జనం నెత్తిన సిలిండర్‌

ABN , First Publish Date - 2021-03-03T05:33:54+05:30 IST

పెరిగిపోతున్న గ్యాస్‌ ధరలు, ఆపై ఏజెన్సీల నిలువు దోపిడీతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. బహిరంగంగానే అక్రమదందాకు పాల్పడుతున్నా అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

జనం నెత్తిన సిలిండర్‌

సామాన్యుడికి భారంగా గ్యాస్‌ బండ

జిల్లాలో వినియోగదారులను దోచుకుంటున్న ఏజెన్సీలు

కనెక్షన్‌ మంజూరులోనూ చేతివాటం 

మూడు నెలల్లో రూ.225 పెంచిన సర్కార్‌

జిల్లా ప్రజలపై ప్రతి నెలా రూ.లక్షల్లో అదనపు భారం

ఆదిలాబాద్‌, మార్చి2 (ఆంధ్రజ్యోతి): పెరిగిపోతున్న గ్యాస్‌ ధరలు, ఆపై ఏజెన్సీల నిలువు దోపిడీతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. బహిరంగంగానే అక్రమదందాకు పాల్పడుతున్నా అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పేదల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీ ఇస్తున్నామని చెబుతున్నా అంతా ఉట్టిదన్నట్లుగానే కనిపిస్తోంది. కేవలం రూ.47లను మాత్రమే ఇచ్చి ధరలను పెంచేసి మరీ రూ.225 వరకు వసూలు చేస్తోంది. వివిధ రకాల కంపెనీలకు సంబంధించి జిల్లా లో మొత్తం 16గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. 18 మండ లాల పరిధిలో మొత్తం 2లక్షల 8వేల గ్యాస్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. అయితే ప్రతినెలా దాదాపుగా ప్రజల డిమాండ్‌ మేరకు 45వేల గ్యాస్‌ సిలిండర్‌లు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో సిలిండ ర్‌పై రవాణా ఇతరత్రా ఖర్చులను కలుపుకొని రూ.20 నుంచి 50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ లెక్కన సగటున రూ.40 తీసుకున్నా నెలకు రూ.83లక్షల 20వేలు గ్యాస్‌ ఏజెన్సీల జేబులోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే గ్యాస్‌ ఏజెన్సీల ఆదాయం ఏ మేరకు ఉంటుందో తెలుస్తూనే ఉంది. ఇలాంటి దోపిడీపై ఎన్నో ఫిర్యాదులు వస్తున్నా చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులు వెనకడుగు వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగిల్‌ స్టవ్‌తో పాటు నిండు సిలిండర్‌ను రూ.3050 కాగా డబుల్‌ సిలిండర్‌తో రూ.5300గ్యాస్‌ కనెక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అదనంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదు లు జిల్లాలో వెల్లువెత్తుతున్నాయి.

వరుసగా ధరల బాదుడు..

పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు సమానంగా గ్యాస్‌ ధరలు పెరగడంతో సామాన్య జనం విలవిలలాడుతున్నారు. దీంతో సామాన్య మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం పడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన మూడు నెలల్లోనే గ్యాస్‌ ధరలు భారీగా పెరుగడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. డిసెంబరు 1న 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.673 ఉండగా ప్రస్తుతం మార్చి 2 నాటికి రూ.898కి చేరింది. అంటే రూ.225 అదనంగా వినియోగదారులపె పడుతోంది. కొన్ని ఏజెన్సీలు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని పక్కదారి పట్టిస్తూ అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు లేక పోలేదు. అడపాదడపా ఫౌరసరఫరాల అధికారులు దాడులు చేస్తూ సిలిండర్‌లను స్వాధీనం చేసుకోవడం ఆపై 6(ఏ) కేసులను నమోదు చేసి వదిలేయడం మామూలుగానే మారిపోతుంది. తరచూ తనిఖీలు చేపట్టకపోవడం అధికారులు కార్యాలయాలకే పరిమి తంకావడం, కఠినంగా వ్యవహరించక పోవడంతో ఈ అక్రమ దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తూకంలో మోసం..

వినియోగదారులకు గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేసేటప్పుడు తప్పని సరిగా తూకం వేసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా తూకం వేసి సరఫరా చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. తూకంలోనూ మోసాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు గ్యాస్‌ ఏజెన్సీల సిబ్బంది ఖాళీ సిలిండర్లలలో నింపుతూ అమ్మేసుకుంటున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. సిలిండర్‌ బరువు పోగా గ్యాస్‌ బరువు 14.2 కిలోలు ఉండాలి. కానీ జిల్లాలోని ఏ ఏజెన్సీ కూడా ఇలా చేయకుండా ఇష్టారాజ్యంగా గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారు. అయితే తూనికల కొలతల శాఖ అధికారులు కూడా పత్తాలేకుండా పోవడంతో పట్టింపే లేకుండా పోతోంది. నిబంధనల ప్రకారం బిల్లు ధర కంటే అధికంగా వసూలు చేయరాదు. కానీ గ్యాస్‌ కొరత దూరభారం, ఇంటి అంతస్తులను బట్టి ధరను పెంచి అధికంగా వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం ఇస్తూ తప్పించుకుంటున్నారు. 

Updated Date - 2021-03-03T05:33:54+05:30 IST