చెన్నై చిందేసెన్‌!

ABN , First Publish Date - 2020-10-05T08:40:02+05:30 IST

సీఎ్‌సకే తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం (181) అందించిన జోడీ వాట్సన్‌-డుప్లెసి. అలాగే పంజాబ్‌పై ఏ జట్టుకైనా తొలి వికెట్‌కు ఇదే అత్యధికం.

చెన్నై చిందేసెన్‌!

వాట్సన్‌, డుప్లెసి రికార్డు భాగస్వామ్యం

 పంజాబ్‌పై 10 వికెట్ల తేడాతో విజయం


 సీఎ్‌సకే తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం (181) అందించిన జోడీ వాట్సన్‌-డుప్లెసి. అలాగే పంజాబ్‌పై ఏ జట్టుకైనా తొలి వికెట్‌కు ఇదే అత్యధికం.


ఐపీఎల్‌ చరిత్రలో ఒక్క వికెట్‌ కోల్పోకుండా గెలిచిన మ్యాచ్‌ల్లో వాట్సన్‌-డుప్లెసి జోడీ రెండో ఉత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. గంభీర్‌-లిన్‌ (కోల్‌కతా, 184) జోడీ ముందుంది.


ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రెండో వికెట్‌ కీపర్‌ ధోనీ (100). దినేశ్‌ కార్తీక్‌ (103) మొదటి స్థానంలో ఉన్నాడు.


ఆహా.. ఇది కదా ఆటంటే. తాజా సీజన్‌ ఆరంభమై పదిహేను రోజులైనప్పటికీ.. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయంతో అందరినీ నిరాశపరిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ చివరకు జూలు విదిల్చింది. ఇదీ తమ ఆట తీరంటూ ప్రత్యర్థి జట్లకు సవాల్‌ విసరడంతో పాటు పంజాబ్‌ కింగ్స్‌ను కుదేల్‌ చేసింది. ముఖ్యంగా తాను ఫామ్‌లో ఉంటే ఎలా ఉంటుందో ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ నిరూపించాడు. అటు డుప్లెసి కూడా పోటాపోటీగా బ్యాటింగ్‌ చేశాడు. దీంతో ఒక్క వికెట్‌ కూడా కోల్పోని చెన్నై.. ఈ వేదికపై ఈసారి చేజింగ్‌లో గెలిచిన 


తొలి జట్టయింది.

దుబాయ్‌: మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ హ్యాట్రిక్‌ పరాజయాలకు చెక్‌ పెట్టింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో అదిరిపోయే ఆటతీరుతో మునుపటి వాడి వేడిని ప్రదర్శిస్తూ దుమ్మురేపింది. షేన్‌ వాట్సన్‌ (53 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 83 నాటౌట్‌) జట్టుకు తానెంత కీలక ఆటగాడినో మరోసారి నిరూపించుకున్నాడు. అటు డుప్లెసి (53 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 87 నాటౌట్‌) కూడా పోటాపోటీగా ఆడగా కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌పై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 175 పరుగులు చేసింది. రాహుల్‌ (52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 63), పూరన్‌ (17 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 33) రాణించారు. శార్దూల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో చెన్నై 17.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 181 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా వాట్సన్‌ నిలిచాడు.


ఓపెనర్ల దంచుడు:


ఈ సీజన్‌లో తొలిసారిగా స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెన్నై అదరగొట్టింది. ఓపెనర్లు వాట్సన్‌, డుప్లెసి నువ్వా.. నేనా అనే రీతిలో ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న వాట్సన్‌ తొలి ఓవర్‌లోనే 2 ఫోర్లు బాది ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఎక్కువగా తానే స్ట్రయికింగ్‌ తీసుకుంటూ ఎదురుదాడికి దిగా డు. అటు డుప్లెసి సహకారం అందించాడు.


ఆరో ఓవర్‌లో వాట్సన్‌ నాలుగు ఫోర్లతో చెలరేగి 19 పరుగులు రాబట్టగా పవర్‌ప్లేలో సీఎ్‌సకే 60 రన్స్‌ పూర్తి చేసింది. ఈ సీజన్‌లో జట్టుకిదే అత్యుత్తమం. ఆ తర్వాత కూడా వాట్సన్‌ ఆగలేదు. 8వ ఓవర్‌లో 3 ఫోర్లు, 9వ ఓవర్‌లో 4,6తో అదరగొట్టాడు. ఈ సిక్సర్‌ ఏకంగా 101మీ. దూరం వెళ్లడం విశేషం. 11వ ఓవర్‌లోనూ రెండు వరుస ఫోర్లతో 31 బంతుల్లో వాట్సన్‌ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అదే ఓవర్‌లో డుప్లెసి కూడా 33 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. ఇదే జోరు తుదికంటా ప్రదర్శించిన ఈ జోడీని పంజాబ్‌ బౌలర్లు ఏ దశలోనూ ఇబ్బంది పెట్టలేకపోయారు. 18వ ఓవర్‌లో డుప్లెసి వరుసగా 6,4తో చెన్నై అద్భుత విజయాన్ని పూర్తి చేశాడు.


