బద్దిపోచమ్మ ఆలయం వద్ద బోనాలతో బారులు తీరిన భక్తులు
- కోడెమొక్కు చెల్లించుకున్న ముస్లిం మహిళ
వేములవాడ, జనవరి 26 : వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం, అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో రద్దీగా మారింది. సోమవారం రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు దినం కావడంతో రాజన్న ఆలయం సైతం భక్తులతో రద్దీగా మారింది. మంథనికి చెందిన ముస్లిం మహిళ అప్సర్ శాసిత మంగళవారం రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకున్నారు. ప్రముఖ సినీ నటుడు కోట శంకర్‌రావు రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
రాజన్నకు ఘనంగా రుద్రాభిషేకం
ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారికి మంగళవారం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేశారు.