీడు మండలం సిద్ధాపురం ప్రాంతంలో వందల ఎకరాల చేపల చెరువులకు నష్టం వాటిల్లింది. 


కౌలుకార్డు లేదని..

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన కడారి సత్యనారాయణ తన కుమారుడితో కలిసి ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. వరుస వరదలకు పంట పూర్తిగా దెబ్బతింది. రెండుసార్లు వరదతో పూర్తిగా నష్టపోయినా ఇప్పటివరకూ పంట నష్టం నమోదు చేయలేదు. దీనిపై ప్రశ్నిస్తే, కౌలు రైతు కార్డు కావాలంటున్నారట!. ఈ కార్డు ఇవ్వాలంటే రైతు సంతకం తీసుకొని రావాలంటున్నారని సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ సాయం అందుతుందన్న నమ్మకం తమకు లేదని ఆయన వాపోతున్నారు.


వరదకే వదిలేశాను..

ఏడు రాత్రులు, ఏడు పగళ్లు వరద నీరు పొలాల్లోనే నిల్వ ఉండటంతో పంటలు కుళ్లిపోతున్నాయి. ఎకరా పసుపునకు రూ.లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టాను. తమలపాకుకూ ఎక్కువే ఖర్చుచేశాను. ప్రభుత్వమే ఆదుకోవాలి. కానీ, గతంలో వరదలకు పోయిన పంటలకే ఇంకా పరిహారం ఇవ్వలేదు.

సుంకర నాగేశ్వరరావు, గుంటూరు


అక్కడజాబ్‌.. ఇక్కడ సర్వం కోల్పోయా 

‘‘ఇంజనీరింగ్‌ చదువుకున్నా. కరోనాతో చేస్తున్న పార్ట్‌టైమ్‌ ఉద్యోగం పోవడంతో సొంత గ్రామానికి వచ్చి 3 ఎకరాల్లో పత్తిపంట, 2 ఎకరాల్లో వరిని సాగు చేశా. సెప్టెంబరు, అక్టోబరులో వచ్చిన  వర్షాలు, వరదలతో పంటపోయింది. పెట్టిన పెట్టుబడి రూ.1.30 లక్షలు కోల్పోయాను. ఇప్పటివరకు నా వద్దకు ఎవరూ రాలేదు. ఎకరానికి రూ.6వేలు ఇస్తామని చెబుతున్నారు. అది ఎప్పటికి వస్తుందో తెలియదు’’

గారపాటి స్వామి, తాటిపర్తి, తూర్పుగోదావరి జిల్లా 

Updated Date - 2020-10-22T09:40:48+05:30 IST