పూరన్‌ రాకతో జోష్‌: ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జట్టే ఇక్కడ విజయాలు సాధిస్తుండడంతో పంజాబ్‌ కూడా టాస్‌ గెలవగానే మరో ఆలోచన లేకుండా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. కానీ ఎక్కువ భాగం వీరి ఆటతీరు సాదాసీదాగానే సాగింది. దీనికి తోడు డెత్‌ ఓవర్లలో చెన్నై కీలక వికెట్లు తీయడంతో పాటు పరుగులను కూడా నియంత్రించింది. ఓపెనర్లు రాహుల్‌, మయాంక్‌ (26) ఆచితూచి ఆడడంతో పవర్‌ప్లేలో జట్టు 46 పరుగులు సాధించింది. ఈ దశలో స్పిన్నర్‌ చావ్లా తన తొలి ఓవర్‌లోనే మయాంక్‌ వికెట్‌ను తీశాడు. దీంతో మొదటి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మన్‌దీ్‌ప (29) ఉన్న కాసేపు వేగంగా ఆడాడు. 11వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదినా మరుసటి ఓవర్‌లోనే జడేజాకు చిక్కాడు. అయితే అప్పటిదాకా మెరుపులు లేని పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో నికోలస్‌ పూరన్‌  జోష్‌ తెచ్చాడు.


14వ ఓవర్‌లో అతడు 4,6 బాదగా అటు రాహుల్‌ కూడా గేరు మార్చాడు. శార్దూల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో అతను వరుసగా 6,4,4 సాధించడంతో 16 పరుగులు వచ్చాయి. ఇదే క్రమంలో తను 46 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా పూరన్‌ 16, 17వ ఓవర్లలో ఒక్కో సిక్సర్‌ బాదడంతో స్కోరు 150 దాటింది. ఈ సమయంలో స్కోరు 190కి చేరుతుందనిపించింది. కానీ పంజాబ్‌ దూకుడుకు పగ్గాలు వేస్తూ 18వ ఓవర్‌లో 3 పరుగులే ఇచ్చిన శార్దూల్‌.. వరుస బంతుల్లో పూరన్‌, రాహుల్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. మూడో వికెట్‌కు ఈ జోడీ 58 పరుగులు అందించింది. చివరి ఓవర్‌లో సర్ఫరాజ్‌ రెండు ఫోర్లు సాధించగా 12 పరుగులు వచ్చాయి.


పంజాబ్‌:


కేఎల్‌ రాహుల్‌ (సి) ధోనీ (బి) శార్దూల్‌ 63; మయాంక్‌ (సి) సామ్‌ కర్రాన్‌ (బి) చావ్లా 26; మన్‌దీ్‌ప సింగ్‌ (సి) రాయుడు (బి) జడేజా 27; పూరన్‌ (సి) జడేజా (బి) శార్దూల్‌ 33; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 11; సర్ఫరాజ్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 178/4; వికెట్ల పతనం: 1-61, 2-94, 3-152, 4-152; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-17-0; సామ్‌ కర్రాన్‌ 3-0-31-0; శార్దూల్‌ 4-0-39-2; బ్రావో 4-0-38-0; జడేజా 4-0-30-1; చావ్లా 2-0-22-1.


చెన్నై సూపర్‌ కింగ్స్‌:


షేన్‌ వాట్సన్‌ (నాటౌట్‌) 83; డుప్లెసి (నాటౌట్‌) 87; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 17.4 ఓవర్లలో 181/0; బౌలింగ్‌: కాట్రెల్‌ 3-0-30-0, షమి 3.4-0-35-0, హర్‌ప్రీత్‌ 4-0-41-0, జోర్డాన్‌ 3-0-42-0, రవి బిష్ణోయ్‌ 4-0-33-0. 

Updated Date - 2020-10-05T08:40:02+05:30 IST