Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత్‌లో... మరో బిట్‌కాయిన్ స్టోర్...

ముంబై : భారత్‌లో క్రి్ప్టో కరెన్సీని ఆమోదించే యోచనే లేదని ఓవైపు కేంద్రం చెబుతుండగా... మరోవైపు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా మరో ప్రైవేట్‌ బిట్‌కాయిన్‌స్టోర్‌ భారత్‌లో అడుగుపెట్టింది. సింగపూర్‌కు చెందిన వర్చువల్‌ కరెన్సీ ఏజెన్సీ ఎక్స్ఛేంజి   కాయిన్‌స్టోర్‌ భారత్‌లో తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. క్రాస్‌టవర్‌(వాస్తవానికి ఇది సెప్టెంబరులోనే లాంఛ్‌ అయ్యింది) తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన రెండో గ్లోబల్‌ ఎక్స్ఛేంజి  కాయిన్‌స్టోర్‌ ఇదే. బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై శాఖలతో కాయిన్‌స్టోర్‌ తన కార్యకలాపాలను ప్రారంభించింది. అంతేకాకుండా... 20 మిలియన్‌డాలర్లను  భారత మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టనున్నట్లు, ప్రస్తుతానికి వంద మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు కాయిన్‌స్టోర్‌ మార్కెటింగ్‌ హెడ్‌ చార్లెస్‌ టాన్‌ వెల్లడించారు. 


కాగా... క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ప్రతిపాదనలేవీ లేవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే చెబుతూ వస్తోన్న తరుణంలో... కాయిన్‌స్టోర్‌ వేసిన అడుగు సాహసోపేతమనే చెప్పాలి.  కాగా... అంతా సవ్యంగా జరుగుతుందనే ఆశాభావంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, క్రిప్టోకరెన్సీల కోసం భారత ప్రభుత్వం సరైన కసరత్తుతోనే ముందుకు వస్తుందని భావిస్తున్నామని  చార్లెస్‌ టాన్‌ పేర్కొన్నారు. భారత్‌తో పాటు జపాన్‌, కొరియా, ఇండోనేషియా, వియత్నాంలలోనూ కార్యకలాపాలకు కాయిన్‌స్టోర్ సిద్ధమవుతోంది.


ఇదిలా ఉంటే... ప్రపంచలోనే అతిపెద్ద(విలువైన) క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్‌కాయిన్‌...  ఈ ఏడాది ఆరంభంలో కంటే రెట్టింపు విలువతో భారత పెట్టుబడిదారులను ఆకర్షిస్తుండడం గమనార్హం. ఇక భారత్‌ నుంచి కోటిన్నర నుంచి 2 కోట్ల మంది... దాదాపు 40 వేల కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని పెట్టుబడిగా కలిగి ఉన్నారని అంచనా. అయితే... క్రిప్టో బిల్లుకు సంబంధించిన వార్తలు,  పరిణామాల తర్వాత... దాని విలువ ఎప్పటికప్పుడు  ఎగుడుదిగుళ్ళకు లోనవుతూ, ఇన్వెస్టర్లను అయోమయానికి గురిచేస్తోంది. వాస్తవానికి... క్రిప్టో బిల్లు యోచనేదీ లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే... కేంద్రం నుంచి మరో ప్రకటన వెలువడుతుందని కూడా సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. 

Advertisement
Advertisement