పిండేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-05-14T05:16:32+05:30 IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్‌ ఆస్పత్రులు దోపిడీకి తెరలేపాయి.

పిండేస్తున్నారు!

  • కరోనా ట్రీట్మెంట్‌కు భారీగా ఫీజు వసూలు
  • సర్కారు ఆదేశాలను బేఖాతర్‌ చేస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు
  • బిల్లులు కట్టలేక ఇబ్బందుల్లో కరోనా బాధితులు 
  • అధిక బిల్లులపై వైద్యశాఖకు ఫిర్యాదులు
  • మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో రెండు ఆస్పత్రులపై చర్యలు 
  • అధిక మొత్తంలో వసూలు చేసిన బిల్లులు చెల్లించాలని నోటీసులు, రికవరీ


కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్‌ ఆస్పత్రులు దోపిడీకి తెరలేపాయి. కొవిడ్‌ బాధితుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు లాగుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా అధికంగా వసూలు చేస్తూ కొవిడ్‌ బాధితులను దోచుకుంటున్నారు. ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రైవేట్‌ ఆస్పత్రులు చేరుతున్న వారు బిల్లులు కట్టలేక సతమతమవుతున్నారు. డబ్బుల కోసం బంధువులు, స్నేహితులను ఆశ్రయిస్తున్నారు. నానా ఇబ్బందులు పడి ఆస్పత్రుల్లో బిల్లులు చెల్లిస్తున్నారు.




(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కొవిడ్‌-19 బాధితుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతోంది. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో రోజువారీగా వెయ్యి వరకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. బాఽధితులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల యజమాన్యాలు కొవిడ్‌ బాధితుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో బాధితులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. జలుబు, జ్వరం, బాడీ పెయిన్స్‌ ఏది వచ్చినా కరోనానేమో అనే భయంతో జనం ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆస్పత్రుల్లో కొవిడ్‌ పరీక్షలు చేసిన తర్వాతే వైద్యం అందిస్తున్నారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలగానే ప్రజలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారి స్థోమతను బట్టి ఆస్పత్రులను ఎంపిక చేసుకుంటున్నారు. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగం కొవిడ్‌-19 చికిత్స కోసం 132 ప్రైవేట్‌ ఆస్పత్రులకు అనుమతినిచ్చింది. వీటిలో పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు ఉండగా, మిగతా చోట్ల ఐసోలేషన్‌, ఐసీయూ వెంటిలేటర్‌ సౌకర్యం ఉంది. జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పతుల్లో 5,324 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. 

 అయితే కరోనా లక్షణాలు సాధారణంగా ఉన్న రోగుల నుంచి కూడా ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యం రోజువారీగా వేలల్లో బిల్లులు వసూలు చేస్తోంది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వార్డులో ఐసోలేషన్‌ వైద్యం పొందుతున్న రోగులకు రూ.4వేలు, ఐసీయూలో వెంటిలేటర్‌ లేకుండా, ఐసోలేషన్‌కు రూ.7,500, ఐసీయూలో వెంటిలేటర్‌తోపాటు ఐసోలేషన్‌ కు రూ.9వేల వరకు వసూలు చేయాలని ప్రభుత్వం ధరలను నిర్థారించింది. ఈ మార్గ దర్శ కాలను తూచా తప్ప కుండా పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రైవేట్‌ ఆస్పత్రులు ఈ నిబం ధనలను తుంగలో తొక్కుతున్నాయి. రోజువారీగా ఒక్కో రోగి వద్ద రూ.30వేల నుంచి సీరియస్‌గా ఉన్నట్లయితే రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారని, బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. సాధారణం కంటే అధిక మొత్తంలో ఆస్పత్రి బిల్లులు వసూలు చేస్తున్నారని మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో ఫిర్యా దులు అందుతున్నాయి. పలు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని వైద్యాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఫిర్యాదులపై వైద్యశాఖ అధికారులు విచారణ జరిపారు. పలు ఆస్పత్రుల్లో రోగుల వద్ద అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్టు విచారణలో తేలింది. జిల్లాలోని కూకట్‌పల్లి పరిధిలో ఉన్న రెండు ప్రైవేట్‌ ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి నుంచి రూ.70వేల వరకు రికవరీ చేయించారు. అదేవిధంగా మరో ఆస్పత్రి నుంచి రూ.2లక్షల వరకు బాధితునికి తిరిగి చెల్లించాలని జిలా ్లవైద్య ఆరోగ్యశాఖ అధికారి నోటీసులు జారీచేశారు. అధికారికంగా ఫిర్యాదులు వస్తేనే వైద్య శాఖ స్పందిస్తోంది. ఆస్పత్రుల్లో ఫీజుల నియంత్రణ, నిబంధనలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రుల్లో బాధితులు వద్ద వసూలు చేస్తున్న ఫీజులను ప్రభుత్వం నియంత్రించాలని బాధితులు, వారి కుటుంబసభ్యులు, బంధువులు కోరుతున్నారు. 


నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేయాలని సర్క్యులర్లు పంపాం

కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం రోగులకు వైద్యం అందించి, డబ్బులు వసూలు చేయాలని అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులకు సర్క్యులర్లను జారీచేశాం. కరోనా బాధితుల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేసినట్లుగా ఆస్పత్రులపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నాం. వైద్యశాఖకు అందిన ఫిర్యాదుపై విచారణ జరిపి, ఆస్పత్రి వేసిన బిల్లులను స్కూృట్నీ నిర్వహిస్తున్నాం. ఆస్పత్రి రోగుల వద్ద ప్రభుత్వం నియమించిన ధరల కంటే అధికంగా వసూలు చేసినట్లయితే వారికి నోటీసులు పంపి, రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

- డాక్టర్‌ మల్లికార్జునరావు,  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

Updated Date - 2021-05-14T05:16:32+05:30 IST