కిటకిటలాడిన పర్యాటక ప్రాంతాలు

ABN , First Publish Date - 2021-01-17T05:37:55+05:30 IST

సంక్రాంతి పండుగకు వరుస సెలవులు రావడంతో పర్యాటక ప్రాంతాలన్నీ సందర్శకులతో కిక్కిరిసిపోతున్నాయి.

కిటకిటలాడిన పర్యాటక ప్రాంతాలు
కైలాసగిరిపై సందర్శకులు

సందర్శకులతో కళకళలాడిన కైలాసగిరి

జోడుగుళ్లపాలెం తీరంలో నౌకను వీక్షించేందుకు తరలివచ్చిన జనం

జూకు రూ.5 లక్షల ఆదాయం

విశాలాక్షినగర్‌, జనవరి 16: సంక్రాంతి పండుగకు వరుస సెలవులు రావడంతో పర్యాటక ప్రాంతాలన్నీ సందర్శకులతో కిక్కిరిసిపోతున్నాయి. శనివారం కైలాసగిరికి సందర్శకులు వేలాదిగా రావడంతో పరిసర ప్రాంతాలన్నీ కళకళలాడాయి. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం... టీకాలు అందుబాటులోకి రావడంతో ప్రజల్లో కరోనాపై భయందోళనలు పోయినట్టున్నాయి. దీంతో పర్యాటక ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. కైలాసగిరితో పాటు జోడుగుళ్లపాలెం తీరంలో చిక్కుకున్న నౌకను తిలకించేందుకు సందర్శకులు పోటెత్తడంతో వాహనాల పార్కింగ్‌ సమస్య తలెత్తింది. తెన్నెటి పార్కు, కైలాసగిరిపైకి రాకపోకలు సాగించే వాహనాలు, రుషికొండ వైపు నుంచి నగరానికి వెళ్లే వాహనాలతో జోడుగుళ్లపాలెం కూడలిలో ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.


జంతు ప్రదర్శనశాల ఆదాయం రూ.5 లక్షలు

ఆరిలోవ: నగరంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు శనివారం అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. సుమారు 8,082 మంది జూను సందర్శించడంతో రూ.5,04,304  ఆదాయం వచ్చినట్టు క్యూరేటర్‌ డాక్టర్‌ నిందినీ సలారియా తెలిపారు. 



Updated Date - 2021-01-17T05:37:55+05:30 IST