పార్టీ సేవ కోసం మంత్రి పదవిని వదులుకున్న సీటీ రవి

ABN , First Publish Date - 2020-11-08T17:28:02+05:30 IST

కర్ణాటక కన్నడ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి

పార్టీ సేవ కోసం మంత్రి పదవిని వదులుకున్న సీటీ రవి

బెంగళూరు : కర్ణాటక కన్నడ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సీటీ రవి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి యడియూరప్ప శనివారం ఆమోదించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన రవి పార్టీ సేవ కోసం మరింత ఎక్కువ కృషి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కన్నడ రాజ్యోత్సవ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో రవి మాట్లాడుతూ, కన్నడ, సంస్కృతుల మంత్రిగా పని చేయడం తన అదృష్టమని చెప్పారు. 


కన్నడ రాష్ట్రం, భాషల కోసం పని చేయడం తనకు గర్వకారణమని, సంతోషకరమని చెప్పారు. అయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ తనకు కొత్త బాధ్యతను అప్పగించిందని తెలిపారు. మంత్రి పదవి బాధ్యతలను, పార్టీ జాతీయ కార్యదర్శి బాధ్యతలను నిర్వహించడంపై ఏక కాలంలో దృష్టి సారించడం కష్టమని తెలిపారు. తాను అక్టోబరు 2న మంత్రి పదవికి రాజీనామా చేశానని, దీనిని ఆమోదించాలని ఇటీవలే మరొకసారి ముఖ్యమంత్రి యడియూరప్పను కోరానని చెప్పారు. ఆయన త్వరలోనే తనకు మంత్రి పదవి బాధ్యతల నుంచి విముక్తి కల్పిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. 


ఇదిలావుండగా, కర్ణాటకలో ఉప ఎన్నికల ఫలితాలు త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యడియూరప్ప తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారకులైనవారికి మంత్రి పదవులు ఇవ్వవచ్చు. 


Updated Date - 2020-11-08T17:28:02+05:30 IST