కొవిడ్‌పై పోరులో భారత్‌కు మరో క్రికెటర్ సాయం

ABN , First Publish Date - 2021-05-04T21:30:05+05:30 IST

ప్రాణాంతక కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు సాయం అందించేందుకు మరో క్రికెటర్ ముందుకొచ్చాడు. యూనిసెఫ్

కొవిడ్‌పై పోరులో భారత్‌కు మరో క్రికెటర్ సాయం

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు సాయం అందించేందుకు మరో క్రికెటర్ ముందుకొచ్చాడు. యూనిసెఫ్ ద్వారా భారత్‌కు సాయం అందిస్తున్నట్టు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ జాసన్ బెహెరెండార్ఫ్ నేడు ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ ఆసీస్ ఆటగాడు తన ఆలోచనలను పంచుకున్నాడు. చాలామంది క్రికెటర్లలానే తనకు కూడా ఇండియా అంటే ప్రత్యేక అభిమానమని పేర్కొన్నాడు. అందమైన ఆ దేశంలో మరెక్కడా లేనంతగా ప్రజలు క్రికెట్‌ను ఆదరిస్తారని అన్నాడు. భారత్ లాంటి దేశాల్లో క్రికెట్ ఆడడమంటే తనకు ఎంతో ఇష్టమన్నాడు.


అలాంటి దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి తనను బాధిస్తోందని, ఈ సమయంలో తనకు చేతనైనంత సాయం చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. తన ఆలోచనలు ఎప్పుడూ భారత్‌ను విడిచిపోవని పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు సాయమందిస్తున్న యూనిసెఫ్ ప్రాజెక్టు ద్వారా విరాళం అందిస్తున్నట్టు తెలిపాడు. తనలానే మరెంతోమంది ముందుకు రావాలని కోరాడు.


తాను సాయంగా ఇచ్చేది కొద్ది మొత్తమేనని, తనపైనా, తన కుటుంబంపైనా ఏళ్లతరబడి భారత్ చూపిస్తున్న ప్రేమాభిమానాలకు అది ఎంతమాత్రమూ సరిపోలదని అన్నాడు. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించిన కాసేపటికే బెహెరెండార్ఫ్ ఈ ప్రకటన చేశాడు. 

Updated Date - 2021-05-04T21:30:05+05:30 IST