కష్టాల క్రషర్లు

ABN , First Publish Date - 2021-11-30T06:39:37+05:30 IST

కొండలను పిండి చేసి.. కాసులను పండించుకున్నారు..

కష్టాల క్రషర్లు

మూడు రాజధానుల ప్రకటనతో కంకర పరిశ్రమ తలకిందులు

నిర్మాణాలు మందగించడంతో కుప్పలుగా కంకర జూ రోడ్డు మెటల్‌ పరిస్థితీ అంతే

పెద్ద క్రషర్ల యజమానులకు రూ.కోట్లలో నష్టాలు జూ గత్యంతరంలేక మూసివేత దిశగా..


కొండలను పిండి చేసి.. కాసులను పండించుకున్నారు.. ఆ బండరాళ్లనే నమ్ముకున్న కూలి బతుకులకు ఉపాధినిచ్చి అండగా నిలిచారు.. ఇదంతా నిన్న మొన్నటి వరకు. నేడు వారి పరిస్థితి తలకిందులైంది. జిల్లాలో కంకర పరిశ్రమ కష్టాల్లో కూరుకుపోయింది. కొనుగోలుదారులు లేక రోడ్డు మెటల్‌, కంకర కుప్పలుగా పడి ఉంటోంది. రాజధాని అమరావతిలో నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోవడం, రోడ్ల పనులు మందగించడం, ఇసుక దొరక్క నిర్మాణ రంగం కుదేలవటం తదితర కారణాలతో రోడ్డు మెటల్‌కు, కంకరకు డిమాండ్‌ పూర్తిగా పడిపోయింది. సిబ్బంది జీతభత్యాలు, బ్యాంకు రుణాల వాయిదాలు చెల్లించలేక యజమానులు సతమతమవుతున్నారు. ఇప్పటికే కోట్లలో నష్టపోయిన కొందరు క్రషర్లను మూసివేస్తున్నారు. 


కంచికచర్ల : జిల్లాలో కంచికచర్ల, జి.కొండూరు, గంపలగూడెం, ఇబ్రహీంపట్నం మండలాల్లో కంకర పరిశ్రమ విస్తరించింది. వందల సంఖ్యలో రాతి క్వారీలు ఉండగా, చిన్నవి, పెద్దవి కలిసి దాదాపు 70కి పైగా క్రషర్లు ఉన్నాయి. గంటకు రెండు వందల టన్నుల క్రషింగ్‌ సామర్థ్యం కలిగిన పెద్ద క్రషర్లు 50 వరకు ఉన్నాయి. రాతి క్వారీల నుంచి తీసుకువచ్చే బండరాళ్లను క్రషర్లలో అర అంగుళం, ముప్పాతిక అంగుళం కంకరుగా, బేబీ చిప్స్‌గా, రోడ్డు మెటల్‌గా క్రషింగ్‌ చేస్తారు. కంకరను ఇళ్లు, భవనాల నిర్మాణంలో, కాంక్రీటులో వినియోగిస్తారు. రోడ్డు మెటల్‌ను పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవే  రోడ్ల నిర్మాణంలో,  రైల్వే లైను పనుల్లో ఉపయోగిస్తారు. 


మూడు రాజధానుల ప్రకటనతో..

2019 ఎన్నికలకు ముందు రోడ్డు మెటల్‌, కంకరకు  డిమాండ్‌ ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా అమరావతిని రాజఽధానిగా ప్రకటించడమే డిమాండ్‌ పెరగడానికి కారణం. నాడు క్రషర్లు రేయింబవళ్లు ఆడేవి. అలాంటిది ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం, మూడు రాజధానుల ప్రకటన వెలువడడంతో అమరావతి కేంద్రంగా అభివృద్ధి పనులకు ఫుల్‌స్టాప్‌ పడింది. దీనికితోడు ఇసుక ఇబ్బందుల వల్ల నిర్మాణ రంగం మందగించింది. పట్టణాలు, గ్రామాల్లో బహుళ అంతస్థుల భవనాలు, ఇతరత్రా నిర్మాణ పనులు మందగించాయి. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు నిలిచిపోయాయి. రోడ్లు ధ్వంసమై చెరువులను తలపిస్తున్నప్పటికీ మరమ్మతులు చేపట్టడంలేదు. ఇంతకు ముందు చేసిన పనులకు బిల్లులు రాకపోవటంతో కొత్త పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. ఇరిగేషన్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా రోడ్డు మెటల్‌కు, కంకరకు డిమాండ్‌ పడిపోయింది. కొనేవాళ్లు లేకపోవటంతో  అమ్మకాలు పూర్తిగా మందగించాయి. పెద్ద క్రషర్లు 20 వరకు మూతబడగా, మిగిలినవి అరకొరగా పనిచేస్తున్నాయి. చిన్న క్రషర్లు అయితే రెండు మూడు తప్ప మిగిలినవన్నీ మూతబడ్డాయి. ఉద్యోగులకు, వాహనాల సిబ్బందికి జీతభత్యాలు, విద్యుత్‌ బిల్లులు చెల్లించలేక, టిప్పర్లు, మిషనరీలకు సంబంధించిన బ్యాంకు రుణాల వాయిదాలు కట్టలేక యజమానులు పలు అవస్థలు పడుతున్నారు.


డిమాండ్‌ లేదు

2016, 17, 18 సంవత్సరాల్లో రోడ్డు మెటల్‌, కంకరకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. రోజుకు 60 వేల నుంచి లక్ష టన్నుల వరకు ఉత్పత్తి జరిగింది. అలాంటిది నేడు 20 వేల టన్నుల ఉత్పత్తి కావటమే గగనమవుతోంది. అభివృద్ధి పనులు లేకపోవటంతో మెటల్‌, కంకర అడిగే నాథుడే లేడు. క్రషర్లను మూసేసి సిబ్బందిని ఇళ్లకు పంపించారు. 


బిల్లు కోసం ఆడిస్తున్నారు 

పెద్ద క్రషర్ల కనీస విద్యుత్‌ బిల్లు రూ.రెండు లక్షలు. క్రషర్‌ పనిచేయకపోయినా బిల్లు కట్టాల్సిందే. డిమాండున్నప్పుడు నెలకు ఆరు నుంచి ఎనిమిది లక్షల బిల్లు వచ్చేది. ఇప్పుడు ఆ కనీస బిల్లు వరకు మాత్రమే పనిచేసి, క్రషర్లకు తాళాలు వేస్తున్నారు.


నట్టేట మునిగిన యజమానులు

పెద్ద క్రషర్‌ ఏర్పాటుకు రూ.10 కోట్ల నుంచి 15 కోట్లు పెట్టుబడి అవుతుంది. 2014కు ముందు జిల్లాలో పెద్ద క్రషర్లు పది మాత్రమే ఉన్నాయి. కొత్త రాజధానిని నమ్ముకుని ఎంతో ఆశతో, కోట్లాది రూపాయల పెట్టుబడితో కొందరు పెద్ద క్రషర్లు నిర్మించారు. ఇప్పుడు వీరి పరిస్థితి దయనీయంగా మారింది. క్రషర్‌ను మూసేసుకోవటం వల్ల కోట్లలో నష్టపోయారు. రాజకీయ కారణాల వల్ల తమ దుస్థితిని చెప్పుకునేందుకు కూడా వారు భయపడుతున్నారు.

Updated Date - 2021-11-30T06:39:37+05:30 IST