టీఆర్‌ఎస్‌లో క్రాస్‌ ఓటింగ్‌ గుబులు

ABN , First Publish Date - 2021-12-08T05:14:26+05:30 IST

జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి క్రాస్‌ ఓటింగ్‌ భయం పట్టుకున్నది.

టీఆర్‌ఎస్‌లో క్రాస్‌ ఓటింగ్‌ గుబులు

- రవీందర్‌సింగ్‌కు ‘ఈటల’ అండ

- క్యాంపుల్లోనే అధికారపార్టీ ‘స్థానిక’ నేతలు 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి క్రాస్‌ ఓటింగ్‌ భయం పట్టుకున్నది. ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉంటూ క్రియాశీలక నేతగా ఎదిగి కరీంనగర్‌ మేయర్‌ పదవిని కూడా చేపట్టిన రవీందర్‌సింగ్‌ ఈ ఎన్నికల్లో పోటీచేయడానికి అవకాశం కల్పించకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి రెబల్‌గా బరిలో నిలిచారు. ఆయనకు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ మద్దతు లభించడంతో పోటీ రసవత్తరంగా మారింది. సర్వశక్తులు ఒడ్డినా ఇటీవల జరిగిన హుజురాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ పరాజయం పాలైన నేపథ్యంలో అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. టీఆర్‌ఎస్‌ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును కోల్పోతున్నదని, రవీందర్‌సింగ్‌ ఇక్కడ విజయం సాధించబోతున్నారని ఈటల రాజేందర్‌ పదేపదే ప్రకటిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ క్రాస్‌ ఓటింగ్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 

- ఉమ్మడి జిల్లాలో 994 మంది టీఆర్‌ఎస్‌ స్థానిక ప్రతినిధులు

ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 1,324 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 994 మంది టీఆర్‌ఎస్‌కు చెందిన వారే. ఈ సంఖ్యాబలంతో ఆ పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను సునాయసంగా గెలుచుకునే అవకాశమున్నది. పార్టీలో ఉద్యమకాలం నుంచి ఉన్న నేతగా పేరున్న రవీందర్‌సింగ్‌ పోటీలో నిలవడం, ఈటల రాజేందర్‌ అండదండలు ఆయనకు లభించడం, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నిధులు, విధులు లేక అస్తిత్వం కోల్పోయామన్న అసంతృప్తితో ఉండడంతో క్రాస్‌ ఓటింగ్‌ జరుగవచ్చనే గుబులు గులాబీ పార్టీలో మొదలై క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. టీఆర్‌ఎస్‌కు చెందిన 994 మంది స్థానిక సంస్థల ప్రతినిధులతోపాటు మరికొందరు ఇతర పార్టీలకు చెందిన వారిని కూడా కలుపుకొని బెంగుళూరు, మైసూర్‌ తదితర ప్రాంతాలకు విహారయాత్రకు తీసుకెళ్లింది. గతనెల 27 నుంచి స్థానిక సంస్థల ప్రతినిధులు, వారి కుటుంబసభ్యులు వారంరోజులపాటు బెంగుళూరు, మైసూర్‌లో గడిపి సోమవారం తిరుపతికి చేరుకున్నారు. ఈనెల 9వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో వారిని తిప్పి నేరుగా 10వ తేదీన పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువచ్చి ఓటు వేయించుకునే విధంగా పార్టీ అధిష్ఠానం ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి హుజురాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్‌ రమణకు ఎమ్మెల్సీలుగా పోటీచేసే అవకాశం కల్పించింది. వీరిద్దరికి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో సంబంధం లేక పోవడం, ఒకరు కాంగ్రెస్‌ మరొకరు టీడీపీ నుంచి వచ్చిన వారే కావడం టీఆర్‌ఎస్‌లో అసంతృప్తికి దారితీసింది. 

- మద్దతు కూడగడుతున్న రవీందర్‌సింగ్‌

ఉద్యమకార్యకర్తగా పేరున్న రవీందర్‌సింగ్‌ రెబల్‌గా బరిలో దిగడంతో ఆయనకు టీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారని ప్రచారం జరుగుతున్నది. రవీందర్‌సింగ్‌ ఫోన్‌లో అందుబాటులో ఉన్నవారితో మాట్లాడుతూ, అందుబాటులో లేనివారి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబసభ్యులతో మాట్లాడి మద్దతు కూడగట్టుకుంటున్నారు. కరీంనగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ రుచిచూపాలని భావిస్తున్న ఈటల రాజేందర్‌ ఈ ఎన్నికను మంచి అవకాశంగా భావించి నోటిఫికేషన్‌ రాక ముందే తనకు జిల్లాలోని స్థానిక సంస్థల ప్రతినిధులతో ముందే మాట్లాడి తాను సూచించిన వారికి ఓటు వేసే విధంగా ఒక టీంను ఏర్పాటు చేశారని, వారిప్పుడు రవీందర్‌సింగ్‌కు బలంగా మారారని ప్రచారం జరుగుతున్నది.  కాంగ్రెస్‌, బీజేపీ  అభ్యర్థులెవరు  పోటీలో లేనందువల్ల ఆ పార్టీల మద్దతు కూడా రవీందర్‌సింగ్‌కు కలిసి వస్తుందని భావిస్తున్నారు. అధికార పక్షం ఒక్కో సభ్యుడికి ఇప్పటికే లక్ష రూపాయల నజరానా ముట్టజెప్పి మరో లక్ష ఇస్తామని హామీ ఇచ్చిందని, రవీందర్‌సింగ్‌ ఇప్పటికే పలువురికి 50 వేల రూపాయల చొప్పున ముట్టజెప్పారని ప్రచారం జరుగుతున్నది. 

- ఇండిపెండెంట్లను ఒక్కటి చేసేందుకు యత్నం

ఎనిమిది మంది స్వతంత్రులు రంగంలో ఉండగా అందులో ప్రధానంగా ముగ్గురు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వారిలో రవీందర్‌సింగ్‌ ఒకరు కాగా మరొకరు టీఆర్‌ఎస్‌కే చెందిన సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి ఆయన మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఎంపీటీసీలకు నిధులు, విధులు కల్పించాలని పోరాటం చేస్తున్నారు. ఆయనకు ఎంపీటీసీల్లో ఉన్న విస్తృత సంబంధాలు ఓట్లు తెచ్చిపెడతాయని ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకే చెందిన ఇనుముల సత్యనారాయణ ప్రశ్నించే గొంతుకు అవకాశం కల్పించాలని మంథని, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. రవీందర్‌సింగ్‌తోపాటు వీరిద్దరూ ఓట్లు చీల్చుకునే అవకాశమున్నందున అధికార పక్షాన్ని ఓడించడానికి ఇండిపెండెంట్లు ఒక్కటి కావలసిన అవసరమున్నదని ఈటల రాజేందర్‌ భావించి అందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన ఇండిపెండెంట్ల అభ్యర్థులందరితో చర్చించారని,  ఆ దిశగా కొంత ముందడుగు పడ్డట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ క్రాస్‌ ఓటింగ్‌ను కనీస పక్షానికి పరిమితం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని తనవద్ద ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి వారిని క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడకుండా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే ఓటు వేసేందుకు వీలుగా సంసిద్దులను చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఒక ఓటు టీఆర్‌ఎస్‌కు, ఒక ఓటు ఉద్యమకారుడికి అనే నినాదం టీఆర్‌ఎస్‌ క్యాంపుల్లోకి బలంగా వెళ్లిన నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రతినిధుల స్పందన ఎలా ఉంటుందన్నదానిపైనే ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. 

Updated Date - 2021-12-08T05:14:26+05:30 IST