Bank of Baroda : కోట్లాది కుంభకోణం గుట్టు విప్పడమా.. గట్టెక్కించడమా.. అసహనంతో పోలీసులు!

ABN , First Publish Date - 2021-08-31T12:42:23+05:30 IST

కోట్లాది రూపాయల కుంభకోణంలో కూరుకుపోయిన...

Bank of Baroda : కోట్లాది కుంభకోణం గుట్టు విప్పడమా.. గట్టెక్కించడమా.. అసహనంతో పోలీసులు!

  • బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో కుంభకోణంపై రహస్య విచారణ
  • ఆరుగురు బ్యాంకు ఉద్యోగులను రక్షించే దిశగా ప్రయత్నాలు?
  • ఐదు రోజులైనా ఫిర్యాదు చేయకపోవడంతో అసహనంతో పోలీసులు

చిత్తూరు జిల్లా/కలికిరి : కోట్లాది రూపాయల కుంభకోణంలో కూరుకుపోయిన కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన ఉన్నతాధికారుల్లో ఎట్టకేలకు చలనమొచ్చింది. గుట్టు రట్టు చేయడం కన్నా పరోక్ష పాత్ర పోషించిన బ్యాంకులో పని చేసిన ముగ్గురు మేనేజర్లు, ఐదుగురు ఉద్యోగులను రక్షించ డమెలాగన్న అన్వేషణతో సోమవారం రహస్య విచారణ చేపట్టారని అనుమానిస్తున్నారు. కృష్ణాష్టమి సెలవు రోజైనా ఐదుగురు విచారణాధికారులు సోమవారం బ్యాంకుకు చేరుకుని విచారణ ప్రారంభించారు. కొంతమంది ఉద్యోగులను సైతం రప్పించారు. ఉదయం వారు లోపలికి వెళ్ళి అన్ని ద్వారాలను మూసేసి లోపలే వుండిపోయారు. సెలవు రోజైతే ఖాతా దారుల వత్తిడి వుండదనే యోచనతోనే కృష్ణాష్టమి రోజు విచారణ ప్రారంభించారు.


ఇక ఐదు రోజులవుతున్నా బ్యాంకు నుంచి ఫిర్యాదులు రాకపోవ డంతో పోలీసులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఐదు రోజుల క్రితం రెండు ప్రైవేటు ఫిర్యాదులు అంద గానే సాక్ష్యాలు తారుమారు కాకుండా, వాస్తవాలను రాబట్టేందుకు అదే రోజు పోలీసులు చురుగ్గా వ్యవహరిం చారు. ఫలితంగా ప్రధాన సూత్రధారి మెసెంజరు అబ్దుల్‌ ఆలీఖాన్‌ను అదుపులోకి తీసుకుని మొత్తంగా జరిగిన లోగుట్టు వ్యవహారాలన్నీ ఛేదించారు. ఈ కుంభకోణానికి సంబంధించిన పూర్వాపరాలన్నీ సాక్ష్యాలతో సహా పోలీసుల వద్ద సిద్ధంగా వున్నట్లు సమాచారం. ఈ దశలో బ్యాంకు నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా తాత్సారం చేయడం పోలీసులకు అసహనం కలిగించిందని చెపుతున్నారు. బ్యాంకు అధికారుల ఉదాసీనతపై పోలీసులు మండిపడ్డట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు ఇరుక్కో కుండా ఫిర్యాదు చేయడమెలా అనే కోణంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.


ఉద్యోగులను వెనకేసుకు రావడమే బ్యాంకు పుట్టి ముంచుతోంది..

గతానుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోకుండా కేవలం కుంభకోణాలకు బాధ్యులైన ఉద్యోగులను వెనుకేసుకు రావ డానికి అధికారులు మొగ్గు చూపడమే బ్యాంకు పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోవడానికి ప్రధాన కారణమని స్పష్టంగా తెలుస్తున్నా పదే పదే అదే విధానాన్ని అనుస రించడం స్థానికులను విస్మయపరుస్తోంది. కేవలం ఒక తాత్కాలిక మెసెంజరు తమ పాస్‌వర్డ్‌ ఐడీలతో అకౌంట్లలో జొరబడి ఆరేళ్ళుగా రూ.కోట్లలో తారుమారు చేస్తుంటే ఉద్యోగులకేమీ తెలియదనడం బుకాయించడమేనంటు న్నారు. బ్యాంకులో జరుగుతున్న వ్యవహారాలపై ఇన్నేళ్ళలో కనీసం ఒక్కరయినా ఉన్నతాధికారులకు ఉప్పందించ కుండా చేష్టలుడిగి పనిచేశారంటేనే అంతా కుమ్మక్కయ్యా రని తేటతెల్లమవుతోందంటున్నారు. వందలమంది ఖాతా దారులతో పాటు మహిళా గ్రూపులకు న్యాయం చేకూర్చి బ్యాంకు పరువు నిలుపుకోవలసిన యాజమాన్యం ఉద్యో గులపక్షాన అండగా నిలబడడానికి ప్రయత్నించడాన్ని తప్పుబడుతున్నారు.


డమ్మీ గ్రూపుల సృష్టితో మరో దోపిడి..

ఖాతాల్లో నగదు తారుమారు దృష్టాంతాల సంగతి అలా వుంచితే ఏకంగా ఖాతాదారుల డిపాజిట్లనే ఖాళీ చేయడం బ్యాంకులో జరిగిన అక్రమాలకు పరాకాష్ట. దీన్ని మించిన కొత్త రకం అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. డ్వాక్రా గ్రూపులకు రూ. పది, పన్నెండు లక్షలు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం పరిపాటి. మెసెంజరు ఆలీ ఖాన్‌ కొన్ని గ్రూపులకు మంజూరయిన ఇలాంటి రుణాలను తన ఖాతాలోకి మళ్ళించుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం గమనించిన బ్యాంకు ఉద్యోగులు సైతం ఏకంగా డమ్మీ గ్రూపులు సృష్టించి రుణాలు మంజూరు చేశారని తాజా సమాచారం. ఇలా ఎన్ని డమ్మీ గ్రూపులను సృష్టించారన్నది తేలాలంటే అది బ్యాంకుల్లోనే సాధ్యమ వుతుంది. ఎందుకంటే ఈ డమ్మీ గ్రూపుల సమాచారం వెలుగు అధికారులకు అందే అవకాశం లేదు. 2018 నుంచే డమ్మీ గ్రూపులను సృష్టించి ఒక్కోదాని పేరుతో రూ.పదేసి లక్షలు కాజేసినట్లు సమాచారం. 


ఈ లెక్కన కేవలం పది గ్రూపులను సృష్టించినా రూ.కోటి వరకూ స్వాహాకు అవ కాశముందని అంటున్నారు. 2018లో బ్యాంకు అధికారులు సృష్టించిన డమ్మీ గ్రూపులకు మంజూరు చేసిన రుణాల వసూలు ఊసే ఇంతవరకూ లేదంటున్నారు. మరి కొన్ని గ్రూపుల పేర్లు మార్చి కొత్త పేర్లతో కూడా రుణాలు మంజూరు చేసినట్లు అనుమానిస్తున్నారు. నివ్వెరపరిచే ఇలాంటి ఉదంతాలన్నీ పోలీసుల గుప్పెట్లో వున్నందునే ఫిర్యాదు చేయడానికి బ్యాంకు అధికారులు జాప్యం చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఫిర్యాదు అందడమే ఆలస్యంగా దర్యాప్తును ముమ్మరం చేయడానికి పోలీసులు సంసిద్ధంగా వున్నా, అటు బ్యాంకు వైపు నుంచే అడుగు పడడం లేదని చెబుతున్నారు.    

Updated Date - 2021-08-31T12:42:23+05:30 IST