‘ముగ్గురు జేసీల’పై సీఎస్‌ కమిటీ

ABN , First Publish Date - 2020-08-15T09:53:14+05:30 IST

‘ముగ్గురు జేసీల’పై సీఎస్‌ కమిటీ

‘ముగ్గురు జేసీల’పై సీఎస్‌ కమిటీ

అమరావతి/కలికిరి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): జిల్లాల్లో ముగ్గురు జాయింట్‌ కలెక్టర్ల వ్యవస్థ ఆశించిన ఫలితం ఇవ్వడం లేదని సర్కారు గ్రహించింది. ముందస్తు అధ్యయనం, చట్టాల పరిశీలన లేకుండా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ పనితీరులో ప్రభావ వంతమైన ఫలితాలు ఇవ్వడం లేదని గుర్తించింది. మూడు నెలల తర్వాత ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇదే అంశంపై ‘పేరుకే ముగ్గురు.. పవర్‌ అంతా ఒక్కరివద్దే’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వార్త ప్రభుత్వాన్ని కదిలించింది. ముగ్గురు జేసీల విధానాన్ని చక్కదిద్ది ప్రభావవంతంగా మార్చేందుకు సీఎస్‌ నీలం సాహ్ని నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. 10మంది అధికారులతో కూడిన ఈ కమిటీ ముగ్గురు జేసీల వ్యవస్థపై అధ్యయనం చేసి, 14 రోజుల్లో నివేదికను ఇవ్వనుంది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో 1267 జారీ చేసింది. కమిటీలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ), వ్యవసాయం, వైద్య, ఆరోగ్యం, విద్య, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, విలేజ్‌ వార్డు సెక్రటేరియట్‌ విభాగాల ముఖ్యకార్యదర్శులు, పురపాలక, పట్టణాభివృద్ధి, సాంఘిక సంక్షేమం, సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్‌) కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. జీఏడీ కార్యదర్శి కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ముగ్గురు జేసీల వ్యవస్థ పనితీరులోని లోపాలు, బాధ్యతలను అప్పగించడంలో ఉన్న సమస్యలు, వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.

Updated Date - 2020-08-15T09:53:14+05:30 IST