సీఎస్ వి పచ్చి అబద్ధాలు

ABN , First Publish Date - 2022-01-20T07:07:18+05:30 IST

సీఎస్ వి పచ్చి అబద్ధాలు

సీఎస్ వి పచ్చి అబద్ధాలు

తప్పు సమర్థనకే ప్రెస్‌మీట్‌.. చీకటి జీవోలు రద్దు చేసే వరకు చర్చలుండవ్‌

ఈ పీఆర్‌సీ వల్ల అన్యాయమే.. గతంలో సాధించుకున్న వాటి జోలికెందుకెళ్లారు

ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తగ్గడం చరిత్రలో లేదు: బొప్పరాజు, బండి ధ్వజం

నేటి నుంచి ఆందోళనలు ఉధృతం.. సమ్మెకు కదలాలని నిర్ణయం 

అధికారులపై నమ్మకం పోయింది: వెంకట్రామిరెడ్డి


అమరావతి, విజయవాడ, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని, నేతి బీరకాయలో నెయ్యి చందాన వారి ప్రకటనలు ఉన్నాయని ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు  విమర్శించారు. ఉద్యోగుల పాలిట గొడ్డలి పెట్టుగా మారిన జీవోలను రద్దు చేసే వరకు తామెవరితోనూ చర్చించబోమని చెప్పారు. ఇదే వైఖరితో ఉంటే సమ్మె చేయటానికి కూడా వెనుకాడకూడదని నిర్ణయించుకున్నామని, శుక్రవారం సమ్మె నోటీసు ఇస్తామని బండి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఏపీఎన్‌జీవో భవన్‌లో ఏపీఎన్‌జీవో పశ్చిమ కృష్ణా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. భవన్‌ ముందు జీవోలను దహనం చేశారు. ‘రివర్స్‌ పీఆర్‌సీ మాకొద్దు.. సీఎస్‌ డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ వల్ల ఎలాంటి నష్టమూ లేదన్న అసత్యపు మాటలను తక్షణం సీఎస్‌, ఉన్నతాధికారులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ పీఆర్‌సీ వల్ల ప్రతి ఉద్యోగికి సగటున రూ.6-7 వేల చిల్లు పడుతోందన్నారు. ఐఏఎస్‌ అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మోసపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించకుండా ఏకపక్షంగా చీకటి జీవోలు జారీ చేశారని, తమ చర్యలను సమర్థించుకోటానికే ప్రెస్‌మీట్‌  పెట్టి ఉద్యోగులకు లాభం జరిగిందని చెప్పారని విమర్శించారు. 18 శాతం కోత పడుతోందని, అధికారులు చెప్పినట్టు డీఏ 20 శాతాన్ని కలుపుకున్నా కూడా కేవలం 2 శాతం ప్రయోజనం అందరు ఉద్యోగులకూ రాదన్నారు. గ్రాట్యుటీపై సీలింగ్‌ విధించటం, గత ప్రభుత్వ హయాంలో పోరాడి సాధించుకున్న అదనపు క్వాంటమ్‌ పెన్షన్లను రద్దు చేయటాన్ని ఏమనాలని ప్రశ్నించారు. ఏపీ రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ అమరావతి ముఖ్య నేతల సమావేశం అనంతరం బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉన్నతాధికారులు చెప్పినవన్నీ కాకి లెక్కలు, శుద్ధ అబద్ధాలని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన డీఏలను కలిపి జీతాలు పెరిగాయని చెబుతున్నారే తప్ప వాస్తవంగా జీతాలు పెరగకపోగా తగ్గాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పోరాడి సాధించుకున్న హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయం బాగా లేదనడంతో ఏకీభవించటం లేదన్నారు. 


అధికారులే ముంచుతున్నారు: వెంకట్రామిరెడ్డి

పీఆర్సీ జీవోలన్నింటినీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. జీవోలను వెనక్కి తీసుకుంటేనే ప్రభుత్వంతో చర్చలకు వెళతామన్నారు.


సచివాలయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన

ఉద్యోగుల నిరసన సెగ రాష్ట్ర సచివాలయాన్ని తాకింది. పీఆర్సీ జీవోలను వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆప్సా ఆధ్వర్యంలో ఉద్యోగులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.


Updated Date - 2022-01-20T07:07:18+05:30 IST