ఆ నౌకలు ఫ్లోరిడా పోర్టుకు వస్తాయా? ప్రభుత్వం అనుమతిస్తుందా?

ABN , First Publish Date - 2020-04-02T23:02:14+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచదేశాల మధ్య విమాన రాకపోకలు ఆగిపోయిన విషయం తెలిసిందే. విమానాలే కాకుండా వివిధ దేశ ప్ర

ఆ నౌకలు ఫ్లోరిడా పోర్టుకు వస్తాయా? ప్రభుత్వం అనుమతిస్తుందా?

ఫ్లోరిడా: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచదేశాల మధ్య విమాన రాకపోకలు ఆగిపోయిన విషయం తెలిసిందే. విమానాలే కాకుండా వివిధ దేశ ప్రభుత్వాలు తమ దేశాల్లోని పోర్టులను కూడా మూసివేశాయి. ఇదే సమయంలో హోలాండ్‌కు చెందిన జాందామ్ క్రూయిజ్ లైనర్, రాటర్‌డామ్ నౌకలు పోర్టుకు వెళ్లడం కుదరక సముద్రంలో ఇరుక్కుపోయాయి. ఈ నౌకల్లో ప్రయాణిస్తున్న వారిలో అనేక మందికి కరోనా సోకడంతో.. ఏ ఒక్క దేశం కూడా ఈ నౌకలు తమ పోర్టులలోకి వచ్చేందుకు అనుమతిని ఇవ్వడం లేదు. దీంతో ఈ నౌకలు తీరానికి చేరడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నౌకల్లో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అనేక ఇక్కట్లు పడుతున్నారు. జాందామ్ నౌకలో 442 మంది ప్రయాణికులు, 603 మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క రాటర్‌డామ్ నౌకలో మొత్తంగా 808 మంది ప్రయాణికులు, 583 మంది సిబ్బంది ఉన్నారు.   


కాగా.. ఈ నౌకలు సోమవారం పనామా కెనాల్ దాటి ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్ పోర్ట్ వైపు ప్రయాణిస్తున్నాయి. ఈ పోర్టుకైనా నౌకలు చేరతాయా లేదా ప్రభుత్వం నిరాకరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ నౌకల్లో చిక్కుకున్న వారి కుటుంబసభ్యులు నౌకలను ఫ్లోరిడా పోర్టుకు వచ్చేలా అనుమతివ్వాలని ఫ్లోరిడా ప్రభుత్వాన్ని, ట్రంప్‌ను విజ్ఞప్తి చేస్తున్నారు. తాను ఫ్లోరిడా గవర్నర్‌తో మాట్లాడి వీటిని ఫ్లోరిడా పోర్ట్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని ట్రంప్ కూడా హమీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. జాందామ్ నౌకలో కరోనా బారిన పడి అనేక మంది మరణించారని వారిని ఫ్లోరిడా పోర్ట్‌కు ఎలా తీసుకువస్తామంటూ ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ ప్రశ్నిస్తున్నారు. కాగా.. జాందామ్ నౌక‌లో ఇప్పటివరకు నలుగురు మరణించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు, మరి కొంతమందిలో కరోనా లక్షణాలు కనపడుతున్నట్టు వార్తలొచ్చాయి. తన అంకుల్ ఈ నౌక‌లోనే మరణించాడని, మృతదేహంతోనే ఆయన భార్య నౌకలో ఐసోలేషన్‌లో ఉన్నట్టు బ్రిటిష్‌కు చెందిన మహిళ చెబుతోంది. ఆమెకు కూడా కరోనా లక్షణాలు ఉన్నాయని.. నౌకను పోర్టుకు తీసుకురాకపోతే ఎంతో మంది ప్రాణాలు పోయే అవకాశముందని బ్రిటిష్ మహిళ హెచ్చరిస్తోంది. ఈ మేరకు ఆమె ట్రంప్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తోంది. 

Updated Date - 2020-04-02T23:02:14+05:30 IST