‘కోట్లా’ట

ABN , First Publish Date - 2021-01-16T06:44:23+05:30 IST

పోలీసులు, ప్రజా ప్రతినిధుల సాక్షిగా సంక్రాంతి పర్వదినాల ముసుగులో మూడు రోజుల పాటు అసాంఘిక శక్తులు పేట్రేగిపోయాయి. కోట్ల రూపాయలు పణంగా పెట్టి కోడిపందేలు, గుండాట, పేకాట వంటి జూద క్రీడా వినోదంలో వేలాది మంది మునిగితేలిపోయారు.

‘కోట్లా’ట
ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలెంలో కోడి పందేలు నిర్వహిస్తున్న దృశ్యం

  • జిల్లాలో ముగిసిన  జూదాల జాతర
  • కోడి పందేలు, ఇతరత్రా ఆటల్లో చేతులు మారింది రూ.75 కోట్లు పైనే
  • పేట్రేగిన పందెపురాయుళ్లు
  • పలుచోట్ల ఘర్షణలు
  • హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
  • ప్రేక్షక పాత్రలోనే పోలీసులు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

పోలీసులు, ప్రజా ప్రతినిధుల సాక్షిగా సంక్రాంతి పర్వదినాల ముసుగులో మూడు రోజుల పాటు అసాంఘిక శక్తులు పేట్రేగిపోయాయి. కోట్ల రూపాయలు పణంగా పెట్టి కోడిపందేలు, గుండాట, పేకాట వంటి జూద క్రీడా వినోదంలో వేలాది మంది మునిగితేలిపోయారు. హైకోర్టు ఆదేశాలు, 144 సెక్షన నిబంధనలను సైతం ఉల్లంఘించారు. కోనసీమతో పాటు జిల్లావ్యాప్తంగా జూదాలు, పందేల్లో సుమారు రూ.75 కోట్ల మేర సొమ్ములు చేతులు మారినట్టు సమాచారం. మామూళ్ల మత్తులో ఉన్న కొందరు పోలీసు అధికారులు జాతీయ రహదారుల చెంతనే పందేలు, రికార్డింగ్‌ డ్యాన్సులు నిర్వహించినా ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. బరుల స్థాయిని బట్టి స్టేషన్లకు రూ.50వేల నుంచి రూ.5లక్షలు వరకు మామూళ్లు ఇచ్చినట్టు నిర్వాహకులే బహిరంగంగా చెప్తున్నారు. ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులతో పాటు వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు రాజఠీవితో పందేలను తిలకించి  ఆనందపరవశులయ్యారు. 


సంక్రాంతి మూడు రోజుల పాటు జిల్లాలో జరిగిన కోడిపందేలు, గుండాట, పేకాట పోటీల్లో రూ.75 కోట్లకు పైనే చేతులు మారినట్టు సమాచారం. ప్రధానంగా కేశనకుర్రుపాలెం, రాజుపాలెం, చెయ్యేరు, గెద్దనపల్లి, గోడి, గోడిలంక, వన్నె చింతలపూడి, రావుపాలెం సీఐ కార్యాలయానికి కూతవేటు దూరంలో, వెదిరేశ్వరం, రావులపాడు, శివకోడు, మామిడికుదురు, అల్లవరం, ఠాణేలంక, కొత్తలంక, లొల్ల, పేరవరం, తాడిపూడి, ర్యాలి, నాగుల్లంక, మానేపల్లి, వాడ్రేవుపల్లి, జాతీయ రహదారిని ఆనుకుని శివకోడు, వీవీ మెరక సబ్‌స్టేషన్‌, ఇందుపల్లి, బండారులంక, గున్నేపల్లి అగ్రహారం, సమనస, కొంకాపల్లి, నడవపల్లి, గోగన్నమఠం, పాశర్లపూడి, అంతర్వేదిపాలెం, సఖినేటిపల్లిలంక సహా వందకు పైగా కీలక ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. కీలక బరుల వద్ద కోడిపందేలు, గుండాట, పేకాట ద్వారా కోట్లాది రూపాయల మేర లావాదేవీలు జరిగినట్టు అంచనా. నిర్వాహకులు కూడా భారీగా సొమ్ములు చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వందల కార్లు, వేలల్లో మోటారుసైకిళ్లతో ఆ ప్రాంతమంతా ప్రభల తీర్థాన్ని తలదన్నే రీతిలో సాగింది. మద్యం ఏరులై పారింది. అయితే ఈసారి పందేలు ఆశించిన మేర నిర్వాహకులకు ఆదాయాన్ని సమకూర్చలేకపోయాయి. ఎక్కడికక్కడే ఇష్టానుసారంగా బరులు ఏర్పాటుచేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పోలీసు యంత్రాంగం పూర్తిగా మామూళ్లపై ఆధారపడి విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడంతో కోడిపందేల నిర్వహణ అడ్డుఅదుపు లేకుండా సాగింది. రావులపాలెం, ఊబలంక, ర్యాలి, ఆత్రేయపురం మండలంలోని పలు గ్రామాల్లో కీలక రహస్య ప్రాంతాల్లో అతిరథ మహారథుల ఆధ్వర్యంలో అంతర్రాష్ట్రాల నేతలు పేకాట పోటీల్లో పాల్గొని లక్షలు వెచ్చించారు. కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రావులపాలెంలో ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్‌, కేశనకుర్రుపాలెంలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, పలుచోట్ల వైసీపీ, టీడీపీలకి చెందిన నేతలు పందేలను తిలకించినవారిలో ఉన్నారు. 


తింటే పందెం కోడి మాంసం తినాలనే సామెతను దృష్టిలో ఉంచుకుని కోస మాంసాన్ని వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. కోస ఒక్కొక్కటి రూ.2వేల నుంచి రూ.5 వేలు లోపు ధర పలికింది. కీలక ప్రజా ప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నాయకులు, వివిధ శాఖల అధికారులకు ఆయా ప్రాంతాల్లోని కోడిపందేల్లో పాల్గొన్న పుంజులను కానుకగా పంపించి వారిని పరవశింపజేశారు. పోలీసులు సైతం అటు కోసలు, ఇటు కాసుల వేటలో నిమగ్నమయ్యారు. 


కోనసీమవ్యాప్తంగా పలుచోట్ల పందెం బరుల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అల్లవరం మండలం గోడి బరి వద్ద ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అంబాజీపేట మండలం మాచవరంలో రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. పలువురు గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసుల జోక్యం అనివార్యమైంది. అమలాపురం రూరల్‌ మండలం ఇందుపల్లితో పాటు పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. కొత్తపేటలో ప్రభల తీర్థం సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని ఆహ్వానించే విషయంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తత్తకు కారణమైంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాల వారిని అక్కడి నుంచి పంపించివేశారు. 

Updated Date - 2021-01-16T06:44:23+05:30 IST