ఎన్నికల అనంతర హింసపై విచారణలో మమత ప్రభుత్వం విఫలం : హైకోర్టు

ABN , First Publish Date - 2021-07-22T21:36:19+05:30 IST

ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన శాసన సభ ఎన్నికల

ఎన్నికల అనంతర హింసపై విచారణలో మమత ప్రభుత్వం విఫలం : హైకోర్టు

కోల్‌కతా : ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన శాసన సభ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని కలకత్తా హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం సక్రమంగా దర్యాప్తు జరపకపోవడం వల్ల విచారణ కార్యకలాపాలు ప్రతికూలంగా మారాయని తెలిపింది. ఈ హింసాకాండపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. 


శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ సంఘటనలు జరిగినపుడు శాంతిభద్రతలు ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నాయని టీఎంసీ చెప్తోంది. టీఎంసీ కారణంగానే హింస చెలరేగిందని బీజేపీ చెప్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం ఇటీవల ఓ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. రాజకీయ నాయకులు-అధికారగణం-క్రిమినల్స్ మధ్యనున్న సంబంధాలను ఈ హింసాకాండ వెల్లడిస్తోందని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. హింసాత్మక సంఘటనలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేత దర్యాప్తు జరిపించాలని తెలిపింది. విచారణలను పశ్చిమ బెంగాల్ వెలుపల జరిపించాలని సలహా ఇచ్చింది. 


ఈ నివేదికపై సమాధానాన్ని జూలై 26నాటికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 28న జరుగుతుందని తెలిపింది.


Updated Date - 2021-07-22T21:36:19+05:30 IST