Abn logo
Jan 16 2021 @ 01:07AM

ప్రభంజనం

అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ఏకాదశ రుద్రులను దర్శించునేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు

  • వేల హరివిల్లులు భువిపై విరిసినట్టు ఎటు చూసినా హరితవర్ణాన్ని అద్దుకున్న  ఆ తావుల్లో రంగురంగులతో శోభయమానంగా తీర్చిదిద్దిన ప్రభలు కొలువు తీరాయి. సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని శుక్రవారం  కోనసీమలోని పలు ప్రాంతాల్లో ప్రభల తీర్థాలు కనుల పండువగా జరగ్గా తిలకించడానికి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. 


అంబాజీపేట, జనవరి 15: అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట  ప్రభల తీర్థం అంబరాన్నంటింది. ఆ ప్రాంతమంగా భక్త జన సంద్రంగా మరింది. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచే ఈ తీర్థానికి పొటెత్తిన భక్తులు ప్రభలకు స్వాగతం పలికారు. ఇరుసుమండ, కె.పెదపూడి, మొసలపల్లి నుంచి జగ్గన్నతోటకు దారితీసే రోడ్లన్నీ కిటకిటలాడాయి. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ఏకాదశ రుద్రులు కొలువుగా ప్రసిద్ధిగాంచిన జగ్గన్నతోటకు వివిధ గ్రామాల నుంచి 11 ప్రభలు తరలివచ్చాయి. తీర్థానికి వచ్చే ఇతర గ్రామాల ప్రభలకు స్వాగతం పలికే మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి ప్రభ ఉదయం తొమ్మిది గంటలకే కొలువుతీరింది. కౌశిక అవతలవైపు ఉన్న గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు ప్రభలు నది దాటి తీర్థంలోకి ప్రవేశించే ఘట్టం చూపరులను గగుర్పాటుకు గురిచేసింది. శరభ... శరభ.. అశ్శరభ శరభ అంటూ బరువైన ప్రభలను యువకులు అవలీలగా భుజానకెత్తుకొని భక్తిభావంతో ముందుకు సాగారు. ఉదయం ఎనిమిది గంటలకే ఆయా గ్రామాల్లోని ప్రభలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను ప్రభలపై కొలువుదీర్చి మేళాతాళాలతో తీర్థానికి తీసుకువచ్చారు. ఆరేళ్ల చిన్నారుల నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు తీర్థాన్ని చూడ్డానికి తరలివచ్చారు.         చిరతపూడి చిట్టిచెరువు గట్టు, నరేంద్రపురం, అవిడి, రాకుర్తివారిపాలెం ప్రభలు చిరతపూడిలో కొలువుదీరాయి. వాకలగరువు, తొండవరం ప్రభలు తొండవరంలో కొలుతీరాయి. తొండవరం, వాకలగరువు ప్రభలు ఒకదానితో ఒకటి పోటీపడి చూపరులను కనువిందు చేశాయి.


కోనసీమలో జరిగిన ప్రభల ఉత్సవాలను తిలకించేందుకు ప్రజలు కొవిడ్‌ను సైతం లెక్కచేయకుండా భారీగా తరలివచ్చారు. జగ్గన్నతోట తీర్థంలో దుకాణాలకు పోలీసులకు అనుమతి నిరాకరించారు. దీంతో భక్తులు ఏకాదశ రుద్రులను దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులు సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని పోలీసులు హెచ్చరించారు. తీర్థం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి పర్యవేక్షణలో అమలాపురం సీఐ జి.సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐ షేక్‌ జానీబాషా భారీ బందోబస్తు నిర్వహించారు. 

Advertisement
Advertisement
Advertisement