కృష్ణంరాజు సంస్మరణ సభ.. కిటకిటలాడిన మొగల్తూరు

ABN , First Publish Date - 2022-09-30T02:48:42+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) మొగల్తూరులో దివంగత రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు (Krishnam Raju) స్మారక కార్యక్రమానికి అభిమానులు పోటెత్తారు.

కృష్ణంరాజు సంస్మరణ సభ.. కిటకిటలాడిన మొగల్తూరు

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) మొగల్తూరులో దివంగత రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు (Krishnam Raju) స్మారక కార్యక్రమానికి అభిమానులు పోటెత్తారు. బుధవారం రాత్రి మొగల్తూరు చేరుకున్న ప్రభాస్‌ ఉదయం నుంచి స్మారక కార్యక్రమంలో కొనసాగారు. కృష్ణంరాజు జ్ఞాపకంగా ఆయన కుటుంబ సభ్యులు 50 వేల మంది వరకూ భోజనాలు సిద్ధం చేయడంతో వేలాది మంది తరలి వచ్చారు. ఇందులో ప్రభాస్‌ను చూసేందుకు వారి భవనం ఎదుట అభిమానులు ఎగబడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలుమార్లు ప్రభాస్‌ మొదటి అంతస్తులోకి వచ్చి ‘హలో అందరూ బాగున్నారా డ్యూడ్స్‌.. మరోసారి వస్తా కలుద్దాం’ అంటూ అభిమానులకు అభివాదం చేస్తూ కొనసాగారు. అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నారు. ఓవైపు వేల మంది భోజనాలు చేస్తుండగా మరోవైపు అభిమానులు పోటెత్తారు. మొగల్తూరు ప్రధాన వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. 


50 రకాల వంటకాలు

కృష్ణంరాజు భోజన ప్రియుడు కావడంతో.. ఆయనకు ఇష్టమైన వంటకాలను వండించారు. సంస్మరణ సభకు వచ్చిన వారికందరికి వడ్డించారు. సుమారు 50 రకాల వెజ్‌, నాన్‌ వెజ్‌ వంటకాలు చేయించారు. టన్నుల కొద్దీ మటన్‌, చికెన్‌, చేపలు, పీతలు, రొయ్యలు, సముద్ర ఉత్పత్తులైన సొర, సందువాయి, సముద్ర సొర పిడుపు, మెత్తళ్ళతోపాటు నాటు కోడి మాంసం తెప్పించారు. నాలుగు రకాల నాన్‌ వెజ్‌ బిర్యానీతోపాటు శాఖాహార వంటలైన వంకాయ, మష్రూమ్స్‌, పన్నీర్‌ కర్రి, పప్పు, కొబ్బరి పచ్చడి, బూరి, పులిహోర, క్షీరాన్నం, రసగుల్లా, పెసర కట్టు, దప్పలం, సాంబారు తదితర రకాలను తయారు చేయించారు. సుమారు అర లీటర్‌ మంచినీటి సీసాలు నాలుగు లక్షలు అందించారు. ఉదయం 9 గంటల నుంచే బోజనాలు మొదలయ్యాయి. సాయంత్రం వరకూ కొనసాగుతోంది. సుమారు 40 వేల మంది పైబడి భోజనాలు చేసినట్టు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2022-09-30T02:48:42+05:30 IST