ఒక్క రోజులో 3లక్షల ఎకరాల్లో పంట నష్టం

ABN , First Publish Date - 2020-10-14T08:18:48+05:30 IST

రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఒక్క రోజులో 3లక్షల ఎకరాల్లో పంట నష్టం

వర్షాలకు రాష్ట్రంలో భారీగా దెబ్బతిన్న పంటలు

ఆది, సోమవారాల్లో 2 లక్షల ఎకరాల్లో.. కుండపోత వర్షాలకు కుదేలైన రైతాంగం

ఇప్పటికే 30-40 ు దెబ్బతిన్న పత్తి.. వానలను తట్టుకోలేకపోతున్న వరి సన్నాలు

కూరగాయల పంటలకూ భారీ దెబ్బ.. పంటల నష్టాన్ని పట్టించుకోని ప్రభుత్వం


హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరి, పత్తి, కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలకు రోజుకు లక్ష ఎకరాల చొప్పున 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం కలిగింది. మంగళవారం ఏకంగా 3 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తోంది. వరద ఉధృతికి పంటచేలల్లో భూమి కోతకు గురవుతోంది. మొక్కలు కొట్టుకుపోతున్నాయి.



చేతికొచ్చే దశలో పంటలు దెబ్బ తింటుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా పత్తి పంట రాష్ట్రంలో 60.22 లక్షల ఎకరాల్లో సాగుచేయగా.. 30-40 శాతం విస్తీర్ణంలో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పత్తి కాయలు కొంత మేరకు తెరుచుకొని, వాననీళ్లతో మురిగిపోతున్నాయి. ఇది దిగుబడిపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అదేక్రమంలో వరికి కూడా తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. ఈసారి రైతులు దొడ్డు రకాల కంటే సన్న రకాలే ఎక్కువగా సాగు చేశారు. మొత్తం వరి పంట 52.56 లక్షల ఎకరాల్లో సాగవగా.. ఇందులో 39.58 లక్షల ఎకరాల్లో సన్నాలు వేశారు. ఇంత భారీ వర్షాలకు సన్నాలు తట్టుకోవని, పంట నిలవడం కష్టమని రైతులు ఆందోళన వాపోతున్నారు.  



ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం బోధన్‌, చందూరు, వర్ని, ఆర్మూర్‌ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో చేతికొచ్చిన ధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులు వరి కోయకుండా వదిలేయడంతో నేలకొరిగింది. కామారెడ్డి జిల్లాలో చేతికొచ్చిన ధాన్యం నీటి పాలైంది. ఎల్లారెడ్డి, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలాల్లో వరి కోతలు కోయడంతో కల్లాల్లోనే ఽధాన్యం తడిసిపోయింది. ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి, సోయా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. నిర్మల్‌ జిల్లాలో దాదాపు 90 వేల ఎకరాల్లో సోయా పంట సాగవుతుండగా.. ప్రస్తుతం పంట కోతదశలో ఉంది. అయితే కోత యంత్రాలు చేలల్లోకిదిగే పరిస్థితి లేకపోవడంతో రైతులు సోయా ఉత్పత్తులపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 


రాజన్న సిరిసిల్ల జిల్లాలో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. పత్తి ఏరడానికి, ఆరబెట్టడానికి వీలు లేకుండా పోయింది. 


కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పత్తి పంట చేతికొచ్చే దశలో చేలలోనే తడిసిపోతోంది. 


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 


మహబూబాబాద్‌ జిల్లాలో వరి పొలాలు నేలవాలాయి. పత్తి చేలు ఎర్రబడి కాయలు నల్లబారాయి. మిర్చి తోటల్లో సైతం నీరు నిలిచింది. 


ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. ఒక్క కల్లూరు మండలంలోనే 20వేల ఎకరాల్లో వరిపంట దెబ్బతినగా సత్తుపల్లి, వేంసూరు, తల్లాడ, మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌ మండలాల్లో వరి, పత్తి, మిర్చి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. 


నల్లగొండ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పత్తి చేలలో గూడ రాలిపోవడంతోపాటు ఏరడానికి సిద్ధంగా ఉన్న పత్తి తడిసి ముద్దయ్యింది. నల్లరేగడి నేలలు జాలుపట్టి దిగుబడి సగానికి సగం తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. వరి చేలు నేలమట్టమయ్యాయి. ఇప్పటికే ఐకేపీ కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసింది. 


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కూరగాయ పంటలకు ఎక్కువ నష్టం కలిగింది. 


 ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కోత దశలో ఉన్న వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


పంట నష్టంపై ప్రభుత్వం మౌనం

రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం విషయంలో మౌనంగా వ్యవహరిస్తోంది. ఈ వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు వ్యవసాయంపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌.. ఒక్కసారి కూడా పంట నష్టాలను ప్రస్తావించకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో ఏఈవోలు ప్రాథమిక నివేదికలు తయారుచేసి అధికారులకు ఇస్తున్నారు. అతివృష్టి కారణంగా నష్టపోయే పంటలకు బీమా పథకాలు అందుబాటులో లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకాలను రైతులకు దూరం చేయడంతో కనీసం నష్టపరిహారం కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం చెప్పినట్లు నియంత్రిత సాగుచేశామని, ప్రకృతి విపపత్తులతో పంట నష్టపోతే ఆదుకోరా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. 


వాగు మధ్యలో కారు.. ఐదుగురు



జనగామ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): నగామ జిల్లా వడ్లకొండలో మంగళవారం రాత్రి భారీవర్షానికి పీతలవాగు ఉప్పొంగి.. రోడ్డుపై వెళ్తున్న ఓ కారు, అందులోని ఐదుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు. అయితే వాగులో కొంతదూరం కొట్టుకుపోయాక.. కారు ఓ తాటిచెట్టుకు చిక్కుకొని ఆగిపోయింది. దీంతో వారు కారు నుంచి బయటకు వచ్చి ఆర్తనాదాలు చేశారు. వారి అరుపులు విన్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాగులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 


నేడు, రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా 

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల కారణంగా యూజీ, పీజీ వార్షిక, సప్లిమెంటరీ పరీక్షలను జేఎన్‌టీయూహెచ్‌  వాయిదా వేసింది. బుధ, గురువారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ మన్జూర్‌ హుస్సేన్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల తేదీలను తరువాత ప్రకటిస్తామని, 16 నుంచి జరిగే పరీక్షలు యధావిధిగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు జేఎన్‌టీయూ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీచేశారు. అలాగే ఉస్మానియా యూుునివర్సిటీ కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. బుధ, గురవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే బుధవారం జరిగే అన్ని పరీక్షలను కోటి మహిళల కాలేజీ యూనివర్సిటీ కూడా వర్షాల కారణంగా వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ప్రిన్సిపాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


Updated Date - 2020-10-14T08:18:48+05:30 IST